
కేసీఆర్ స్థాపించిన బీఆర్‌ఎస్‌కు పాతికేళ్లు
● కొనాయిపల్లిలో పూజలు చేసి ర్యాలీగా జలదృశ్యంకు ● నాడు నాటిన బీజం.. నేడు గులాబీవనంలా మారి.. ● ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్
ఏ ఎన్నికై నా అండగా నిలిచిన ప్రజలు
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసిన బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) అభ్యర్థులకు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు అండగా నిలిచారు. 2001, 2004, 2008, 2010.. ఇలా జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికల్లో ఓటర్లు విజయాన్ని అందించారు. 2023లో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, సంగారెడ్డి, నర్సాపూర్, జహీరాబాద్, పటాన్‌చెరు, 2018లో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, పటాన్‌చెరు, జహీరాబాద్, నర్సాపూర్, ఆందోల్, మెదక్, నారాయణఖేడ్, 2014లో సిద్దిపేట, మెదక్, పటాన్‌చెరు, సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, ఆందోల్, దుబ్బాక నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించింది. 2004లో సిద్దిపేట, సంగారెడ్డి, రామాయంపేట, దుబ్బాక, 2009లో సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ గెలుపొందింది. ఇవే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
సాక్షి, సిద్దిపేట: గులాబీ పార్టీ 25 ఏళ్ల పండుగ వేళ పురిటిగడ్డ మెతుకుసీమ మురిసిపోతుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి, బీఆర్‌ఎస్‌కు మొదటి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా అండగా నిలిచింది. 2000 సంవత్సరం ఆరంభంలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా.. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఏప్రిల్ 27, 2001న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి గులాబీ జెండాను ఎత్తుకున్నారు. అప్పటి నుంచి 14 ఏళ్లు అన్నివర్గాలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించారు. తర్వాత పదేళ్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు.
ఉప ఎన్నికల్లో బస్సు గుర్తు కేటాయింపు
2001 ఆగస్టు 18న టీఆర్‌ఎస్‌ను రాజకీయ పార్టీగా రిజిస్టర్ అయింది. 2001 సెప్టెంబర్‌లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఇండిపెండెంట్‌గా పోటీ చేయడంతో ఎన్నికల కమిషన్ బస్సు గుర్తును కేటాయించింది. ఆ ఉపఎన్నికలో సమీప ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డి (టీడీపీ)పై 58,712 ఓట్ల మెజార్టీతో కేసీఆర్ ఘనం విజయం సాధించారు. అధికార టీడీపీ ప్రభుత్వం కేసీఆర్‌ను ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సిద్దిపేట ప్రజలు కేసీఆర్‌కు బ్రహ్మరథం పట్టారు. మేమున్నాం తెలంగాణను సాధించి తీసుకురండి అని ఆశీర్వదించారు.
ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం
2005లో వరంగల్‌లో నిర్వహించిన జైత్రయాత్ర సభకు కేసీఆర్ సైకిల్‌పై బయలు దేరారు. సిద్దిపేట నుంచి వరంగల్‌కు ఆయన వెంట వేలాది మంది కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. 2006లో తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పడంతో ఆ పార్టీపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. సిద్దిపేటలో శంఖారావం పేరిట బహిరంగ సభను నిర్వహించడంతో సక్సెస్ అయింది. అదే ఏడాదిలో రాజీవ్ రహదారిపై వంటా వార్పు, రోడ్డు దిగ్బంధం కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. 2008లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించిన తర్వాత కాంగ్రెస్ నాయకులను సవాల్ చేస్తూ సిద్దిపేటలో హరీశ్‌రావు నాయకత్వంలో నిర్వహించిన ఉద్యోగ గర్జన విజయవంతం అయింది. 2009 నవంబర్‌లో సిద్దిపేట అంబేడ్కర్ భవన్‌లో జరిగిన సమావేశంలో ‘‘తెలంగాణ వాలె జాగో.. ఆంధ్రా వాలె బాగో’’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటించడంతో తెలంగాణ ఉద్యమం మరింత ఊపందుకుంది. ఫ్రీ జోన్ రద్దు, ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించారు. సిద్దిపేట పట్టణంలోని రంగధాంపల్లి సెంటర్‌ను వేదికగా ఎంచుకున్నారు. కరీంనగర్ నుంచి నవంబర్ 29న సిద్దిపేటలోని ఆమరణ దీక్ష శిబిరానికి బయలు దేరుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. దీంతో హరీశ్‌రావు, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి, పద్మారెడ్డితో పలువురు నాయకులు దీక్షకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.
ఉమ్మడి మెదక్ నుంచి 2 లక్షల మంది
వరంగల్ బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు హాజరయ్యేందుకు ఇప్పటికే సిద్దిపేట నుంచి పాదయాత్రగా యువత, అలాగే పటాన్‌చెరు నుంచి కార్లతో ర్యాలీగా బయలుదేరారు. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 2 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా నాయకులతో మాజీ మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు సమీక్షలు, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు.
పోరాటం తప్పదని ప్రకటన
2001 ఏప్రిల్ 14న సిద్దిపేటలో జరిగిన అంబేడ్కర్ జయంతి సభలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం తప్పదని ప్రకటించారు. అంతకు ముందే పలువురు మేధావులతో రాష్ట్ర సాధన కోసం చర్చించారు. తర్వాత సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేద్దాం అని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27న సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా హైదరాబాద్ జలదృశ్యం బయలుదేరారు. అక్కడ టీఆర్‌ఎస్ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు.
సిద్దిపేట నుంచి వరంగల్ సభకు
సైకిల్‌పై వెళ్తున్న కేసీఆర్ (ఫైల్)

కేసీఆర్ స్థాపించిన బీఆర్‌ఎస్‌కు పాతికేళ్లు

కేసీఆర్ స్థాపించిన బీఆర్‌ఎస్‌కు పాతికేళ్లు

కేసీఆర్ స్థాపించిన బీఆర్‌ఎస్‌కు పాతికేళ్లు

కేసీఆర్ స్థాపించిన బీఆర్‌ఎస్‌కు పాతికేళ్లు