
ఏపీలో ప్రజాస్వామ్యం మూడు కుట్రలు, ఆరు ప్రలోభాలుగా పరిఢవిల్లుతోంది!. విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ పదవి నుంచి వైఎస్సార్‌సీపీకి చెందిన వెంకట కుమారిని దించివేయడానికి ఇన్ని కుట్రలు పన్నాలా?. పదవీకాలం ఏడాది కూడా లేకపోయినా, ఎందుకు ఇంత కక్కుర్తి?. బహుశా కూటమి నేతలు, కార్యకర్తల అరాచకాలు త్వరితగతిన తెలిసిపోతున్నాయనో, విశాఖలో తమ పెత్తనం సాగాలనో మరే కారణంతోనో అవిశ్వాస తీర్మానం పెట్టి కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు నిర్ణయం తీసుకుని ఉండాలి.
అయితే, ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు సర్కార్ స్థానిక సంస్థల స్వతంత్రను దెబ్బతీస్తోంది. ఇందుకు అధికార యంత్రాంగాన్ని వాడుకుంటుంది. చంద్రబాబు తొలుత ముఖ్యమంత్రి అయింది ఇలాంటి కుట్రలతోనే అని అంతా అంటారు. అదే పద్దతిని ఆయన ఇప్పటికీ కొనసాగించడం దురదృష్టకరం. ఇప్పుడు ఆయన కుమారుడు లోకేశ్ కూడా అదే బాటలో ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు, లోకేశ్‌లకు విధేయుడుగా ఉంటూ ప్రశ్నించడం లేదు కనుక వారికి ఇబ్బంది ఉండడం లేదు.
గతంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లో ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదు. ఎన్నికలలో కేవలం రెండు మున్సిపాలిటీల్లోనే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నప్పుడు కూడా వారిని డిస్టర్బ్ చేయలేదు. ఇందుకు ఆ రోజుల్లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర రెడ్డి ఓపెన్ గానే అంగీకరించారు. కానీ, చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాగానే స్థానిక సంస్థలలో వేధింపుల పర్వం ఆరంభించారు. పలు మండల పరిషత్తులలో వివిధ కారణాలతో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూటమి పెద్దలు పెద్ద ఎత్తున కొనుగోలు లావాదేవీలను సాగించారు. అయినా కేవలం 11 చోట్ల మాత్రమే మెజార్టీ లేకపోయినా మండలాలను కైవశం చేసుకున్నారు. మిగిలిన 39 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలిచింది. ఎర్రగొండపాలెం వద్ద ఒక మండల పరిషత్ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ మహిళా ఎంపీటీసీ టీడీపీ వారి దాష్టికాన్ని తట్టుకుని ఓటు వేయడం సంచలనమైంది.
ఈ మధ్యనే ఆదోని మున్సిపల్ ఛైర్‌పర్సన్ వైఎస్సార్‌సీపీ నుంచి మారిన నేపథ్యంలో అక్కడ మెజార్టీ కౌన్సిలర్లు ఒకే తాటిపై నిలబడి ఆమెను పదవి నుంచి దించేశారు. పార్టీ ఫిరాయింపునకు జవాబు ఇచ్చారు. అలా అన్ని చోట్ల సాధ్యపడదు. ఉదాహరణకు తిరుపతి ఉప మేయర్ ఎన్నికకు సంబంధించి పోలీసుల మద్దతుతో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడడం, ఒక్క టీడీపీ కార్పొరేటరే ఉన్నప్పటికీ ఆ పదవిని గెలుచుకోవడం జరిగింది. ఈ ఓటింగ్ తర్వాత కొందరు కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వద్దకు వచ్చి టీడీపీ వారి వేధింపులకు తట్టుకోలేక వైఎస్సార్‌సీపీకి ద్రోహం చేశామని కన్నీరు, మున్నీరయ్యారు. అవకాశం ఉన్న చోట్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్మన్లను ప్రలోభ పెట్టి టీడీపీలోకి చేర్చుకుంటున్నారు. లొంగకపోతే అధికారుల చేత ఒత్తిడి చేయిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఛైర్మన్లకు సహకరించకుండా ఐఏఎస్‌లు సైతం దారుణంగా వ్యవహరిస్తున్నారు.
