
ఇక భూధార్ కార్డులు
● భూ సమస్యలకు భూభారతితో చెక్
● కలెక్టర్ మనుచౌదరీ
కొండపాక(గజ్వేల్): భూముల గుర్తింపునకు భూదార్ కార్డులు ముఖ్యమని జిల్లా కలెక్టర్ మనుచౌదరి పేర్కొన్నారు. శనివారం కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లోని రైతు వేదికల్లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భా సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. రైతుల తమ భూములపై పక్కాగా హక్కులు కలిగి ఉండేలా భూ భారతి చట్టం పని చేస్తుందన్నారు. గతంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వం భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసకునేలా ఈ చట్టంలో అవకాశాలు ఉన్నాయన్నారు. ఇదివరకు భూ సమస్యల పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిరుగాల్సి వచ్చేదని, భూ భారతితో పారదర్శకంగా విచారణ జరిపి జిల్లా, రెవెన్యూ అధికారులు పరిష్కరించే అధికారులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకు ముందు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, డీసీఓ నాగమణి, మార్కెట్ కమిటీ చైర్మన్ వి.శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్లు దిలీప్ నాయక్, సుజాత, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఏఓలు శివరామకృష్ణ, గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా యూజీసీ నీట్ పరీక్ష నిర్వహించాలి
సిద్దిపేటరూరల్: మే 4వ తేదీన జరిగే యూజీసీ నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం కేంద్ర విద్యాశాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లను చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈఓ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.