
ఏలూరు, సాక్షి: పాస్టర్ ప్రవీణ్ పగడాల(Pastor Praveen Pagadala) మృతి కేసుపై నెలకొన్న అనుమానాలకు పోలీసులు పుల్‌స్టాప్ పెట్టారు. మద్యం మత్తులో బైక్ నడిపి కింద పడిపోవడం వల్లే ప్రవీణ్ ప్రాణాలు పొగొట్టుకున్నారని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్(Ashok Kumar) వెల్లడించారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాకు వివరించారు.
హైదరాబాద్ నుంచి పాస్టర్ బైక్ మీద బయల్దేరారు. ఆయన ప్రయాణించిన మార్గంలో సీసీ టీవీ ఫుటేజీ వివరాలు అన్నీ సేకరించాం. ఒక్క రామవరప్పాడు జంక్షన్ వద్ద సీసీటీవీ ఫుటేజీ లభించలేదు. పాస్టర్ ఆరోజు ఎవరెవరితో మాట్లాడారో గుర్తించాం. పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా విచారించాం. ఆయన్ని హత్య చేశారని, అనుమానాస్పద మృతి అని రకరకాల ప్రచారాలు చేశారు. సోషల్ మీడియాలో అలా దుష్ర్పచారం చేసినవారికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నాం.
అరోజు ప్రవీణ్ కుమార్ వస్తున్నారని కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలియదు. మార్గమధ్యలో ఆరుగురితో పాస్టర్ ప్రవీణ్ మాట్లాడారు. మూడు చోట్ల లిక్కర్ కొనుగోలు చేశారు. మద్యం, పెట్రోల్ బంకులలో యూపీఐ పేమెంట్స్ జరిపినట్లు ఆధారాలున్నాయి. మార్గం మధ్యలో ఓ పోలీస్ అధికారి ప్రవీణ్‌తో మాట్లాడారు. మద్యం సేవించడంతో డ్రైవ్ చేయొద్దని వారించారు. అయినా కూడా ఆయన వినకుండా ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో మూడు చోట్ల ఆయనకు యాక్సిడెంట్లు అయ్యాయి. ప్రమాదంలో హెడ్ లైట్ డ్యామేజ్ అయ్యిది. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ ఇండికేటర్ వేసుకుని పాస్టర్ ప్రయాణించారు.
పోస్ట్ మార్టం రిపోర్టులో, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలో (ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్)లో ఆయన మద్యం సేవించినట్లు తేలింది. మరో వాహనంతో ప్రమాదం జరిగినట్లు ఆధారాలు లభించలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్నపుడు పాస్టర్ ప్రవీణ్ 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. కంకర రోడ్డు కారణంగా బైక్ స్లిప్ అయి రోడ్డుపక్కన గుంతలో పడిపోయారు. గుంత అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల బైక్ ఎగిరి పాస్టర్‌పై పడింది. తలకు బలమైన గాయమై చనిపోయారని వైద్యులు తమ నివేదికలో తెలిపారు. పాస్టర్ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అని ఏలూరు డీఐజీ అశోక్ కుమార్ ప్రకటించారు.
పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో అన్ని విధాలుగా, క్షుణ్ణంగా పరిశోధించామని ఆయన తెలిపారు. కంకర వల్ల బైక్ స్లిప్ అయి పడిపోవడమే పాస్టర్ మరణానికి కారణమని, మరే వాహనం ఆయన బైక్ ను ఢీ కొట్టలేదని స్పష్టంగా తేలిందన్నారు. పాస్టర్ బయలుదేరిన సమయం నుంచి ప్రమాద స్థలం వరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే వివరాలు పరిశోధించి తెలుసుకున్నామని ఆయన వివరించారు.