
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఇవాళ విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ బుధవారం వాదనలు వినిపించారు. స్పీకర్‌కు కోర్టులు గడువు విధించడం సరికాదని ఆయన వాదించారు. ఈ క్రమంలో.. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా? అని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది.
‘‘స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవు. ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకే జ్యుడీషియల్ సమీక్షకు అవకాశముంటుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ స్పీకర్‌కు గడువు విధించడం సరికాదు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైందే. స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పడం భావ్యం కాదు. ఒకవేళ సూచనలు చేస్తే స్వీకరించాలా? లేదా? అనేది స్పీకర్ నిర్ణయమే. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదు’’ అని ముకుల్ రోహత్గీ వాదించారు.
ముకుల్ రోహత్గీ వాదనల్లో జస్టిస్ బీఆర్ గవాయ్ జోక్యం చేసుకున్నారు. హైకోర్టు జోక్యం చేసుకోవద్దా?. రాజ్యాంగ పరిరక్షకులుగా న్యాయస్థానాలు వ్యవహరిస్తాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే సుప్రీం కోర్టు కూడా చేతులు కట్టుకుని చూస్తుండాలా?. నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా?. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న విషయం మరిచిపోవద్దు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా? ఆయనకు విజ్ఞప్తి చేయడమో.. ఆదేశించడమో చేయలేమా? అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.
అయితే అది ప్రత్యేక సందర్భమన్న రోహత్గి.. సుప్రీం కోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉందని, నిర్ణయాలపై న్యాయసమీక్ష చేయొచ్చని తెలియజేశారు.. ఫిరాయింపులపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని వాదించారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే పిటిషన్ వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారని.. కనీసం ఆలోచించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని కోర్టుకు తెలియజేశారు.
2024 మార్చి 18న పిటిషనర్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. 2025 జనవరి 16న 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ తన విధులు నిర్వర్తిస్తున్నారు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున ఇవాళ ముకుల్ రోహత్గీ వాదనలు ముగిశాయి. ఇక అసెంబ్లీ కార్యదర్శి తరపున రేపు(గురువారం) వాదనలు వినిపిస్తానన్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ బెంచ్ సమ్మతి తెలిపి విచారణ వాయిదా వేసింది.
తెలంగాణలో కారు పార్టీ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని, ఉన్నత న్యాయస్థానం చెప్పినా వాళ్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని.. అనర్హత వేటు కోరుతూ బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతరులు పిటిషన్లు వేశారు. అయితే మొదటి నుంచి ఈ కేసు విచారణలో తెలంగాణ స్పీకర్ తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేస్తూనే వస్తోంది. గత విచారణలో.. బీఆర్‌ఎస్ తరఫున ఆర్యమా సుందరం వాదనలు పూర్తి చేశారు. ఆ వాదనల సమయంలో.. సుప్రీం కోర్టు ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలే చేసింది. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది.