San Bernardino
-
అమెరికాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి
మైసూరు : ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మైసూరు యువకుడు ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. గురువారం జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మైసూరులోని కువెంపు నగర్‌కు చెందిన అభిషేక్ సుధేశ్ భట్ (25) ఇంజనీరింగ్ పూర్తిచేసి ఏడాదిన్నర క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. శాన్ బెర్నార్డియాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తూ ఓ హోటల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం హోటల్‌కు వచ్చిన ఓ దుండగుడు అభిషేక్‌తో గొడవపడి, తుపాకితో కాల్పులు జరిపి పారిపోయాడు. తీవ్ర గాయాలతో అభిషేక్ అక్కడిక్కడే మృతి చెందాడు. -
అమెరికా స్కూల్లో కాల్పులు
-
కాలిఫోర్నియా స్కూల్లో కాల్పులు
లాస్ ఎంజెలెస్: కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ బెర్నార్డినోలోని ప్రాధమిక పాఠశాలలో జరిగిన హత్నాయత్నం ఘటనలో ముగ్గురు చనిపోవడం కలకలం రేపింది. రెండేళ్ల క్రితం బెర్నార్డినోలో జరిగిన ఉగ్రదాడిలో 14 మంది మరణించిన సంఘటన మరువక ముందే జరిగిన తాజా ఘటన..స్థానికులను ఆందోళనకు గురి చేసింది. అయితే తాజా ఘటన కుటుంబ కలహాల కారణంగానే జరిగిందని పోలీసులు నిర్ధారించారు. సెడ్రిక్ అండర్సన్ అనే 53 ఏళ్ల వ్యక్తి...అదే స్కూల్లో టీచర్‌గా వున్న తన భార్య కారెన్ ఎలైన్ స్మిత్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో భార్య చనిపోగా, తీవ్రంగా గాయపడిన మార్టినెజ్ అనే బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మరో ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ అండర్సన్...కాల్పులు జరిగిన తర్వాత అదే గన్‌తో పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని టార్గెట్ విద్యార్థులు కాదని, తననుంచి విడిపోయిందనే కోపంతో భార్యను చంపడానికే అతను స్కూల్ వచ్చి కాల్పులు జరిపాడని పోలీసులు చెప్తున్నారు. -
ఎట్టకేలకు తలొగ్గిన యాపిల్ కంపెనీ!
గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న హైడ్రామా తర్వాత యాపిల్ సంస్థ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. వివాదాస్పదంగా మారిన టెర్రెరిస్టు ఐఫోన్ ను అన్ లాక్ చేయడానికి కొత్త ప్రోగ్రామ్ డెవలప్ చేసి ఇచ్చేందుకు సోమవారం అంగీకరించింది. ఐఫోన్ అన్‌లాక్ విషయంలో యాపిల్ కంపెనీకి, అమెరికా ప్రభుత్వానికి గతేడాది డిసెంబర్ నుంచి వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే శాన్‌బెర్నార్డినో లో కాల్పులు జరిపిన ఉగ్రవాది ఐఫోన్‌ను అన్‌లాక్ చేయాలని గతంలో అమెరికా దిగువ కోర్టులు ఆదేశాలు జారీచేసినా యాపిల్ సంస్థ అందుకు నిరాకరిస్తూ వచ్చింది. ఆ కంపెనీకి వ్యతిరేకంగా మరో కేసును ఆ దేశ న్యాయవిభాగం కోర్టు ముందు ఈ ఏడాది మొదట్లో ఉంచింది. గతేడాది డిసెంబర్ 2 న సయీద్ ఫరూక్, తష్ఫిన్ మాలిక్ దంపతులు కాలిఫోర్నియా లోని శాన్ బెర్నార్డినోలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 14 మందిని పొట్టనపెట్టుకున్నారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో వీరిద్దరూ హతమైన విషయం తెలిసిందే. అయితే ఫరూక్ ఐఫోన్‌ను డీకోడ్ చేసి సమాచారాన్ని సేకరించాలనుకున్న ఎఫ్‌బీఐ అధికారులకు యాపిల్ హై సెక్యూరిటీ టెక్నాలజీ అడ్డుగా నిలిచింది. దీంతో యాపిల్ సంస్థ ఎఫ్‌బీఐకి ఈ సాంకేతిక సహకారాన్ని అందించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చాలా రోజులుగా ఇందుకు నిరాకరిస్తూ వచ్చిన యాపిల్ యాజమాన్యం ప్రత్యామ్నాయంగా కొత్త ప్రోగ్రామ్ ను సిద్ధం చేసి ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో యాపిల్ పై దాఖలైన పిటిషన్, కేసులను అమెరికా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తాము ఈ సహాయం చేసేందుకు ముందుకు వచ్చామని ఆ సంస్థకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. -
యాపిల్‌ను బహిష్కరించండి!
వాషింగ్టన్: రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రఖ్యాత యాపిల్ కంపెనీపై విరుచుకుపడ్డారు. సాన్ బెర్నార్డినో కాల్పుల ఉగ్రవాది ఐఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు యాపిల్ కంపెనీ నిరాకరిస్తుండటంతో ఆ కంపెనీ ఉత్పత్తులన్నింటినీ బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. కనీసం అలాంటి సమాచారం ఇచ్చేవరకు యాపిల్ సంస్థ ఉత్పత్తులకు దూరంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. ప్రస్తుతం రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న ట్రంప్ సౌత్ కరోలినాలోని పాలేస్ ఐలాండ్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. కాలిఫోర్నియాలోని సాన్‌బెర్నార్డినో లో భార్య తష్ఫీన్ మాలిక్ తో కలిసి రిజ్వాన్ సయెద్ ఫరుఖ్ కాల్పులు జరిపి.. 14 మందిని పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా ఫరుఖ్ ఐఫోన్ ను అన్‌లాక్ చేసి.. అందులోని వివరాలు తెలుసుకునేందుకు వీలు కల్పించాలని యాపిల్ కంపెనీపై అమెరికా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఈ విషయమై ఎఫ్‌బీఐ కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, ప్రైవసీని దెబ్బతీసే ఇలాంటి చర్యలకు తాము అంగీకరించబోమని యాపిల్ అంటోంది. -
ఐఫోన్లో 'ఐ' అంటే ఐఎస్ఐఎస్సే!
అమెరికాలోని సాన్ బెర్నార్డినో కాల్పుల నిందితుడు, ఉగ్రవాది సయెద్ ఫరూఖ్ ఐఫోన్ యాక్సెస్ ఇచ్చేందుకు ప్రఖ్యాత యాపిల్ సంస్థ నిరాకరించడంపై బాధితుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ఏడాది డిసెంబర్లో సయెద్ ఫరూఖ్ (28), అతని భార్య తష్ఫీన్ మాలిక్ (2౦) సాన్బెర్డినోలో విచ్చలవిడిగా కాల్పులు జరిపి 17 మంది ప్రాణాలు పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న అమెరికా ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) సయెద్ ఫరూఖ్ ఐఫోన్ పాస్‌వర్డ్‌ను తెరిచి.. అందులోని వివరాలు చూసేందుకు అనుమతి ఇవ్వాలని యాపిల్‌ను కోరింది. అందుకు యాపిల్ సంస్థ నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించింది. అమెరికా కోర్టు కూడా అతని ఐఫోన్ యాక్సెస్‌ను దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని యాపిల్‌ను ఆదేశించింది. అయినప్పటికీ యాపిల్ కంపెనీ ఇందుకు ఒప్పుకోలేదు. ఐఫోన్ యూజర్ల ప్రైవసీని దెబ్బతీసేవిధంగా ఉన్న ఈ ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని భావిస్తోంది. ఆనాటి కాల్పుల ఘటనలో చనిపోయిన సయెద్కు ఐఫోన్ 5సీ ఉంది. ఆ ఫోన్లోని వివరాలు చూసేందుకు కోర్టు ఆదేశించినా.. యాపిల్ అంగీకరించకపోవడంపై సాన్‌బెర్నార్డినో