
విద్యా, ఉద్యోగాల్లో తక్షణం వర్తిస్తాయని సీఎస్ స్పష్టీకరణ
ఎస్సీ వర్గీకరణలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు
సాక్షి, అమరావతి: ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం... దానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల(ఉప వర్గీకరణ) నిబంధనలు–2025 పేరిట మార్గదర్శకాల(రూల్స్)ను విడుదల చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌లోని సెక్షన్–3 ప్రకారం రాష్ట్రంలోని 59 ఎస్సీ ఉప కులాలను మూడు గ్రూపులుగా చేసి 15శాతం రిజర్వేషన్‌ను వర్గీకరించినట్లు తెలిపారు.
» గ్రూప్–1లో ఉన్న 12 రెల్లి ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇందులో బావురి(సీరియల్ నంబర్ 8), చచటి(12), చండాల(16), దండసి(18), డోమ్, దొంబర, పైడి, పనో(20), ఘాసి, హడ్డి, రెల్లి చచండి(22), గొడగలి, గొడగుల(23), మెహతార్(48), పాకీ, మోతి, తోటి(51), పమిడి(53), రెల్లి(55), సప్రు(58) కులాలు ఉన్నాయి.
» గ్రూప్–2లో 18 మాదిగ ఉపకులాలకు 6.50శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ గ్రూపులో అరుంధతీయ(సీరియల్ నంబర్ 5), బైండ్ల(10), చమర్, మోచి, ముచి, చమర్–రవిదాస్, చమర్–రోహిదాస్(14), చంభర్(15), డక్కల్, డొక్కల్వార్(17), ధోర్(19), గోదారి(24), గోసంగి(25), జగ్గలి(28), జంబువులు(29), కొలుపులవాండ్లు, పంబాడ, పంబండ, పంబాల(30), మాదిగ(32), మాదిగ దాసు, మష్తీన్(33), మాంగ్(43), మాంగ్ గరోడి(44), మాతంగి(47), సమగర(56), సింధోల్లు, చిందోల్లు(59) కులాలు ఉన్నాయి.
» గ్రూప్–3లో 29 మాల ఉపకులాలకు 7.5శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ గ్రూపులో ఆది ద్రవిడ(సీరియల్ నంబర్ 2), అనాముక్(3), అరే మాల(4), అర్వమాల(6), బరికి(7), బయగార, బయగారి(11), చలవాడి(13), ఎల్లమలవార్, ఎల్లమ్మలవాండ్లు(21), హోలెయా(26), హోలెయ దాసరి(27), మాదాసి కురువ, మదారి కురువ(31), మహర్(34), మాల, మాల అయ్యవారు(35), మాలదాసరి(36), మాలదాసు(37), మాలహన్నాయి(38), మాలజంగం(39), మాలమస్తీ(40), మాలాసేల్, నెట్కాని(41), మాలసన్యాసి(42), మన్నె(45), ముండాల(50), సంబన్(57), యాతల(60), వల్లువన్(61), ఆది ఆంధ్ర(1), మస్తీ(46), మిత అయ్యాళ్వార్(49), పంచమ, పరియా(54) కులాలు ఉన్నాయి.
మహిళలకు 33శాతం రిజర్వేషన్లు
ఎస్సీ ఉపకులాల వర్గీకరణలో మూడు గ్రూపుల్లోను మహిళలకు 33(1/3)శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నియామకాలు, బ్యాక్‌లాగ్ పోస్టులు తదితర వాటిలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ వర్తింపజేస్తారు.
200 రోస్టర్ పాయింట్లు... రెండు సర్కిల్స్‌గా అమలు
ఆర్డినెన్స్‌లో పేర్కొన్న ఎస్సీ ఉప కులాలకు మొత్తం 200 రోస్టర్ పాయింట్లను రెండు సర్కిల్స్‌గా అమలుచేయాలని సీఎస్ నిర్దేశించారు. మొదటి వంద (1 నుంచి 100 వరకు)లో రెల్లి ఉపకులాలకు ఒకటి, మాదిగ ఉపకులాలకు ఆరు, మాల ఉపకులాలకు ఎనిమిది రోస్టర్ పాయింట్లు కేటాయించారు. రెండవ వంద(101 నుంచి 200 వరకు)కు రెల్లి ఉపకులాలకు ఒకటి, మాదిగ ఉపకులాలకు ఏడు, మాల ఉపకులాలకు ఏడు చొప్పున రోస్టర్‌పాయింట్లు కేటాయించారు.
రోస్టర్ ప్రకారం మొదటి వంద పోస్టుల్లో గ్రూప్–1కు 2, గ్రూప్–2కు 7, 22, 41, 52, 66, 77, గ్రూప్–3కు 16, 27, 47, 62, 72, 87, 91, 97 రోస్టర్ విధానం నిర్ణయించారు. రెండవ వంద పోస్టుల్లో గ్రూప్–1కు 2, గ్రూప్–2కు 7, 22, 41, 52, 66, 77, 97, గ్రూప్–3కి 16, 27, 47, 62, 72, 87, 91 రోస్టర్ విధానాన్ని సిఫార్సు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చే నోటిఫికేషన్‌లలో పోస్టులకు రోస్టర్ పాయింట్ల ప్రకారం ఆయా గ్రూపుల్లో అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే వేరేవారితో భర్తీ చేకూడదు. నిర్దేశించిన వారి కోసమే రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలి. అప్పటికీ ఆ గ్రూపులో అర్హులైన అభ్యర్థులు లేకపోతే మూడవసారి నోటిఫికేషన్ ద్వారా ఆ తర్వాత గ్రూపులో అర్హులతో భర్తీ చేయవచ్చు.