
2024–25లో అత్యధికంగా 13,83,855 మంది రాకపోకలు
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) ప్రయాణికుల రద్దీ పరంగా 2024–25 ఆ ర్థిక సంవత్సరంలో సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఇక్కడి నుంచి 13,83,855 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వారిలో దేశీయంగా 13,54,925 మంది, అంతర్జాతీయంగా 28,930 మంది ప్రయాణం చేశారు.
గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రయాణికుల వృద్ధి రేటు 30.24 శాతంగా నమోదైంది. ఈ విమానాశ్రయం ద్వారా 10 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించడం ఇది నాలుగోసారి. పెరిగిన విమాన సర్వీస్‌లు, ఎయిర్‌లైన్స్ సంస్థల మధ్య పోటీ కారణంగా టిక్కెట్ ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి రావడం ప్రయాణికుల వృద్ధికి కారణమని ఎయిర్‌పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి. -విమానాశ్రయం (గన్నవరం)
విస్తరిస్తున్న విమాన సర్వీసులు
కోవిడ్ సమయంలో రద్దయిన అనేక విమాన సర్వీసులను ఎయిరిండియా, ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థలు పునఃప్రారంభించాయి. కొత్తగా 2024–25లో ముంబైకి రెండు సర్వీస్‌లు, న్యూఢిల్లీకి అదనంగా మూడో సర్వీస్, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడికి రోజుకు 25 వరకు విమాన సర్వీస్‌లు వస్తుండగా, మరో 25 సర్వీస్‌లు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. రోజుకు సగటున 3,850 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
దేశీయంగా న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, కడప నుంచి ఇక్కడికి విమాన సర్వీస్‌లు నడుస్తున్నాయి. అంతర్జాతీయంగా షార్జా–విజయవాడ మధ్య వారానికి రెండు సర్వీస్‌లు నడుస్తున్నాయి. భవిష్యత్‌లో వారణాసి, కొచ్చి, మలేషియా, శ్రీలంక, సింగపూర్, కువైట్‌కు సర్వీస్‌లు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
గణనీయంగా పెరిగిన ప్రయాణికులు
రెండో ప్రపంచ యుద్ధ అవసరాల నిమిత్తం బ్రిటీష్ పాలకులు నిర్మింంచిన ఈ విమానాశ్రయం అంచలంచెలుగా ఎదిగి 2017లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా గుర్తింపు సాధించింది. అందుకు తగ్గట్లుగా దేశంలోని ప్రధాన పట్టణాలకు విమాన సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా 2017–18లో 7,46,392 మంది ఉన్న ప్రయాణికుల సంఖ్య 2018–19కు 11,92,000 మందికి చేరుకుంది.
2019–20 ఆర్థిక సంవత్సరం చివరిలో కోవిడ్ ప్రభావం కారణంగా ప్రయాణికుల సంఖ్య 11,30,583కు తగ్గింది. అనంతరం రెండేళ్ల పాటు విమానయాన రంగం కుదేలైంది. కోవిడ్ పూర్తిగా అదుపులోకి రావడంతో 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఎయిర్‌పోర్ట్ పూర్వ వైభవం సంతరించుకుంది.