షూటింగ్ ఘటన బాధితులు మండిపడుతున్నారు. ఐఫోన్ యాక్సెస్ ఇవ్వడం ద్వారా దర్యాప్తుకు సహకరించాలని మృతుల కుటుంబసభ్యులు కోరుతున్నారు. 'ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు ఐఫోన్ కొనుగోలు చేస్తున్నట్టు అనిపిస్తున్నది. దీనిని బట్టి ఐఫోన్ (iPhone)లోని చిన్న 'ఐ' ఐఎస్ఐఎస్ అయి ఉండాలి' అని మాండి ఫిఫెర్ అన్నారు. సాన్‌బెర్నార్డినో షూటింగ్ ఘటనలో ఆయన తనకు కాబోయే భార్య షనాన్ జాన్సన్‌ను కోల్పోయారు. 60 ఏళ్ల తన సోదరుడు ఇసాక్ అమానియోస్ను కాల్పుల్లో కోల్పోయిన రాబెల్ తెక్లీబ్ మాట్లాడుతూ తాము కూడా వ్యక్తిగత ప్రైవసీని గౌరవిస్తామని, అయితే దర్యాప్తు విషయంలో దీనికి మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. సాన్‌బెర్నార్డినో షూటింగ్ ఘటనలో చనిపోయిన షనాన్ జాన్సన్ తో మాండి ఫిఫెర్.. -
ఐఫోన్ హ్యాక్ కోసం యాపిల్‌కు ఆదేశాలు
న్యూయార్క్: కాలిఫోర్నియాలో నరమేధానికి కారణమైన ఉగ్రవాది ఫరూక్ ఐఫోన్‌ను హ్యాక్ చేయాలని కోర్టు యాపిల్ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రత కన్నా డిజిటల్ ప్రైవసీ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలతో ఉగ్రవాది ఐఫోన్‌ను హ్యక్ చేయడానికి కావలసిన సాంకేతికతను అందించి విచారణ అధికారులకు విలువైన సమాచారాన్ని సేకరించడంలో యాపిల్ సహకరించనుంది. డిసెంబర్ 2 న సయీద్ ఫరూక్, తష్ఫిన్ మాలిక్ దంపతులు సాన్ బెర్నార్డినోలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 14 మంది మృతికి కారణమై పోలీసుల కాల్పుల్లో వీరిద్దరూ హతమైన విషయం తెలిసిందే. అయితే ఫరూక్ ఐఫోన్‌ను డీకోడ్ చేసి సమాచారాన్ని సేకరించాలనుకున్న ఎఫ్‌బీఐ అధికారులకు యాపిల్ హై సెక్యూరిటీ టెక్నాలజీ అడ్డుగా నిలిచింది. దీంతో యాపిల్ సంస్థ ఎఫ్‌బీఐకి ఈ సాంకేతిక సహకారాన్ని అందించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆ టెర్రర్ దంపతులను పూడ్చిపెట్టారు
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ కాల్పులతో మారణహోమం సృష్టించి పోలీసులు కాల్పుల్లో హతులైన ఆ ఇద్దరు ముస్లిం దంపతులను పూడ్చిపెట్టినట్లు కాలిఫోర్నియా అధికారులు తెలిపారు. ఈ మంగళవారం మధ్యాహ్నం వారి మృతదేహాలు పూడ్చేసినట్లు చెప్పారు. ఈ నెల 2 తెల్లవారుజామున సయెద్ రిజ్వాన్ ఫరుక్, తష్ఫీన్ మాలిక్ దంపతులు కాలిఫోర్నియాలోని సాన్ బెర్నార్డినోలో ఓ హాలీడే పార్టీపై కాల్పులు జరిపి 14మందిని హతమార్చారు. ఈ ఘటనలో 21మంది గాయపడ్డారు. ఈ ఘటనకు తమదే బాధ్యతని, సిరియాలోని తమ ప్రాబల్య ప్రాంతాలపై దాడులు చేస్తుండటంతో ప్రతీకారంగా ఈ దాడి జరిపినట్టు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించింది. అయితే, అదే రోజు పోలీసులు తీవ్రంగా గాలింపులు జరిపిఎదురుకాల్పులు జరపగా వారిద్దరు ప్రాణాలుకోల్పోయారు. అప్పుడు స్వాధీనం చేసుకున్న వారి మృతదేహాలను మంగళవారం బయటకు తీసుకొచ్చి గంటల్లోనే ఎవరికీ సమాచారం అందించకుండా పూడ్చి వేశారు. దీనిపై అధికారులు ఎలాంటి అదనపు సమాచారం ఇవ్వలేదు. -
