
ఉసురు తీసిన అక్రమ తవ్వకాలు!
కోనేరుసెంటర్: అక్రమ మట్టి తవ్వకాలు ఓ మైనర్ ఉసురు తీశాయి. ఘటన బందరు మండలం పొట్లపాలెం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బందరు మండలం బుద్దాలపాలెం గ్రామానికి చెందిన కొక్కు మణికంఠ (15) పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. అతని తల్లిదండ్రులు కొండలరావు, జలజకుమారి వ్యవసాయ పనులు చేస్తుంటారు. వీరికి ఒక పాప కూడా ఉంది. ఇదిలా ఉండగా పదో తరగతి పాస్ అయిన మణికంఠ మట్టి ట్రాక్టర్‌పై పనికి వెళ్తున్నాడు. శుక్రవారం ట్రాక్టర్‌పై బుద్దాలపాలెం నుంచి కొత్తపూడి వెళ్లి మట్టిని డంప్ చేసిన అనంతరం తిరిగి మట్టి దిబ్బల వద్దకు ట్రాక్టర్‌పై బయలుదేరారు. పొట్లపాలెం – బుద్దాలపాలెం మార్గంమధ్యలో రోడ్డుపై ఉన్న గోతిలోకి ట్రాక్టర్ ఒరగటంతో డ్రైవర్ పక్కన కూర్చున్న మణికంఠ ఒక్కసారిగా కిందికి పడిపోయాడు. ఘటనలో ట్రాక్టర్ ట్రక్కు టైరు మణికంఠ తలపై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్న మణికంఠను చూసి విలపించారు. అతన్ని అంబులెన్స్‌లో మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. మణికంఠ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఘటనపై తల్లి జలజకుమారి బందరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.
పిలిచి చంపేశారయ్యా:
పదో తరగతి పాసైన ఆనందం మా బిడ్డకు ఎన్నో రోజులు లేకుండానే దేవుడు దక్కరకు వెళ్లిపోయాడయ్యా అంటూ తల్లిదండ్రులు పెడుతున్న ఆర్తనాదాలు చూపరులను సైతం కంటతడిపెట్టించింది. ఇంట్లో ఆడుకుంటున్న తన బిడ్డను ట్రాక్టర్ పనికి రమ్మంటూ పిలుచుకెళ్లి మరీ చంపేశారంటూ బోరున విలపించారు. మద్యం మత్తులో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్టేషన్‌లో తిష్టవేసి
ఇదిలా ఉండగా మైనర్ బాలుడు చనిపోయి అంత్యక్రియలైనా జరగకుండానే జనసేన నాయకులు ఈ కేసును నీరుగార్చడానికి బందరు రూరల్ పీఎస్‌లో తిష్టవేసి పోలీసులకు నయానో భయానో నచ్చజెప్పుకుని అక్రమంగా మట్టిని అమ్ముకుంటున్న గ్రామంలోని టీడీపీ నాయకుడిని బయటపడేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ కాగితాలు ఫోర్సులో లేకపోవటానికి తోడు డ్రైవర్‌కు లైసెన్స్ కూడా ఉండకపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసులో ఏ విధంగా వ్యవహరిస్తారన్నది వేచి చూడాల్సిందే మరి.
ఈ పాపం ఎవరిదీ !
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండలంలో మట్టి మాఫియా ఆగడాలు అధికమయ్యాయి. మండలంలో అక్రమంగా మట్టి తోలకాలు జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో మట్టి మాఫియా మరింత రెచ్చిపోతోంది. ఇదిలా ఉండగా బుద్దాలపాలెంలో జరిగిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ మృతుని తరఫు బంధువులు ప్రశ్నిస్తున్నారు.
అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్న కూటమి నాయకులదా...? పట్టించుకోని రెవిన్యూ అధికారులదా...? లేక అధికార దర్పంతో మండలంలో మట్టిని అమ్ముకుని లక్షలు పోగుచేసుకుంటున్న ప్రజాప్రతినిధులదా అంటూ నిలదీస్తున్నారు.
ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి ఇంట్లో ఉన్న పిల్లాడిని పిలిచి చంపేశారంటూ తల్లి ఆవేదన కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న జనసేన నేతలు టీడీపీ నేత మట్టి అక్రమ తరలింపు కారణంగానే ఘటన!