
డిజిటల్ డోర్ నంబర్లేవీ!
నీలగిరిలో రెండేళ్ల నుంచి అసంపూర్తిగానే సర్వే
రూ.1.50కోట్ల నిధులు వృథా!
మున్సిపాలిటీల్లో అధికారులను ఇంటి నంబర్ల సమస్య వెంటాడుతోంది. కొన్నిచోట్ల డబుల్ ఇంటి నంబర్ల సమస్య ఉంది. ఇళ్ల యజమానుల పేర్లు, ఇంటి నంబర్లు తప్పుగా నమోదు కావడంతోపాటు, ఆస్తిపన్నులో తేడాలు తదితర వాటికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వం భావించింది. దీంట్లో భాగంగా ఇంటి నంబర్ చూడగానే పూర్తి వివరాలు తెలిసేలా డిజిటల్ డోర్ నంబర్ సర్వేకు శ్రీకారం చుట్టారు. కానీ ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో కాంట్రాక్టు సంస్థలు సర్వే పూర్తి చేయలేకపోయాయి. ఒక్క నీలగిరి మున్సిపాలిటీలోనే డిజిటల్ డోర్ నంబర్ సర్వే చేయడానికి రూ.1.50 కోట్లు వెచ్చించిప్పటికీ ఏజెన్సీ సంస్థ చేసిన తప్పిదానికి నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఫ పూర్తిచేయకుండానే చేతులెత్తేసిన కాంట్రాక్టు సంస్థ
ఫ అరకొరగా వివరాలు సేకరించి నివేదిక అందజేత
ఫ రూ.కోటిన్నర నిధులు ఖర్చయినా ప్రయోజనం శూన్యం
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డిజిటల్ డోర్ నంబర్ల సర్వే అసంపూర్తిగా మిగిలిపోయింది. ఒప్పంద ఏజెన్సీ సంస్థ డిజిటల్ సర్వే పూర్తి చేయకముందే 90 శాతం డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేసిన సర్వేలో కూడా పూర్తి వివరాలు సేకరించకుండా అరకొరగా చేసి చేతులు దులుపుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు సంవత్సరాలు దాటినా..
నీలగిరిలో చేపట్టిన డిజటల్ డోర్‌నంబర్ల సర్వే రెండేళ్లు దాటినా నేటికీ పూర్తికాలేదు. పట్టణంలోని 48 వార్డుల్లో సర్వే దాదాపు 80 శాతం పూర్తి అయినట్లు చెబుతున్నా అంతా అసంపూర్తిగానే వదిలేసినట్లు తెలిసింది. జిల్లాలోని నీలగిరి, మిర్యాలగూడ తదితర ప్రధాన పట్టణాల్లో డిజిటల్ డోర్ నంబర్లు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగా నీలగిరిలో సర్వే చేపట్టింది. గత ఎన్నికలకు ముందే సర్వే నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో నీలగిరిలో కాంట్రాక్టు పొందిన ఏజెన్సీ సంస్థ సర్వేను అర్థాంతరంగా నిలిపివేసింది. అయితే ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడడం.. మున్సిపల్ అధికారులు బదిలీలు కావడంతో ఏజెన్సీ సంస్థ సర్వేను పూర్తిచేయనేలేదు.
నిబంధనలకు విరుద్ధంగా సర్వే
కచ్చితత్వంతో పారదర్శకంగా డిజిటల్ డోర్ నంబర్ సర్వే చేస్తే దాదాపు 90 శాతం వాణిజ్య, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ విద్యాసంస్థల భవనాల నుంచి ఆస్తి పన్ను పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటి అనుమతి తీసుకోకుండా భవనాలు నిర్మించుకున్న వారితోపాటు, అనుమతి ఒక అంతస్తుకు తీసుకొని మూడు,నాలుగు అంతస్తుల భవనాలు నిర్మించడం, ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకొని వాణిజ్య భవనాలు నిర్మించడం లాంటివి పట్టణాల్లో వందల సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి భవనాలకు మున్సిపల్ చట్టం ప్రకారం విధించే పన్నుకు రెట్టింపు వేయాల్సి ఉంటుంది. డిజిటల్ డోర్ నంబర్ సర్వే పూర్తి చేస్తే మున్సిపాలిటీలకు 80 నుంచి 90 శాతం వరకు భవనాల ఆస్తి పన్ను పెరిగే అవకాశం ఉండేది. అయితే ఇలాంటి వాటి విషయంలో సర్వే సంస్థ కచ్చితత్వంతో పనిచేయకుండా నిబంధనలలకు విరుద్ధంగా వ్యవహరించి మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులను సైతం బురిడీ కొట్టించి మమ అనిపించిందనే ఆరోపణలు ఉన్నాయి. సర్వే పూర్తి చేయని ఏజెన్సీ సంస్థకు ప్రస్తుత మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చి మరోసారి సర్వే చేయిస్తారా లేక మిన్నకుండిపోతారా అనేదానిపై అనుమానాలు కలుగుతున్నాయి.
నీలగిరిలో వార్డుల సంఖ్య 48
నివాస భవనాలు 36,750
వాణిజ్య భవనాలు 2,510
నివాస, వాణిజ్య భవనాలు 3,550
మొత్తం భవనాలు 42,810
ప్రస్తుతం వసూలవుతున్న ఆస్తిపన్ను రూ.17కోట్లు
సర్వేకు నిధుల కేటాయింపు రూ.1.50కోట్లు
పూర్తయిన సర్వే (అంచనా) 80శాతం
అనుమతి రాగానే డిజిటల్ నంబర్లు
ఏజెన్సీ సంస్థ సర్వే చేసి నివేదిక ఇచ్చింది. కానీ దీనిని అమలు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. మున్సిపల్ ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే సర్వే ప్రకారం డిజిటల్ డోర్ నంబర్లు ఇస్తాం.
– సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్

డిజిటల్ డోర్ నంబర్లేవీ!