ఉదాహరణకు గుంటూరు కమిషనర్, ఐఏఎస్ అధికారి మేయర్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది. దాంతో మేయర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ మేయర్‌కు ఇవ్వవలసిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. ఇది స్థానిక సంస్థలను అవమానించడమే. విశాఖపట్నంలో బీసీ వర్గానికి చెందిన మహిళ మేయర్‌ను పదవి నుంచి దించడానికి కొద్ది నెలలుగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. కార్పొరేటర్లను రకరకాల ప్రలోభాలకు లోను చేయడానికి యత్నించింది. కొంతమందిని విదేశీ యాత్రలకు పంపారు. టీడీపీ కూటమి దాష్టికాలకు తట్టుకోవడానికి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కొందరు కేరళ వెళ్లారట. అక్కడకు వెళ్లి కూడా టీడీపీ నేతలు కొందరిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఒక కార్పొరేటర్ వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకున్నా వారికి పూర్తి బలం రాలేదు. దాంతో ముప్పై మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను టీడీపీ కొనుగోలు చేసిందని చెబుతున్నారు. ఎలాగైతేనేం విశాఖ నగర పాలక సంస్థను కైవసం చేసుకున్నామని కూటమి పెద్దలు సంబర పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశామని వారు బాధపడడం లేదు. ఈ వైఖరిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ .. కూటమి ఇలా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బలం లేకపోయినా ఎలా పదవులలోకి వస్తారని ఆయన ప్రశ్నించారు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు పార్టీ ఫిరాయింపులపై స్పష్టమైన విధాన నిర్ణయం చేశారు. వేరే పార్టీవారు ఎవరైనా టీడీపీలోకి రావాలంటే పదవి వదలి పెట్టి రావాలని కండిషన్ పెట్టారు. ఆ సూత్రానికి చంద్రబాబు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారు. సొంత మామ ఎన్టీ రామారావును పార్టీ చీల్చి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన చంద్రబాబుకు ఇలాంటి కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు పెద్ద విషయమా అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుంటారు. 2014 టర్మ్‌లో కూడా ఇలాగే చేశారు. ఉదాహరణకు మూడు నగరపాలక సంస్థలలో వైఎస్సార్‌సీపీ గెలిస్తే, నెల్లూరు మేయర్‌ను టీడీపీలోకి లాగేసింది. అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు ఆధ్వర్యంలో కొనుగోలు చేశారన్నది బహిరంగ రహస్యం. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగానికి గండి కొట్టారు.
జగన్ దీనికి నిరసనగా అసెంబ్లీని బహిష్కరించి ప్రజలలోకి వెళ్లారు. 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చినా, చంద్రబాబు తన పద్దతులను మార్చుకోలేదు. ఒకప్పుడు పార్టీ ఫిరాయింపులను విమర్శిస్తూ ఎమ్మెల్యేలను పశువుల మాదిరి కొంటారా అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, తాను అధికారంలోకి వచ్చినప్పుడల్లా అదే పనిచేయడం ఆయన ప్రత్యేకత. దీనిపై బీజేపీ లోక్ సభ సభ్యుడు సీఎం రమేష్ హర్షం వ్యాక్తం చేస్తూ అరాచక పాలనకు ముగింపు పలికారని అన్నారు. అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశామన్న సంగతిని మాత్రం విస్మరించారు. ఆయన పేరుకు బీజేపీ తప్ప, ఒరిజినల్‌గా చంద్రబాబు సొంత మనిషిగానే అంతా పరిగణిస్తారు.
టీడీపీ నేతలు తాము విశాఖ నగరంలో అధికారంలోకి వచ్చామని సంబర పడుతుండవచ్చు. కానీ, ప్రజలలో మాత్రం ఏహ్య భావాన్ని మూట కట్టుకున్నారని చెప్పాలి. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కూటమి నేతలు, ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుండటం దురదృష్టకరం. స్థానిక సంస్థలలో అధికారం వచ్చినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అనుభవం చెబుతున్నప్పటికీ, చంద్రబాబు అండ్ కో మాత్రం యథా ప్రకారం ఈ కుట్రలను కొనసాగిస్తున్నారు. 1995లో కుట్రతోనే అధికారంలోకి వచ్చి.. అప్పటి నుంచి వాటినే అమలు చేస్తున్న చంద్రబాబు ఇంతకన్నా గొప్పగా ఉంటారని ఆశించలేమేమో!.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల విశ్లేషకులు.