
ఛానల్ సిబ్బందిని విసిగిస్తున్న యువతి..
హైదరాబాద్ : తాను కోరిన పాటను ప్రసారం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ యువతి బెదిరించడంతో ఛానల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని ఓ టీవీ ఛానెల్ రోజూ మ్యూజిక్ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేస్తుంది. ఓ యువతి ఈ కార్యక్రమానికి ప్రతిరోజూ ఫోన్ చేస్తూ ఒకే పాటను కోరుకుంటుంది.
ఒకసారి ప్రసారం చేసిన తర్వాత కూడా మళ్లీ ఫోన్ చేసి అదే పాట కావాలంటూ పట్టుబడుతూ నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఫోన్‌లో అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే బాగుండదంటూ హెచ్చరించేది. తాజాగా శనివారం ఫోన్ చేసిన ఆమె నేను కోరిన పాటను వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. దీంతో ఆందోళన చెందిన టీవీ నిర్వాహకులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.