'స్కూళ్లపై దాడిచేస్తాం... 6.60లక్షల మందిని చంపేస్తాం'
లాస్ఏంజిలిస్: ‘స్కూళ్లపై దాడిచేస్తాం. విద్యావ్యవస్థలోని 6.60లక్షల మందిని చంపేస్తాం’ అని పోలీసులకు వచ్చిన బెదిరింపుతో అమెరికాలోని లాస్ ఏంజిలస్‌లో పాఠశాలలను మూసేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం ఈ బెదిరింపు వచ్చిందని, విద్యార్థులకు ముప్పు వాటిల్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 2న శాన్ బెర్నార్డినోలో పాక్ జాతీయులైన దంపతులు క్రిస్మస్ పార్టీపై దాడి చేసి 14 మందిని చంపడం తెలిసిందే. తాజా బెదిరింపుతో మొత్తం నగరం అప్రమత్తమైంది. -
కాలిఫోర్నియాలో దాడి మా మద్దతుదారుల పనే
-
'కాలిఫోర్నియాలో దాడి మావాళ్ల పనే'
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ కాల్పులతో మారణహోమం సృష్టించిన ఇద్దరు దంపతులు తమ మద్దతుదారులేనని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడిలో మరణించిన ఆ ఇద్దరిని అమరవీరులుగా గుర్తించాల్సిందిగా కోరుతూ తాము భగవంతునికి ప్రార్థనలు జరుపుతామని ఐఎస్ఐఎస్ గ్రూపు రేడియో అల్-బయన్ రేడియో తెలిపింది. బుధవారం తెల్లవారుజామున సయెద్ రిజ్వాన్ ఫరుక్, తష్ఫీన్ మాలిక్ దంపతులు కాలిఫోర్నియాలోని సాన్ బెర్నార్డినోలో ఓ హాలీడే పార్టీపై కాల్పులు జరిపి 14మందిని హతమార్చారు. ఈ ఘటనలో 21మంది గాయపడ్డారు. ఈ ఘటనకు తమదే బాధ్యతని, సిరియాలోని తమ ప్రాబల్య ప్రాంతాలపై దాడులు చేస్తుండటంతో ప్రతీకారంగా ఈ దాడి జరిపినట్టు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ మద్దతుదారులు ట్విట్టర్లో ప్రకటించారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద హస్తముందని అమెరికా పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. -
క్రిస్మస్ పార్టీపై తూటాల వర్షం
* అమెరికాలో మరో దారుణం * 14 మంది దుర్మరణం.. * 17 మందికి గాయాలు శాన్ ఫ్రాన్సిస్కో: ఆగంతకుల తుపాకీ కాల్పులతో అమెరికా రక్తసిక్తమైంది. పాకిస్తాన్ సంతతికి చెందిన ఒక యువ జంట కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఒక వికలాంగుల సహాయ కేంద్రంలో జరుగుతున్న క్రిస్మస్ పార్టీపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 17 మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడ్డ ఇద్దరూ ఆ తర్వాత కొద్ది గంటలకే పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. లాస్ ఏంజెలెస్‌కు 60 మైళ్ల దూరంలో శాన్ బెర్నార్డినో పట్టణం ఉంది. ఇక్కడ ఇన్లాండ్ రీజనల్ సెంటర్.. శారీరక, మానసిక వికలాంగులకు సహా యం అందిస్తోంది. శాన్ బెర్నార్డినో కౌంటీ ఆరోగ్య విభాగానికి చెందిన ఉద్యోగులు బుధవారం ఉదయం 11గంటలకు (భారత కాలమానం ప్రకా రం బుధవారం అర్థరాత్రి దాటాక.. గురువారం తెల్లవారుజాము ఒంటిగంటకు) క్రిస్మస్ పార్టీ చేసుకుంటుండగా ఈ మారణహోమం జరిగింది. పార్టీపై కాల్పులు జరిపిన జంట నలుపు రంగు ఎస్‌యూవీలో పరారవగా పోలీసులు వారిని వెంటాడారు.4 గంటల గాలింపు, ఛేజింగ్ తర్వాత ఎదురు కాల్పుల్లో ఇద్దరు హంతకులు చనిపోయారు. వారిద్దరి పేర్లు సయ్యద్‌రిజ్వాన్ ఫరూక్ (28), తష్ఫీ న్ మాలిక్ (27) అని, ఇద్దరూ పాక్ సంతతికి చెంది న వారని గుర్తించినట్లు శాన్ బెర్నాడ్డినో పోలీస్ చీఫ్ జరాడ్ బెర్గ్వాన్ తెలిపారు. ఈ దంపతులకి 6 నెలల కుమార్తె ఉంద ని ఫరూక్ సోదరి భర్త ఫర్హాన్చెప్పారు. ఫరూక్ అమెరికాలోనే పుట్టాడు. అతడు అమెరికా పౌరుడు. శాన్ బెర్నార్డినో కౌంటీ ఆరోగ్య విభాగంలో పర్యావరణ ఆరోగ్య నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఇన్లాండ్ రీజినల్ సెంటర్లోనూ కొన్నిసార్లు పనిచేశాడు. కౌంటీ ఆరోగ్య విభాగం ఉద్యోగులు బుధవారం ఉదయం ఈ సెంటర్లో క్రిస్మస్ పార్టీ చేసుకుంటుండగా తొలుత ఫరూక్ హాజరయ్యాడు. అయితే ఏదో వివాదం నేపథ్యంలో ఆగ్రహంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత స్థానిక ఫరూక్, అతడి భార్య తష్ఫీన్‌లు సైనిక తరహా దుస్తులు ధరించి, పేలుడు పదార్థాలు, ఆటోమాటిక్ రైఫిళ్లు, హ్యాండ్గన్లతో వచ్చి కాల్పులు జరిపారు. ఈ కాల్పు ల్లో 14 మంది చనిపోయారు. ఇంకొందరు గాయపడ్డారు. కాల్పులకు కారణమేమిటనేది ఇంకా తెలియలేదని.. ఉగ్రవాదం కారణమనే అంశాన్నీ కొట్టివేయలేమని పేర్కొన్నారు. ‘వారి దుస్తులు, ఉపయోగించిన ఆయుధాలను చూస్తే ఈ దాడికి ముందస్తు ప్రణాళిక ఉండే ఉండాలి. వాళ్లు తాత్కాలిక ఆవేశం తో పరుగున ఇంటికెళ్లి, సైనిక తరహా దుస్తులు ధ రించి, తుపాకులు పట్టుకుని వచ్చి కాల్పులు జరిపారని నేననుకోను’ అని జరాడ్ అన్నారు. ‘బుధవారం ఉదయం పార్టీలో తొలుత వారితో పాటు టేబుల్ వద్ద కూర్చున్నాడు. అంతలోనే జాకెట్ వదిలేసి మాయమైపోయాడు. ఫరూక్ ఈ ఏడాది మొదట్లో సౌదీ అరేబియా వెళ్లి.. భార్యతో కలిసి వచ్చాడు. ఆ తర్వాత గడ్డం కూడా పెంచాడు’ అని ఫరూక్ సహోద్యోగులు వివరించారు. తుపాకీ.. వారి సంస్కృతి! ప్రపంచంలో చైనా, భారత్‌ల తర్వాత అత్యధిక జనాభా గల దేశం అమెరికా. 31.89 కోట్ల మంది ఇక్కడ నివసిస్తున్నారు. వీరిలో 88.8 శాతం మంది వద్ద సొంత తుపాకులు ఉన్నాయి. అమెరికా పౌరులు దాదాపు 27 కోట్ల నుంచి 31 కోట్ల తుపాకులు వినియోగిస్తున్నారని ఒక అంచనా. ప్రపంచంలో పౌరుల వద్ద అతిఎక్కువ సంఖ్యలో తుపాకులు ఉన్న దేశం అమెరికానే. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగే హత్యల్లో 67.5 శాతం హత్యలు తుపాకీలతోనే జరుగుతున్నాయి. అమెరికాలో తుపాకీ సంస్కృతి దాని చరిత్ర అంత పురాతనమైనది. ఐరోపా దేశస్థులు.. అమెరికాల్లోని స్థానిక ఆదివాసీలను జయించి.. తమ కాలనీలను ఏర్పాటు చేసుకోగల బలాన్నిచ్చిం ది.. వారి తుపాకీయే! కేవలం కొన్నివందల మంది తుపాకులతో దండెత్తి.. లక్షలాది మందిని పాదాక్రాంతం చేసుకున్నారు. అప్పటి నుంచీ.. పొరుగు ప్రాంతాలకు విస్తరించటానికి, స్థానిక ఆదివాసీలను తరిమేయటానికి, పక్కకాలనీల వారిపై పగ తీర్చుకోవటానికి, ‘బానిస’ తిరుగుబాటును అణచివేయటానికి తుపాకీయే తిరుగులేని ఆయుధమైంది. అలా అమెరికా చరిత్ర అంతా ‘తుపాకీ’తో ముడిపడి ఉంది. అయితే.. గత శతాబ్ద కాలంగా అమెరికా ప్రజలకు తుపాకీలతో పెద్ద అవసరం లేకపోయింది. అయినా.. తుపాకీని కలిగి వుండటం.. వారి సంస్కృతిగా స్థిరపడిపోయింది. దేశంలో పౌరులకు తుపాకుల విక్రయం, వినియోగంపై దాదాపుగా ఎటువంటి ఆంక్షలు లేవు. అయితే.. 1929లో రెండు మాఫియా ముఠాల మధ్య పోరాటం వల్ల జరిగిన సెయింట్ వాలెంటైన్స్ డే ఊచకోత నేపధ్యంలో 1934లో నేషనల్ ఫైర్ ఆర్మ్స్యాక్ట్ను అమలులోకి తెచ్చారు. అందులోనూ పెద్దగా నిబంధనలు లేవు. ఆ తర్వాత 1960ల్లో దేశాధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నడీ, సెనెటర్ రాబర్ట్ కెన్నడీ, ఆఫ్రికా-అమెరికన్ ఉద్యమకారులైన మాల్కమ్-ఎక్స్, మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ హత్యల నేపథ్యంలో 1968లో గన్కంట్రోల్ యాక్ట్‌ను తీసుకొచ్చినా దాని ప్రభా వం నామమాత్రమే. 1980లో రాక్‌స్టార్ జాన్ లెనన్ హత్య, 1981లో దేశాధ్యక్షుడు రొనాల్డ్రీగన్పై హత్యాయత్నం నేపథ్యంలో 1993లో బ్రాడ్లీ చట్టాన్ని తెచ్చారు. దీనిప్రకారం.. తుపాకులు కొనేవారి నేపథ్యాన్ని తనిఖీ చేయటం తప్పనిసరి చేశారు. మరోవైపు.. ఆత్మరక్షణ కోసం తుపాకీ కలిగి ఉండటం రాజ్యాంగపరంగా పౌరుల హక్కు అని 2008, 2010 సంవత్సరాల్లో అమెరికా సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అయితే.. తుపాకీ విక్రయాలు, వినియోగంపై మరిన్ని ఆంక్షలు తీసుకురావటంతో పాటు వాటిని కఠినతరం చేయాలన్న ఉద్యమం చాలా కాలంగా సాగుతోంది. దీనికి రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకిస్తుండగా.. డెమొక్రటిక్ పార్టీ అనుకూలంగా ఉంది. అమెరికాలో తుపాకులకు భారీ మార్కెట్ ఉండటంతో ఆయుధాల తయారీ సంస్థలు.. ప్రజలు క్రమంగా తుపాకీ కలిగి ఉండే హక్కు కోల్పోతారన్న ఆందోళనతో ‘నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్’ అనే సంస్థ, మరికొన్ని సంస్థలు.. తుపాకీ సంస్కరణలను తీసుకు రాకుండా బలమైన ‘గన్ లాబీ’గా తయా రై అమెరికా కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. ‘తుపాకీ’ని నియంత్రించాలి వాషింగ్టన్: అమెరికాలో తాజా కాల్పుల ఘటన నేపథ్యంలో దేశంలో తుపాకుల నియంత్రణకు మరిన్ని సంస్కరణలు తేవాలని అధ్యక్షుడు ఒబామా పునరుద్ఘాటించారు. ఆయన గురువారం సీబీఎస్ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. ‘‘ఎవరి నేపథ్యాన్నీ పరిశీలించకుండా ఎవరైనా దుకాణానికి వెళ్లి తుపాకులు కొనుక్కునేందుకు అనుమతించే ప్రస్తుత చట్టాన్ని మార్చాల్సి ఉంది. ఈ చట్టాన్ని మార్చటానికి రిపబ్లికన్ల ఆధిక్యం ఉన్న కాంగ్రెస్ నిరాకరించింది. పౌరుల భద్రతకోసం ప్రజాప్రతినిధులు కలిసిరావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘ఉగ్రవాదం గురించి ఆందోళన చెందేవారికి మన వద్ద ఒక ‘నో-ఫ్లై’ జాబితా ఉందని తెలిసి ఉండొచ్చు. ఆ జాబితాలో పేర్లు ఉన్న వారికి విమానాల్లో ప్రయాణించేందుకు అనుమతిలేదు. కానీ.. వారు అమెరికాలో ఎక్కడైనా తుపాకులు కొనేవీలుంది. వారిని ఆపటానికి మనం చేయగలిగింది ఏమీ లేదు.’’ అని వ్యాఖ్యానించారు. -
అమెరికాలో మళ్లీ కాల్పులు
-
కాల్పులకు దిగినవారిలో ఓ మహిళ కూడా..
శాన్ బెర్నార్డినో: అమెరికాలో తాజాగా కాల్పులకు పాల్పడిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు ఇప్పటికే హతమయ్యారని పోలీసు అధికారులు చెప్పారు. వారిలో ఓ మహిళ కూడా ఉందని వారు స్పష్టం చేశారు. హతమైన వారివద్ద భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి కాల్పులు తుపాకులు ఉన్నట్లు చెబుతున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ బెర్నార్డినో నగరంలోని ఓ సేవా కేంద్రంలోకి చొరబడ్డ ముగ్గురు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దాదాపు 14 మంది ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. మరో 20మంది వరకు గాయపడ్డారు కూడా. అయితే, కాల్పులకు దిగిన వారికోసం దాదాపు 1300మంది పోలీసులు తీవ్రంగా గాలింపులు జరపగా కాల్పులకు దిగిన ముగ్గురిలో ఇద్దరు హతమైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సమయంలోనే మరో వ్యక్తి పరుగులు తీస్తుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడు ఉగ్రవాదా ?కాదా? అతడికి తాజా ఘటనకు సంబంధం ఉందా లేదా అనే విషయం ఇంకా నిర్దారణ కావాల్సి ఉంది. -
దాడికి ఆ చోటే ఎందుకు ఎంచుకున్నారో?
