
చెమటలు పట్టడం అనేది చాలా సాధారణ విషయం.. ఎందుకంటే శరీర శ్రమ అతిగా చేయడం వల్ల అందరిలో చెమట పడుతూ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో మరింత సహజం. అయితే కొందరిలో చెమట విచ్చలవిడిగా పడుతూ ఉంటుంది. దీంతోపాటు కొందరిలో అకస్మాత్తుగా చెమటలు వస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు చాలామంది దీనిని సాధారణ సమస్యగా భావించి తేలిగ్గా తీసుకుంటున్నారు. దీని వల్ల భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలని కొని తెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇలా మీకు జరుగుతుంటే మాత్రం మీ ఒంటి మీద మీరు కాస్తంత శ్రద్ధ తీసుకోవాల్సిందే మరి! అకస్మాత్తుగా చెమటలు పట్టడం అనేకరకాల అనారోగ్య సమస్యలకు ముందస్తు సూచనలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని గుండెజబ్బుల లక్షణాలలో ఒకటిగా వైద్యులు భావిస్తారు. తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ముందు తరచు ఆకస్మాత్తుగా చెమటలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. మీలో ఇలాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించడం, వారి సలహా మేరకు హెల్త్‌చెకప్ చేయించుకోవడం మంచిదని అనుభవజ్ఞుల సలహా.
అధిక చెమట ఈ వ్యాధుల లక్షణాలలో ఒకటి... అకస్మాత్తుగా చెమటలు పట్టడం గుండెపోటు మొదటి లక్షణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మహిళలకు రాత్రిపూట ఎక్కువగా చెమట పడడం వల్ల భవిష్యత్‌లో రానున్న తీవ్రసమస్యలకు సంకేతాలు. తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కూడా ఎక్కువగా చెమట పడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమందిలో మధుమేహం పెరగడం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి.
అకస్మాత్తుగా వచ్చే చెమటలు రాకుండా ఉండాలంటే...
- ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించడం.
- మద్యపానం అలవాటుంటే వెంటనే మానేయడం.
- ఆకు కూరలు, పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం.
- గ్రీన్ టీ తీసుకోవడం ∙రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తాగడం.
- డీప్ ఫ్రైలు, ఇతర నూనె పదార్థాలను తగ్గించడం.
- ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలు చేయడం ∙పద్ధతి ప్రకారం డైట్ తీసుకోవడం అవసరం.