
నగర పాలక సంస్థలో మంత్రి, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్ అడ్డాగా ప్రజాప్రతినిధుల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అధికారులకు శిరోభారంగా మారింది. ఆధిపత్యం, స్వలాభం కోసం మంత్రి, ఎమ్మెల్యే మధ్య అధిపత్య పోరుకు అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం తన ఆదేశాలు పాటించాలంటూ మున్సిపల్ శాఖ మంత్రి.. తన నియోజకవర్గానికి సంబంధించిన కార్యకలాపాల్లో తన పెత్తనమే కొనసాగాలని ఎమ్మెల్యే మంకుపట్టు పడుతున్నారు. నెల్లూరు నగర పాలక సంస్థలో మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మధ్య జరుగుతున్న రాజకీయ క్రీడలకు అధికారులు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. ‘విడవ మంటే పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోపం’ అన్నట్లుగా ఆ ఇద్దరు ప్రజాప్రతినిధుల ఆధిపత్య పోరులో అధికార యంత్రాంగం నలిగిపోతోంది. ఎవరికి వారే నా మాటే చెల్లుబాటు కావాలంటూ పొలిటికల్ గేమ్ ఆరంభించడంతో విసిగిపోయిన కమిషనర్ బతుకు జీవుడా అంటూ బదిలీపై వెళ్లాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల వ్యవధిలోపే యువ ఐఏఎస్ అధికారిని బలిపశువు చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఎందుకీ ఆధిపత్యం
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నగర నియోజకవర్గంతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా సమాన ప్రాతినిధ్యం ఉంది. ప్రోటోకాల్ ప్రకారం మున్సిపల్ శాఖ మంత్రిగా, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నారాయణ మాటే ప్రస్తుతానికి చెల్లుబాటు అవుతోంది. మంత్రి నారాయణ కార్పొరేషన్‌ను పూర్తి స్థాయిలో తన స్వాధీనంలోకి తీసుకుని అధికారుల బదిలీల నుంచి ప్రతి విషయంలో తల దూర్చుతున్నారు. ఈ పరిణామాలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి రుచించడం లేదు. కార్పొరేషన్‌లో కర్ర పెత్తనం కోసం ఇద్దరి మధ్య వార్ నడుస్తోంది. ప్రతిదీ కార్పొరేషన్‌తో ముడిపడి ఉంటుంది. ఆర్థిక అవసరాలు కూడా కార్పొరేషన్ ద్వారానే సమకూరుతాయి. ప్రధానంగా తమ తమ నియోజకవర్గాల పరిధిలో నగరాభివృద్ధి తమ కనుసన్నల్లోనే జరగాలని ప్రజాప్రతినిధులు భావిస్తారు. తద్వారా రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు దక్కించుకోవాలని అనుకుంటారు. ప్రస్తుతం నగరాభివృద్ధి మొత్తం శివారు ప్రాంతాల్లోనే జరుగుతోంది. రియల్ వెంచర్లు, భవన నిర్మాణాలకు అనుమతులు అన్నీ కార్పొరేషన్ కనుసన్నల్లోనే జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కర్ర పెత్తనం మంత్రి తీసుకోవడంతో ఈ పరిణామాలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారాయి. ఏ పనుల విషయంలో కూడా ఎమ్మెల్యే మాట సాగడం లేదు. గతంలో ఎమ్మెల్యే అనుచరులు, ఆయన కనుసన్నల్లోనే అనధికార లేఅవుట్‌లు వేశారు. దీంతో మంత్రి నారాయణ అనధికార లే అవుట్లపై కన్నెర్ర చేశారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనే ఇలాంటి లేఅవుట్లు 230 వరకు ఉన్నాయని తేల్చారు. అప్రూవల్ లే అవుట్లను ఆన్‌లైన్‌లో ఉంచుతామని, వాటినే కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే.. కొత్తగా నుడా చైర్మన్ అయిన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ‘నా సంగతేంటి అంటూ అనధికార లే అవుట్ల యజమానులకు సందేశాలు పంపుతున్నారు. నా సంగతి చూడకుంటే.. మీ లేఅవుట్ల భరతం పడతానంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఈ పరిణామాలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి తలనొప్పి పుట్టిస్తున్నాయి. దీంతో మంత్రి నారాయణ తీరును పలుమార్లు బహిరంగం గానే ఎండగట్టారు. మా జోలికోస్తే రోడ్డెక్కుతానని వార్నింగ్ ఇచ్చారు. మంత్రి నారాయణ మాత్రం కోటంరెడ్డి మాటలను పెద్ద గా పట్టించుకోవద్దని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. దీనికి తోడు షాడో మంత్రిగా వ్యవ హరిస్తున్న ఓ నేత కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో తలదూర్చుతున్నాడు. ప్రతిదీ తనకు తెలపాల్సిందే అని ఆదేశాలు ఇచ్చారని సమాచారం.
