
ఎంజీ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఈనెల 17 నుంచి మే 15 వరకు జరగాల్సిన డిగ్రీ పరీక్షలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ (సీఓఈ) డాక్టర్ ఉపేందర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని, తదుపరి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
నల్లగొండ: యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయమై బుధవారం నల్లగొండ కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాల వర్షాలు, ఈదురుగాలులను దృష్టిలో ఉంచుకుని ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని మిల్లర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేలా పౌరసరఫరాల, ఎన్ ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్‌ఓ హరీష్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీఏఓ శ్రవణ్, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
రామాలయంలో అలరించిన అన్నమాచార్య సంకీర్తన
రామగిరి(నల్లగొండ): నల్లగొండలోని రామగిరి రామాలయంలో బుధవారం శ్రీ అన్నమాచార్య సంకీర్తనా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నమాచార్య సంకీర్తనాగాన ప్రదర్శన అలరించింది. పేరి మాధవి సంకీర్తనలు గానం చేశారు. డాక్టర్ ఎం.పురుషోత్తమచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎం.లక్ష్మీనారాయణ కీబోర్డు, ఎస్.జయప్రకాశ్ తబల, కె.భిక్షం రిథమ్స్, డాక్టర్ సీహెచ్.మల్లిఖార్జునాచారి వ్యాఖ్యానం చేశారు.
ప్రతి ఇంటికీ భగీరథ నీరందించాలి
త్రిపురారం: ప్రస్తుత వేసవిలో అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు అందేలా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి సూచించారు. బుధవారం త్రిపురారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, పంచాయతీ కార్యాదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామ పంచాయతీల రికార్డులను పరిశీలించి గ్రామాల్లో ఉపాధి హామీ పనులు, నర్సరీల పెంపకంపై ఆరా తీశారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సమావేశంలో త్రిపురారం ఎంపీడీఓ విజయ కుమారి, సూపరింటెండెంట్ దయాకర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ భరద్వాజ్, జూనియర్ అసిస్టెంట్ మహేష్, సరిత, కోడిరెక్క రాజేంద్ర కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
28 నుంచి పాలిసెట్ ఉచిత శిక్షణ
యాదగిరిగుట్ట: టీజీ పాలిసెట్–2025 ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఈ నెల 28 నుంచి మే 8వ వరకు యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ నెల 19 వరకు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అని, మే 13వ తేదీన పాలిసెట్ ప్రవేశ పరీక్షలు జరగనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు సెల్‌నంబర్ 80998 99793, 90106 29270ను సంప్రదించాలని కోరారు.

ఎంజీ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా

ఎంజీ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా