శ్రీకృష్ణ లీలలు | Internal Fight In TDP Palnadu Politics Over MP Lavu Sri Krishna Devarayalu, More Details Inside | Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణ లీలలు

Published Tue, Apr 29 2025 1:38 PM | Last Updated on Tue, Apr 29 2025 5:06 PM

Internal fight In TDP Palnadu politics

 పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీలో లుకలుకలు 

ఎంపీ తీరుతో ఎమ్మెల్యేల అసంతృప్తి 

పైకి హుందాతనం.. లోన మోనార్కిజం 

ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలు 

తలలు పట్టుకుంటున్న అధికార పార్టీ నేతలు 

 వైఎస్‌ జగన్‌ అందుకే పక్కన పెట్టారంటున్న తెలుగు తమ్ముళ్లు 

తీరు మారకపోతే పార్టీ కార్యక్రమాలకు పిలవబోమని హెచ్చరికలు  

ఆయన నవ్వాడంటే అక్కడ శత్రుత్వపు బీజాలు పడినట్టే.. ఆయన కరచాలనం చేశాడంటే.. అక్కడ కేడర్‌ మధ్య అడ్డుగోడలు కట్టినట్టే.. ఆయన ఆలింగనం చేశాడంటే అక్కడ గ్రూపులు ప్రారంభమైనట్టే.. ఆయన అడుగు పెట్టాడంటే అక్కడ పార్టీలో లుకలుకలు మొదలైనట్టే.. ఇదీ నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తీరుపై ఆ పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్న అభిప్రాయం. పల్నాడులో శ్రీకృష్ణ‘తలభారం’తో తెలుగుదేశం పార్టీకి బొప్పి కడుతోంది. అమ్మో ఈ ఎంపీ మాకొద్దు బాబోయ్‌ అంటూ తలలు పట్టుకుంటోంది.

సాక్షి, గుంటూరు: పల్నాడు రాజకీయాల్లో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సరికొత్త భాష్యానికి తెర తీశారు. మామూలుగా పల్నాడు రాజకీయాలంటే ప్రతీకారాలు, ప్రత్యక్ష యుద్ధాలు. కానీ శ్రీకృష్ణదేవరాయలు అడుగుపెట్టాక కొత్తకోణాన్ని పల్నాడు రాజకీయాలకు పరిచయం చేశాడు. ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోశాడు. తాను అనుకున్నదే జరగాలనే ఒంటెత్తు పోకడలతో కేడర్‌ మధ్య చిచ్చు పెట్టారు. ఇలా తన రాజకీయ ప్రస్తానంలో పైకి సౌమ్యుడిలా.. లోన కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు.  

వర్గపోరుకు కేరాఫ్‌.. 
గతంలో వైఎస్సార్‌ సీపీ తరఫున నరసరావుపేట ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణ దేవరాయలు 
పారీ్టలో వర్గ పోరు కొనసాగించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి రజిని, అప్పటి వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో విభేదాలు ఉండేవి. గురజాలలో కాసు మహేష్‌రెడ్డికి పక్కలో బల్లెంలా మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఈ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా గ్రూప్‌ రాజకీయాలను పెంచి పోషించాడన్న అపవాదు మూటకట్టుకున్నాడు.  మిగిలిన నియోజకవర్గ ఎమ్మెల్యేలతోనూ పైకి స్నేహపూర్వకంగా ఉన్నట్టు నటిస్తూ అంటీముట్టనట్లు వ్యవహరించే వారు. తనకంటూ అన్ని నియోజకవర్గాలలో ప్రత్యేక వర్గాన్ని పెంచి పోషించేవారు. 

అందుకే జగన్‌ పక్కన పెట్టేశారు..
వైఎస్సార్‌ సీపీలో చేరిన శ్రీకృష్ణదేవరాయలుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రాజకీయాల్లో యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2019 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ సీటు ఇచ్చారు. అక్కడ గెలుపొందిన శ్రీకృష్ణదేవరాయలు మొదటి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. జిల్లా వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని, ఎమ్మెల్యేలంతా తన తర్వాతే అనే ధోరణిలో వ్యవహరించే వారు. ఇది అప్పటి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలకు  తలనొప్పిగా మారింది.

