
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి నేతల అరాచకాలు నానాటికీ శ్రుతి మించిపోతున్నాయి. పట్టపగలే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కిడ్నాప్‌లు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ.. చోద్యం చూస్తూ ఉండిపోయింది. టీడీపీ గుండాల దాడులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు, రెండో బాస్ లోకేష్‌లు పట్టనట్లు ఉంటున్నారు. మరోవైపు.. ఆమధ్య ఏపీలో శాంతిభద్రల గురించి ఆందోళన వ్యక్తం చేసిన పవన్.. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నా మౌనంగా ఉండిపోయారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత అన్యాయాలు జరిగాయో కళ్లారా చూసింది ఏపీ. అధికార పార్టీలు ఎన్నికల ప్రక్రియను అవహేళన చేసేశాయి. బలం లేనిచోట్ల కూడా బలవంతంగా కూటమి నేతలను గెలిపించుకుంది. ప్రలోభాలు, బెదిరింపులు, దాడులతో.. వైఎస్సార్సీపీ నుంచి సభ్యులను తమ దారికి తెచ్చుకున్నాయి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత.. తాము బెదిరింపులతోనే ఓటేశామని భూమన వద్ద వైఎస్సార్సీపీ సభ్యులు మొరపెట్టుకున్న పరిస్థితి చూసిందే. హిందూపురం సహా మరికొన్ని చోట్లా అదే పరిస్థితి. పాలకొండ, పిడుగురాళ్ల, తునిలో అయితే కూటమి ఎఫెక్ట్‌తో రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి.
చివరికి ఎమ్మెల్సీలకూ రక్షణలేని దుస్థితితో పోలీసు బాసులు ఉన్నారు. నిర్మోహమాటంగా కూటమి తెచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగానికే సెల్యూట్ చేస్తున్నారు. ఏపీలో అఘాయిత్యాలపై ప్రశ్నించిన పవన్.. ఆ తర్వాత ఏమైందోగానీ చల్లబడ్డారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల సంగతి సరేసరి. టీడీపీ దాడులపై ప్రశ్నించే దమ్ము వాటికి లేకుండా పోయింది. దీంతో వైఎస్సార్సీపీ ఒంటరి పోరు కొనసాగిస్తోంది. మరోవైపు.. ఈ అరాచకాలతో ప్రజాస్వామ్య వాదులు భయపడుతున్నారు. న్యాయస్థానాలు, మానవ హక్కుల సంఘాలు ఇప్పటికైనా ఏపీ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నారు.