Jammu and Kashmir High Court
-
‘పెల్లెట్ గన్స్‌ను వాడొద్దు’
శ్రీనగర్: శాంతి భద్రతల నియంత్రణ సందర్భంగా జనంపై పెల్లెట్ గన్స్ వాడడం మానుకోవాలని జమ్మూకశ్మీర్ సర్కారుకు ఆ రాష్ట్ర హైకోర్టు శనివారం స్పష్టం చేసింది. వీటికి ప్రత్యామ్నాయాలను కనుగొనేందుకు కమిటీ వేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ పార్లమెంటులో చేసిన ప్రకటనను ప్రస్తావించింది. పెల్లెట్ గన్స్ ప్రాణాంతకమనే మంత్రి మాటలకు అర్థమని ఓ పిటిషన్ విచారణ సందర్భంగా పేర్కొంది. పెల్లెట్ గన్ దాడిలో కళ్లకు తీవ్ర గాయాలైన ఐదేళ్ల బాలుడి ఫొటోలను ప్రస్తావిస్తూ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ బాలుడు రాళ్లతో దాడి చేశాడని నిందించజాలరని, ఒక వ్యక్తి కళ్లు కోల్పోతే, సమస్తాన్నీ కోల్పోయినట్లేనని పేర్కొంది. ఇదిలా ఉండగా బందిపొరా, బారాముల్లా, బడ్గామ్, గండర్బల్ జిల్లాల్లో, శ్రీనగర్‌లో పలుచోట్ల సాధారణ పరిస్థితులు నెలకొనడంతో కర్ఫ్యూ తొలగించారు. అనిశ్చిత కశ్మీర్ ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటించారు. ఆదివారం ఆయన రాజకీయ పార్టీల నాయకులతో పాటు ప్రజాసంఘాల నేతలతో చర్చలు జరిపారు. -
జమ్ముకశ్మీర్‌లో రెండు జెండాల విధానం రద్దు
దేశంలోని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా జమ్ముకశ్మీర్ లో కొనసాగుతున్న రెండు అధికారిక జెండాల ప్రదర్శనపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జమ్ముకశ్మీర్ లోని అన్ని ప్రభుత్వ భవనాలు, అధికారిక నివాసాలు, అధికార కార్యక్రమాల్లో కొనసాగుతూ వస్తున్న రెండు జెండాల (మువ్వన్నెల జాతీయ జెండాతోపాటు ఎరుపురంగులోని జమ్ముకశ్మీర్ రాష్ట్ర జెండాను తప్పనిసరిగా ఉంచడం అనే) విధానాన్ని రద్దుచేస్తున్నట్లు, ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంటూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 అమలవుతున్నందున భారత రాజ్యాంగంతోపాటు ఆ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్న రాజ్యాంగాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 అమలులోకి వచ్చినప్పటినుంచి రెండు జెండాల విధానం కొనసాగుతున్నది. అయితే గత ఏడాది మార్చిలో బీజేపీ- పీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు జెండాల విధానానికి స్వస్తిపలికే చర్యలు ఊపందుకున్నాయి. విషయం కోర్టు వరకు చేరగా.. రెండు జెండాల విధానం ఉండాల్సిందేనని నాలుగు రోజుల కిందటే హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కానీ ఆ నిర్ణయాన్ని అదే కోర్టుకు చెందిన విస్తృత ధర్మాసనం శుక్రవారం కొట్టేసింది. ఎరుపు రంగు జెండా లేకుండా కేవలం జాతీయ జెండాను ప్రదర్శించడం ద్వారా ఆ రాష్ట్ర ప్రతిపత్తికి ఎలాంటి విఘాతం వాటిల్లదని తీర్పు సందర్భంగా కోర్టు పేర్కొంది. మొదటి తీర్పును సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై విస్తృత ధర్మాసనం ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఉమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. దశాబ్దాలుగా భారత్ లో అంతర్భాగమైనప్పటికీ జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక జెండా ఉందని, అది కశ్మీరీల గౌరవానికి సూచిక అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, శ్రీనగర్ లోని జమాయి మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం వేర్పాటువాద మూకలు అలజడి సృష్టించాయి. నమాజ్ అనంతరం పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన యువకులు పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలతోపాటు లష్కర్ నేత హఫీజ్ సయ్యద్ చిత్రపటాలను ప్రదర్శించారు. పోలీసులపైకి రాళ్లురువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులకు కష్టపడాల్సివచ్చింది.