ఏడాది కంటే ఎక్కువ లేని కమిషనర్లు
2014–19 మధ్య ఐదేళ్ల కాలంలో నాలుగేళ్ల వ్యవధిలో 9 మంది కమిషనర్లు బాధ్యతలు స్వీకరించడం, ఏడాది తిరగకుండానే బదిలీ అయిపోవడం జరిగింది. ఈ పరిణామాలు అప్పట్లో ఐఏఎస్‌ల్లోనే చర్చనీయాంశమైంది. నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్లుగా వచ్చేందుకు ఎవరూ మొగ్గు చూపేవారు కాదు. అనివార్య పరిస్థితుల్లో వచ్చినా.. కొద్ది రోజులకే చివరాఖరుకు అప్రాధాన్యం పోస్టుల్లోకి వెళ్లడానికి కూడా వెనుకాడే వారు కాదు. తాజాగా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గత కమిషనర్‌ను బదిలీ చేసింది. ఆ స్థానంలో కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సూర్యతేజ తొమ్మిది నెలలు తిరగకుండానే బదిలీపై వెళ్లిపోవడంతో చర్చనీయాంశమైంది.
నెల్లూరు రూరల్ అభివృద్ధి పనులకు నిధులు
నెల్లూరురూరల్ పరిధిలో తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బడ్జెట్ కేటాయింపులు, కౌన్సిల్ అనుమతి లేకుండానే 302 పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయా పనులకు కార్పొరేషన్ జనరల్ ఫండ్ ద్వారా దాదాపు రూ.26 కోట్లు మంజారు చేసేలా ఒత్తిడి తెచ్చి పంతం నెగ్గించుకున్నారు. అన్ని పనులు ఒకే సారి చేస్తున్నట్లు రాష్ట్ర స్థాయిలో ప్రచారం చేయించాడు. అదే కార్పొరేషన్‌లో ఉండే నగర నియోజకవర్గంలో మాత్రం జనరల్ ఫండ్ నిధుల ద్వారా అభివృద్ధి పనులు జరగడం లేదనే విమర్శలు లేకపోలేదు. ఆ శాఖ మంత్రిగా ఉండి కూడా అభివృద్ధి పనులు జరగకపోవడంపై పెద్ద చర్చనీయాంశమైంది. ఇటీవల చెత్త ఎత్తుకెళ్లేట్రాక్టర్లకు రూ.కోట్ల రూపాయలతో టెండర్లు జరిగాయి. ఆయా టెండర్లలో కూడా షాడో మంత్రి సూచించిన వారికే ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అడ్డుపడి తన నియోజకవర్గంలో తన అనుచరుడికి ఇప్పించాడు. కార్పొరేషన్‌లో శాఖాపరమైన బదిలీల వ్యవహారంలో కూడా మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే వార్ నడిచింది. ఇందులో కూడా కమిషనర్ నిలిగిపోయాడు. నిత్యం ఆ ఇద్దరి ప్రజాప్రతినిధులతో పాటు షాడో మంత్రి మధ్య నిలిగిపోయిన కమిషనర్ మానసిక వేధన భరించలేక బదిలీ చేయమని గతంలో మంత్రి వద్ద వాపోయిన విష యం తెలిసిందే. అప్పట్లో ‘సాక్షి’లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ‘అధికారులు ఆర్తనాదాలు’ శీర్షికతో కథనం ప్రచురితం కావడం పెద్ద సంచలనమే రేగింది. అప్పట్లో రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. తాజాగా కమిషనర్ బదిలీతో ఆ కథనం వాస్తవమే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
గతంలోనూ టీడీపీ పాలనలో
నాలుగేళ్లలో 9 మంది బదిలీ
తాజాగా 9 నెలలకే ఒక కమిషనర్ ఔట్
ఎమ్మెల్యే, మంత్రి మధ్య పోరులో
నలిగిపోయిన వైనం
బదిలీ చేయాలని మంత్రికి
మొరపెట్టుకున్న పరిస్థితి
నాడు సాక్షి కథనం.. నేడు నిజం
అధికార పార్టీలో రాజకీయ క్రీడలకు అధికారులు బలి అయిపోతున్నారు. నెల్లూరు నగర పాలక సంస్థను అడ్డాగా చేసుకుని అవినీతి, అక్రమాలు సాగించేందుకు సాగిస్తున్న కుటిల కుతంత్రానికి అధికారులు ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. కమిషనర్లుగా వచ్చే ఐఏఎస్ అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పినట్లు అడ్డంగా చేసేందుకు సిద్ధంగా ఉండకపోవడంతో వారి ఆగ్రహానికి గురికాక తప్పడం లేదు. టీడీపీ హయాంలో గతంలోనూ, ఇప్పుడూ ఏ కమిషనర్ కనీసం ఏడాది పాటు కూడా పనిచేయలేక పారిపోతుండడం గమనార్హం.

నగర పాలక సంస్థలో మంత్రి, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యం