
సాక్షి, అనంతపురం: నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (Rayalaseema Express)లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఐదుగురు దుండగులు అర్ధరాత్రి రైలులోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు.
వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా గుత్తి వద్ద రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. దాదాపు 30 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. దీనిపై 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్‌క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపిన సమయంలోనే దుండగులు చోరీకి పాల్పడ్డారు. రైలులోని 10 బోగీల్లో దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
