శాంతి భద్రతల నియంత్రణ సందర్భంగా జనంపై పెల్లెట్ గన్స్ వాడడం మానుకోవాలని జమ్మూకశ్మీర్ హైకోర్టు స్పష్టం చేసింది.
శ్రీనగర్: శాంతి భద్రతల నియంత్రణ సందర్భంగా జనంపై పెల్లెట్ గన్స్ వాడడం మానుకోవాలని జమ్మూకశ్మీర్ సర్కారుకు ఆ రాష్ట్ర హైకోర్టు శనివారం స్పష్టం చేసింది. వీటికి ప్రత్యామ్నాయాలను కనుగొనేందుకు కమిటీ వేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ పార్లమెంటులో చేసిన ప్రకటనను ప్రస్తావించింది. పెల్లెట్ గన్స్ ప్రాణాంతకమనే మంత్రి మాటలకు అర్థమని ఓ పిటిషన్ విచారణ సందర్భంగా పేర్కొంది.
పెల్లెట్ గన్ దాడిలో కళ్లకు తీవ్ర గాయాలైన ఐదేళ్ల బాలుడి ఫొటోలను ప్రస్తావిస్తూ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ బాలుడు రాళ్లతో దాడి చేశాడని నిందించజాలరని, ఒక వ్యక్తి కళ్లు కోల్పోతే, సమస్తాన్నీ కోల్పోయినట్లేనని పేర్కొంది.
ఇదిలా ఉండగా బందిపొరా, బారాముల్లా, బడ్‌గామ్, గండర్‌బల్ జిల్లాల్లో, శ్రీనగర్‌లో పలుచోట్ల సాధారణ పరిస్థితులు నెలకొనడంతో కర్ఫ్యూ తొలగించారు. అనిశ్చిత కశ్మీర్ ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటించారు. ఆదివారం ఆయన రాజకీయ పార్టీల నాయకులతో పాటు ప్రజాసంఘాల నేతలతో చర్చలు జరిపారు.