
Photo Courtesy: BCCI/JioHotstar
ఐపీఎల్-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ (MI vs SRH) మ్యాచ్ సందర్భంగా గురువారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైజర్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan).. ముంబై జట్టు యజమాని నీతా అంబానీ (Nita Ambani)ని కలిశాడు. ముంబై చేతిలో ఓటమి అనంతరం తన మాజీ ఓనర్ దగ్గరకు వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించాడు.
ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్
బదులుగా ఇషాన్ కిషన్ చేతిని పట్టుకుని.. తల్లి మాదిరి ప్రేమపూర్వకంగా నీతా అంబానీ అతడి చెంప నిమిరారు. ఓటమికి కుంగిపోవాల్సిన పనిలేదన్నట్లుగా ఇషాన్‌ను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకాపై మీమ్స్ పేలుతున్నాయి. ‘‘తమ జట్టుతో ప్రయాణించిన మాజీ ఆటగాడి పట్ల నీతా తల్లిలా ప్రేమను కురిపిస్తుంటే.. గోయెంకా మాత్రం ఒక్క మ్యాచ్‌లో ఓడినా తమ కెప్టెన్లను అందరి ముందే ఉతికి ఆరేస్తాడు.. ఇదే ఈ ఇద్దరికి ఉన్న తేడా’’ అంటూ ముంబై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
కాగా 2016లో ఇషాన్ కిషన్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. గుజరాత్ లయన్స్ అతడిని రూ. 35 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయగా.. రెండేళ్ల పాటు అదే జట్టుకు ఆడి 319 పరుగులు చేశాడు.
ముంబైతో సుదీర్ఘ అనుబంధం
అయితే, గుజరాత్ ఫ్రాంఛైజీ ఐపీఎల్ నుంచి కనుమరుగైన తర్వాత ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేసింది. 2018 వేలంలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ను సొంత చేసుకోగా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆ ఏడాది 500కు పైగా పరుగులు సాధించాడు. అప్పటి నుంచి ఏడేళ్లపాటు ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2022 వేలంలో అత్యధికంగా రూ. 15.25 కోట్ల ధర పలికాడు.
రూ. 11.25 కోట్లకు రైజర్స్‌కు సొంతం
అయితే, మెగా వేలం-2025కి ముందు ముంబై ఇషాన్ కిషన్‌ను వదిలేసింది. ఈ క్రమంలో వేలంపాటలోనూ అతడిని కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు ఇషాన్‌ను కొనుక్కుంది.
ఇప్పటి వరకు ఐపీఎల్-2025లో విధ్వంసకర శతకం (106 నాటౌట్) బాదడం మినహా ఇషాన్ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు సాధించిన పరుగులు 138.
నాలుగు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఓటమి
ఇక ముంబై- సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన కమిన్స్ బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆరు వికెట్లు నష్టపోయి 18.1 ఓవర్లలో టార్గెట్‌ను పూర్తి చేసింది. బంతితో, బ్యాట్‌తో రాణించిన ముంబై ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఆఫ్ స్పిన్నర్ అయిన జాక్స్ మూడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 14 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రవిస్ హెడ్ (28), ఇషాన్ కిషన్ (2) రూపంలో రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో వన్‌డౌన్‌లో వచ్చిన విల్ జాక్స్ 26 బంతుల్లో 36 పరుగులు సాధించాడు.
చదవండి: ఇలాంటి వికెట్ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్
Applying the finishing touches 🤌
🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)
Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025