ఈ విషయాలపై శ్రీకృష్ణదేవరాయలును వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సున్నితంగా మందలించారని కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి రజిని బహిరంగంగా చెప్పారు.  తాము అధికారంలో ఉండగా శ్రీకృష్ణదేవరాయలు ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని మీడియా ముఖంగా మాజీ మంత్రి విడదల రజిని కుండబద్దలు కొట్టారు. దీనిపై స్పందించిన ఎంపీ.. నాలుగు ముక్కలు చెప్పి వేరే విషయాలు మాట్లాడి చేతులు దులుపుకొన్నారని, దీటైన జవాబు ఇవ్వలేకపోయాడని తెలుగుదేశం పార్టీ వర్గాలే పెదవి విరిచాయి. తనను ఎంపీగా గెలిపించిన పార్టీ, ఎమ్మెల్యేలకు మోసం చేయడంతోనే వైఎస్సార్‌ సీపీ నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పక్కన పెట్టేశారని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆ తలనొప్పి మాకు తగులుకుందని వాపోతున్నారు.

టీడీపీలోనూ అదే పంథా.. 
కూటమి తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీగా రెండోసారి గెలిచారు. ఎన్నికల సమయంలో ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో గ్రూపు రాజకీయాలు నడిపారు. టీడీపీలోకి చేరే సమయంలోనే ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కొన్ని కండీషన్లు పెట్టిమరి కండువా కప్పుకున్నారని సమాచారం. అందులో భాగంగా గురజాలలో జంగా కృష్ణమూర్తిని ప్రోత్సహించి యరపతినేనికి టికెట్‌ రానీయకుండా పావులు కదిపారనే ప్రచారం నడిచింది.   

= నరసరావుపేటలో బీసీ అభ్యర్థి అరవింద్‌ బాబుకు చివర వరకు బీఫారం రాకుండా అడ్డుకున్నారు. జనసేన నేత జిలాని, కొంతమంది టీడీపీ నేతలతో జట్టు కట్టి అక్కడ కుట్రలకు తెర తీశారు. ఆ సమయంలోనే అరవింద్‌ బాబు, శ్రీకృష్ణదేవరాయలు మధ్య విభేదాలు పొడచూపి బహిరంగంగా తిట్టుకొనే వరకు వెళ్లాయి. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వైరం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. అధికారంలోకి వచ్చి సుమారు ఏడాది కావొస్తున్నా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమం ఒక్కటీ చేపట్టలేదు.  

⇒ ఇక చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావును కాదని మర్రి రాజశేఖర్‌ వర్గాన్ని ఆదరిస్తున్నారు.  రానున్న ఎన్నికల్లో మర్రి రాజశేఖర్‌కే పేట ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తానని ఎంపీ హామీ ఇచ్చారన్న ప్రచారంతో పత్తిపాటి వర్గం గుర్రుగా ఉంది.   

⇒ వినుకొండలో తనతోపాటు వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే  మక్కెనను ఎంపీ ప్రాధాన్యత ఇవ్వడంతో స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వర్గం జీరి్ణంచుకోలేకపోతోంది. గతంలో బొల్లాకు ఇలానే తలనొప్పి తెప్పించారని గుర్తుచేసుకుంటున్నారు.   

⇒ మాచర్లలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి వ్యతిరేకంగా సొంతపారీ్టలోనే మరో గ్రూపు కడుతున్నారు. ఈ వర్గం ద్వారా బ్రహ్మారెడ్డికి ఇక్కట్లు తీసుకొస్తున్నారు. వైఎస్సార్‌ సీపీలో వర్గ రాజకీయాలు చేసిన లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరిన తర్వాత అదే పంథా కొనసాగిస్తున్నారు. నచ్చిన వారు ఎన్ని తప్పులు చేసినా అందలమెక్కిస్తారని, నచ్చకపోతే వారిని అధఃపాతాళానికి తొక్కుతారనే విమర్శలు ఉన్నాయి.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement