
సాధారణంగా అందంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందేంత అభినయం కూడా ఉండడం అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే సాధించగలిగిన విజయం. అలాంటి విజయవంతమైన కధానాయికల్లో అమలాపాల్ ఒకరు. తమిళం, మలయాళం తెలుగు సినిమాలలో నటిస్తూ బహుభాషా నటిగా తన అందానికి, అభినయానికి సమాన ప్రశంసల్ని పొందిన ఈ నటి నిర్మాత కూడా. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుతో సహా ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీతగా అమల పాల్(Amala Paul) పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే ఏమీ తెలీకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నాటి అమలాపాల్‌కి ప్రస్తుతం ఉన్న వ్యక్తికి చాలా తేడా ఉందని ఆమె అంటోంది.
అమలా పాల్,నటిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తాను విజయాలు మాత్రమే కాదు మరెన్నో సవాళ్లతో నిండిన ప్రయాణాన్ని సాగించానని వెల్లడించింది. . వ్యక్తిగత వృత్తి పరమైన ఎదుగుదలతో పాటు జీవితంలోని హెచ్చు తగ్గులు తన మార్గానికి ఒక రూపాన్ని ఇచ్చాయి అంటోంది. మళ్లీ ప్రేమ, మళ్లీ పెళ్లి, తల్లి కావడం...ఇలాంటి వ్యక్తిగత అనుభవాలను తన అభిమానులతో పంచుకుంటూ.. ఈ 15 సంవత్సరాలలో, ఆమె తన అనుభవాల ద్వారా ఎదురుదెబ్బల నుంచి చాలా నేర్చుకున్నానంది.
అమలాపాల్ 2010లో నటించిన తమిళ చిత్రం ‘‘ సింధు సమవేలి’’ ఆమె కెరీర్ ను వ్యక్తిగత జీవితాన్ని సైతం ప్రభావితం చేసింది. ఆమె సింధు సమవేలి(Sindhu Samaveli)లో ఓ బోల్డ్ పాత్రను పోషించింది ఎందరినో ఇబ్బంది పెట్టిన శృంగార సన్నివేశాల్లో నటించింది. ఆ సాహసం ఆమె వ్యక్తిగత జీవితం ప్రారంభ కెరీర్ రెండింటినీ ఎదురుదెబ్బలు ఎదుర్కునేలా చేసింది.
తండ్రి వయసు ఉండే తన మామగారితో అక్రమ సంబంధానికి ఒడిగట్టే కోడలు సుందరి పాత్రలో ఆమె నటించిన ఆ చిత్రం విడుదలైన తర్వాత తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ వివాదం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,.ఆ సినిమా విషయంలో వెల్లువెత్తిన ప్రతికూలత తనను బాగా భయపెట్టిందని, ముఖ్యంగా ఆ సినిమా చూసి తన తండ్రి తీవ్రంగా కలత చెందారని ఆమె వెల్లడించింది.
తన పాత్ర చూపించే సామాజిక ప్రభావాన్ని తాను అంచనా వేయలేకపోయానని అంగీకరించింది. ‘మనం అలాంటి పాత్ర చేయకూడదని, అది చెడ్డదని లేదా అది మన సమాజం అంగీకరించే విషయం కాదని ఆ చిత్రం విడుదల తర్వాత మాత్రనే నేను అర్ధం చేసుకోగలిగాను’’ అంటూ ఆమె గుర్తు చేసుకుంది.
అయితే అప్పుడు తాను కేవలం 17 లేదా 18 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉన్న నటిని.. కావడంతో దర్శకుడి సూచనలను గుడ్డిగా అనుసరించడం మాత్రమే చేయగలిగానంది. ఈ వివాదం ఆమెను మానసికంగా ప్రభావితం చేయడమే కాకుండా కెరీర్ పరంగానూ వ్యతిరేక పరిణామాలకు దారి తీసింది.
సింధు సమవేలి తరువాత, ఆమె తన తదుపరి చిత్రం మైనా ప్రారంభ ప్రమోషన్లలలో సైతం దేనికీ ఆమెను పిలవలేదు, ఆ తర్వాత ఆమెకు తరువాత కమల్ హాసన్ రజనీకాంత్ వంటి దిగ్గజ నటుల నుంచి సైతం కాల్స్ వచ్చాయి, అయితే విపరీతమైన వ్యతిరేకత పట్ల భయం కారణంగా, ఆమె చెన్నైకి వెళ్లలేకపోయింది.
అమలాపాల్ సక్సెస్ తర్వాత ఆ వివాదాస్పద చిత్రం మరోసారి రీ–రిలీజ్ అయింది. అప్పుడు కూడా ప్రమోషనల్ మెటీరియల్ తప్పుదారి పట్టిస్తోందంటూ వివాదాన్ని రేకెత్తించింది. వీటన్నింటి నేపధ్యం ‘‘ సినిమా కేవలం వ్యాపారాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని నేను గ్రహించాను, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక నటి ఎదురు దెబ్బలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి‘ అని ఆమె స్పష్టం చేసింది.