
ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలకు సిద్ధంగా ఉండాలి: ట్రంప్
న్యూయార్క్: అమెరికా ఉత్పత్తులపై విదేశాలు వసూలు చేస్తున్న టారిఫ్‌ల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసహనం వెళ్లగక్కారు. భారతదేశంలో అధికంగా టారిఫ్‌లు విధిస్తున్నారని మళ్లీ అసంతృప్తి వ్యక్తంచేశారు. నిజంగా అధిక సుంకాలు విధిస్తున్న దేశం భారత్ అని పేర్కొన్నారు. ఇది న్యాయబద్ధం కాదని చెప్పారు. తమకు న్యాయం జరగాలంటే అదే రీతిలో ప్రతిస్పందించక తప్పదని స్పష్టంచేశారు. ప్రతీకార సుంకాలు విధించబోతున్నామని, వచ్చే నెల 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తేలి్చచెప్పారు.
తమ ఉత్పత్తులపై విచ్చలవిడిగా టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల ఉత్పత్తులపైనా అదే స్థాయిలో టారిఫ్‌లు విధించబోతున్నామని ఉద్ఘాటించారు. ఇండియా, చైనాతోపాటు ఏ దేశమైనా సరే తమ ఉత్పత్తులు వాడుకుంటే భారీగా సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇన్నాళ్లూ అమెరికాను దోచుకున్నారని, ఇకపై అది సాగనివ్వబోమని హెచ్చరించారు. ఆయన గతంలో కూడా ఇండియాను ‘టారిఫ్ కింగ్’, ‘బిగ్ అబ్యూసర్’ అని నిందించారు. ఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 100 బిలియన్ డాలర్లుగా(రూ.8.70 లక్షల కోట్లు) ఉందని ట్రంప్ చెబుతున్నారు. దీన్ని తగ్గించాల్సిందేనని పట్టుబడుతున్నారు.
అమెరికాకు గేమ్ ఛేంజర్
వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో గురువారం కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకాలు చేశారు. అమెరికా పాల ఉత్పత్తులతోపాటు ఇతర వస్తువులపై కెనడాలో 250 శాతం టారిఫ్‌లు విధిస్తున్నారని ఆక్షేపించారు. కెనడా ఉత్పత్తులు ఇకపై తమకు అవసరం లేదని, ఒకవేళ దిగుమతి చేసుకున్నా భారీగా సుంకాలు విధిస్తామని స్పష్టంచేశారు. విదేశీ ఉత్పత్తులపై ఇప్పుడు విధిస్తున్న టారిఫ్‌లు తాత్కాలికమేనని, అసలైన మోత ఏప్రిల్ 2 నుంచి మోగబోతోందని, అందుకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. అమెరికాకు ఇదొక గేమ్ ఛేంజర్ కాబోతోందని వివరించారు.