కత్తితో భార్య మెడపై విచక్షణా రహితంగా నరికి హత్య
రామానుజపురంలో ఘటన.. పోలీసుల అదుపులో భర్త?
పదేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు.. కోర్టులో విడాకులకు దరఖాస్తు
కొయ్యలగూడెం: భర్తే కాలయముడై భార్యను కడతేర్చాడు. కత్తితో విచక్షణా రహితంగా నరకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సీఐ మధుబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామానుజపురం గ్రామానికి చెందిన రాజనాల సాయి లక్షి్మ(35)కి భర్త సూర్యచంద్రంతో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి విలాష్ సాయి, విశాల్ సాయి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారుగా పది సంవత్సరాల నుంచి వీరు నిత్యం గొడవలు పడుతూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో సూర్యచంద్రంపై సాయి లక్ష్మి కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపివేశారు. అనంతరం ఇద్దరూ కోర్టులో విడాకుల కొరకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు కొనసాగుతోంది. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇంట్లో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. సాయిలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా.. సూర్యచంద్రం ఆవేశంతో ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని సాయి లక్ష్మి మెడపై విచక్షణారహితంగా నరకడంతో ఆమె రోడ్డుపై పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
భర్తను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా తన కుమార్తెను అల్లుడు సూర్యచంద్రం ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని, కొంతకాలంగా తన కుమార్తెను ఆడపడుచు, భర్త, అత్తమామలు చిత్రహింసలకు గురిచేస్తున్నారని తల్లి నాగలక్ష్మి ఆరోపించింది. బిడ్డల్ని కూడా అల్లుడు చూసుకునేవాడు కాదని, కుమార్తె తన వద్దకు వచ్చి నిత్యావసర సరుకులు తీసుకువెళుతూ ఉండేదని తల్లి పేర్కొంది. తన చెల్లెలు మృతి వెనుక సూర్యచంద్రం తల్లిదండ్రులు, చెల్లి, బావ ఉన్నారని అన్న మృతురాలి అన్న సుబ్రహ్మణ్యం ఆరోపించాడు. దీనిపై మృతురాలి తల్లి, అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ సురేష్ కుమార్‌రెడ్డి నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment