
పహల్గాం: అందమైన మైదానాలు, మంచు కొండలు, పైన్ అడవులు.. ఎండాకాలంలో కాస్త సేద తీరుదామని జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam)కు వెళ్లిన పర్యాటకులెందరో.. ! ఈ ఆనందాన్ని చెల్లాచెదురు చేశారు ఉగ్రవాదులు. దేశంలో అలజడి సృష్టించేందుకు పర్యాటకులపై పంజా విసిరారు. భారీ ఆయుధాలతో అమాయక జనంపై విరుచుకుపడ్డారు.
ఉగ్రదాడి
ఉగ్రదాడి అని అర్థమైన పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు తీశారు. కానీ మైదాన ప్రాంతం కావడంతో తలదాచుకునే వీలు కూడా లేకుండా పోయింది. ఈ దాడిలో 26 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి నుంచి ప్రముఖ హిందీ బుల్లితెర జంట దీపికా కక్కర్- షోయబ్ ఇబ్రహీం తృటిలో తప్పించుకున్నారు. తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి ఆర్జే కాజల్ (RJ Kajal) సైతం కశ్మీర్ పర్యటనలో ఉండటంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
వీడియో షేర్ చేసిన కాజల్
ఈ క్రమంలో కాజల్ తను క్షేమంగా ఉన్నట్లు వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం నేను పహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాను. నేను క్షేమంగా ఉన్నాను. రోడ్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రజల రక్షణ కోసం స్థానిక పోలీసులు అలుపెరగకుండా కృషి చేస్తున్నారు. నాకోసం ఆరా తీసిన అందరికీ కృతజ్ఞతలు అని వీడియో షేర్ చేసింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఎంతగానో బాధించిందని పేర్కొంటూ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది.
చదవండి: పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్!