
శక్తి దూబే (1), హర్షిత (2) , అర్చిత్ (3)
టాప్–5లో ముగ్గురు అమ్మాయిలే
హర్షితా గోయల్‌కు రెండో ర్యాంక్, షా మార్గీకి నాలుగో ర్యాంక్
టాప్–25లో ఇద్దరు మనోళ్లే
తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌గా సాయిశివాని.. 11వ ర్యాంకు
బన్న వెంకటేశ్‌కు 15వ ర్యాంకు
సివిల్స్–2024 ఫలితాల విడుదల
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్వహించిన సివిల్ సర్విసెస్ ఎగ్జామినేషన్–2024 ఫలితాల్లో అమ్మాయిలు అద్భుత ప్రతిభ కనబర్చారు. ఆలిండియా ఫస్ట్ ర్యాంకుతోపాటు తొలి ఐదు ర్యాంకుల్లో ఏకంగా మూడు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే ఫస్ట్ ర్యాంకు సాధించగా హర్షితా గోయ ల్ రెండో ర్యాంకు, షా మార్గీ చిరాగ్ నాలుగో ర్యాంకు సాధించారు. అబ్బాయిల్లో డోంగ్రే అర్చిత్ పరాగ్ మూడో ర్యాంకు, ఆకాశ్ గార్గ్ ఐదో ర్యాంకు సాధించారు.
తొలి 25 ర్యాంకుల్లోనూ 11 ర్యాంకులను అతివలు సాధించి తమ సత్తా చాటారు. అలాగే టాప్–25లో ఇద్దరు తెలుగువాళ్లు ర్యాంకులు సాధించారు. తొలి 1,009 ర్యాంకుల్లో 725 మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. పరీక్షల్లో విజయం సాధించిన వారిలో జనరల్ కేటగిరీ నుంచి 335 మంది ఎంపికవగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల నుంచి 109 మంది ఎంపికయ్యారు. ర్యాంకర్లలో 318 మంది బీసీలు, 160 మంది ఎస్సీలు, 87 మంది ఎస్టీలు ఉన్నారని యూపీఎస్‌సీ తెలిపింది. మొత్తంగా 1,129 ఖాళీలు ఉన్నట్లు కమిషన్ గతంలో పేర్కొంది. వాటిలో 180 ఐఏఎస్, 55 ఐఎఫ్‌ఎస్, 147 ఐపీఎస్, 605 గ్రూప్–ఏ పోస్ట్‌లు, 142 గ్రూప్–బీ పోస్ట్‌లు ఉన్నాయి.
భిన్న నేపథ్యాలు..
ఆలిండియా టాపర్‌గా నిలిచిన శక్తి దూబే ఎటువంటి కోచింగ్ తీసుకోకుండానే ఐదో ప్రయత్నంలో ర్యాంక్ సాధించగా రెండో ర్యాంకర్ హర్షితా గోయల్ మూడో ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపికైంది. ఆమె ప్రస్తుతం చార్టర్డ్ అకౌంటెంట్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. ఇక మూడో ర్యాంక్ సాధించిన 26 ఏళ్ల డోంగ్రే అర్చిత్ పరాగ్ స్వస్థలం మహారాష్ట్రలోని పుణే. అతను తమిళనాడులోని వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.
గతంలో ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. 2023లో సివిల్స్ పరీక్షలో 153వ ర్యాంక్ సాధించినా మెరుగైన ర్యాంక్ కోసం ఈసారి ప్రయత్నించి అందులో సఫలీకృతమయ్యాడు. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన గుజరాత్‌వాసి, నాలుగో ర్యాంకర్ మార్గి చిరాగ్ షా ఐదో ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపికైంది. రెండో ప్రయత్నంలో ఐదో ర్యాంక్ సాధించి సివిల్స్‌కు ఎంపికైన 24 ఏళ్ల ఆకాశ్ గార్గ్ ఢిల్లీ గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో బీటెక్ చదివాడు.
మొత్తం 50 మందికిపైగా తెలుగు అభ్యర్థుల ఎంపిక!
సివిల్ సర్విసెస్–2024 పరీక్షల ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తంగా 50 మందికిపైగా తెలుగు తేజాలు ర్యాంకులు సాధించారు. వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన ఎట్టబోయిన సాయి శివాని అఖిల ఆలిండియా 11వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. యూపీఎస్సీ ప్రకటించిన 1,009 మంది ర్యాంకర్లలో దాదాపు 50 మందికిపైగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులున్నట్లు సమాచారం.
వారిలో టాప్–20లో బన్న వెంకటేష్ 15వ ర్యాంకు సాధించగా 100 లోపు ర్యాంకులు సాధించిన వారిలో రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంక్, చింతకింది శ్రవణ్‌కుమార్‌రెడ్డి 62వ ర్యాంకు, సాయి చైతన్య జాదవ్ 68వ ర్యాంకు ఉన్నారు. అలాగే ఎన్.చేతనరెడ్డి 110వ ర్యాంకు, చెన్నంరెడ్డి శివ గణేష్ రెడ్డి 119వ ర్యాంకు, నేలటూరు శ్రీకాంత్‌రెడ్డి 151వ ర్యాంకు సాధించారు. నెల్లూరు సాయితేజ 154వ ర్యాంకు, కొలిపాక శ్రీకృష్ణ సాయి 190వ ర్యాంకు సొంతం చేసుకున్నారు.

230 మందితో రిజర్వ్ జాబితా..
యూపీఎస్‌సీ నిబంధనల ప్రకారం మరో 230 మందిని సంస్థ రిజర్వ్ జాబితాలోకి చేర్చింది. అందులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ కేటగిరీలతోపాటు సెంట్రల్ సర్విసెస్ గ్రూప్–ఏ, గ్రూప్–బీ కేటగిరీల్లో ఈ అభ్యర్థులు ఎంపికయ్యారు. గతేడాది జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన యూపీఎస్సీ.. ఇందులో అర్హత సాధించిన వారికి సెపె్టంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. మెయిన్స్‌లో మెరుగైన ఫలితాలు సొంతం చేసుకున్న వారికి ఈ ఏడాది జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను ప్రకటించింది.
టాప్–25 ర్యాంకర్లు
శక్తి దూబే (1), హర్షితా గోయల్ (2), డోంగ్రే అర్చిత్ పరాగ్ (3), షా మార్గీ చిరాగ్ (4), ఆకాశ్ గార్గ్ (5), కోమల్ పునియా (6), ఆయుషీ బన్సాల్ (7), రాజ్‌కృష్ణ ఝా (8), ఆదిత్య విక్రమ్ అగర్వాల్ (9), మయాంక్ త్రిపాఠి (10), సాయి శివాని (11), ఆశీ శర్మ (12), హేమంత్ (13), అభిషేక్ వశిష్ట (14), బన్నా వెంకటేశ్ (15), మాధవ్ అగర్వాల్ (16), సంస్కృతి త్రివేది (17), సౌమ్యా మిశ్రా (18), విభోర్ భరద్వాజ్ (19), త్రిలోక్ సింగ్ (20), దివ్యాంక్ గుప్తా (21), రియా సైనీ (22), బి.శివచంద్రన్ (23), ఆర్. రంగ మంజు (24), ఝీ ఝీ ఏఎస్ (25).