
– కాత్యాయనీ విద్మహే
నచ్చటం అనేది నిరపేక్ష అంశం కాదు. ప్రత్యేకించి సాహిత్య పాత్రలు నచ్చటం– అవి చదివిన కాలం నాటి మన వయసు, ఆలోచనా స్థాయి, భావుకత్వ శక్తి వీటన్నిటిని బట్టి ఉంటుంది. అందువల్ల ఒకసారి నచ్చింది అలాగే ఉండిపోతుంది అనుకొనటానికి లేదు. ఒకొకసారి యూటర్న్ కూడా తీసుకోవచ్చు. లేదా గుణాత్మకంగా పరిణామామూ చెందవచ్చు. నా సాహిత్య సహవాసం ఆరోతరగతి నుండి వారపత్రికలలో సీరియల్‌గా వచ్చే స్త్రీల నవలలు చదవటంతో మొదలైంది (1966 –67). ఆ వరుసలో రంగనాయకమ్మ స్వీట్ హోమ్ (Sweet Home) నవలలోని విమల పాత్ర నాకు చాలా నచ్చింది.
పన్నెండు పదమూడేళ్ల వయసులో విమల నాకెందుకు నచ్చింది? ఇళ్లల్లో కనబడే దాంపత్య సంబంధాల్లోని గంభీర ముద్రను, ఒద్దికను చెరిపేస్తూ భర్తతో అల్లరిగా, చిలిపిగా, చనువుగా ప్రవర్తించే ఆ పాత్ర విశిష్ట వ్యక్తిత్వం నన్ను ఆకర్షించిందా? అప్పటికి నేను చదివిన నవలల్లోని స్త్రీ పాత్రలకు భిన్నంగా తాను లోపల ఏమి అనుకొంటున్నదో దానిని ఎవరేమనుకొంటారో అని లోలోపల అణిచేసుకోకుండా బయటకు అనగల ధీరత్వం వలన విమల నాకు అపురూపంగా అనిపించిందా? ఆ క్రమంలో తాను స్త్రీ, భార్యే అయినా ప్రత్యేకవ్యక్తిని అన్న నిరంతర చైతన్యంతో జీవించటం వల్ల నాకు నచ్చిందా? ఏమో !? నాకవన్నీ ఆ రోజుకు ఇంత స్పష్టంగా తెలుసునని చెప్పలేను.
కానీ ఆ నవల చదువుతూ సమ న్యాయానికి, సహజీవన సౌందర్యానికి సంబంధించిన అవ్యక్త అనురాగం ఏదో నా లోలోపల ఊపిరి పోసుకొంటుంటే విమల ప్రేమలో పడిపోయానన్నది వాస్తవం. ఆ తరువాత ఎన్నిసార్లు ఆ నవల (Novel) చదివానో లెక్కలేదు. విమల ఎందుకు నచ్చిందో ఆ కారణాలు రోజురోజుకీ మరింత విశదం అవుతూ వస్తున్నాయి.
స్త్రీకి సహజ లక్షణాలుగా సమాజం నిర్దేశిస్తున్న విలువలను తిరస్కరించటం విమలను ప్రత్యేకంగా నిలబెడుతుంది. శాంతం, సహనం స్త్రీ«ధర్మాలు అనే బోధలు ఆమె సహించలేదు. పతివ్రతలుగా జీవించటం, మరణించటం స్త్రీకి ఆదర్శం చేసిన వ్యవస్థపై ఆమెకు కోపం. స్త్రీకి భర్త పట్ల అనురాగం స్వచ్ఛందంగా సహజ మానవీయ సంబంధాల నుండి కలగవలసినదే కానీ పై నుండి నిర్బంధం వల్ల కాదు అన్నది ఆమె నిశ్చితాభిప్రాయం.
భర్త కోసం తాను ఇష్టంగా ఇంటి పని ఎంతైనా చేయవచ్చు కానీ, ఇంటి పని స్త్రీలదే అంటే మాత్రం విమల ఒప్పుకోదు. వంటిల్లు మగవాడిది కూడా అని చెప్పగలిగిన సమాన హక్కుల చైతన్యం ఆమెది. ఆమె సంస్కరణ కుటుంబానికి పరిమితమైనదే. కానీ కుటుంబంలో భార్యాభర్తల సంబంధాలలో ప్రజాస్వామీకీకరణను కలగనగలిగిన ఆధునిక మధ్యతరగతి యువతిగా విమల నాకు నచ్చిందనుకొంటాను. కుటుంబానికి అవతల నాకు అంతగా నచ్చిన మరొక స్త్రీ పాత్ర మధురవాణి.