సాధారణంగా ఎప్పుడూ జనసంద్రం ఎక్కువగా ఉండే ప్రాంతాలను మాత్రమే లక్ష్యంగా ఎంచుకునే ఉగ్రవాదులు ఈసారి ఎంతో ప్రశాంతమైన ప్రాంతాన్ని ఎంచుకున్నారని అమెరికా నిఘా వర్గాలు ఆలోచిస్తున్నాయి. పెద్ద పెద్ద టవర్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సినిమా థియేటర్స్‌ను లక్ష్యంగా ఎంచుకునే ఉగ్రవాదులు నిర్మలంగా ఉండే శాన్ బెర్నార్డియో ప్రాంతాన్ని ఎంచుకోవడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నాయి. ఇటీవల ఫ్రాన్స్‌పై దాడి అనంతరం వైట్ హౌస్ పై కూడా దాడి చేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రముఖ అధికారిక నివాసాలతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో అమెరికా భద్రతను మోహరించింది. తాజాగా కాల్పులు జరగిన క్షణాల్లోనే దాదాపు 1300 మంది పోలీసులు కాల్పులకు తెగబడినవారికోసం వీధుల్లో గాలింపులు మొదలుపెట్టారంటే భద్రత విషయంలో అమెరికా ఎంత అప్రమత్తంగా ఉందో అర్థమవుతుంది. సాధారణంగా శాన్ బెర్నార్డియోలో దాదాపు చికిత్స కేంద్రాలు ఎక్కువ. అందులో మానసిక వికలాంగులకు శిక్షణ ఇచ్చేవాటివే అగ్రస్థానం. అక్కడ హడావిడిగాని అలజడిగానీ ఉండదు. దాదాపు 80శాతం మంది మానసిక రోగులు అక్కడ చికిత్స పొందుతుంటారు. అలాంటి ప్రాంతంలోకి ఒక బ్లాక్ ఎస్వీయూలో మిలటరీ దుస్తుల్లో వచ్చిన ముగ్గురు దుండగులు వచ్చిరాగానే విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల వల్ల 14మంది చనిపోయినట్లు చెబుతున్నా అధికారికంగా మాత్రం ఎక్కువమంది చనిపోయినట్లు సమాచారం. 20మందికి పైగా గాయాలపాలయ్యారు కూడా. అయితే, దాడికి పాల్పడింది ఎవరనే విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. ఒక వేళ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కు చెందిన వారే ఈ దాడికి పాల్పడితే పోలీసుల అప్రమత్తతను పక్కదారి పట్టించి భవిష్యత్తులో అనూహ్యంగా ఎక్కడైనా జరుపుతామని పరోక్షంగా హెచ్చరించేందుకు తాజా కాల్పులను జరిపి చూపించిందా అనేది కొంత అనుమానించాల్సిన విషయమే. -
అమెరికాలో మళ్లీ కాల్పులు..
-
అమెరికాలో మళ్లీ కాల్పులు..
శాన్ బెర్నార్డినో: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం. 15 రోజుల వ్యవధిలో మూడో నరమేథం. కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ బెర్నార్డినో నగరంలోని సేవా కేంద్రంలోకి చొరబడ్డ ముగ్గురు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ సంగటనలో 14 మంది ప్రాణాలుకోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11:45 గంటలకు ఈ ఘటన జరిగింది. సైనిక దుస్తులు ధరించిన ముగ్గురు వికలాంగుల సేవాకేంద్రంలో కాల్పులు జరిపి, నలుపురంగు వాహనంలో పారిపోయారని, గాలింపు చర్యల్లో భాగంగా శాన్ బెర్నార్డినోలోని అన్ని ఇళ్లను తనిఖీ చేస్తున్నామని ఎఫ్‌బీఐ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆ ముగ్గురు.. ఉగ్రవాదులా? లేక వేరెవరనేది ఇంకా తేలలేదు. సాయుధులు సేవా కేంద్రంలోకి వచ్చిరాగానే కాల్పులు ప్రారంభించారని, కొందరు బుల్లెట్ గాయలతో నేలకొరగగా, మరి కొందరు ప్రాణభయంతో గదుల్లోకి వెళ్లి దాక్కున్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఆ ముగ్గురి వద్ద భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నట్లు మరో వ్యక్తి పోలీసులకు తెలిపాడు. అధ్యక్షుడు బరాక్ ఒబామా శాన్ బెర్నార్డినో కాల్పుల ఘటన వివరాలను ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా తెలుసుకుంటూ సూచనలు అందిస్తున్నారు. దుండగులను బంధించేందుకు ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సిఉంది. నవంబర్ 27న ఇదే రాష్ట్రంలోని కొలరాడోస్ప్రింగ్స్ పట్టణంలో సాయుధుడు జరిపిన కాల్పుల్లో పోలీస్ అధికారి సహా ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. అంతకు నాలుగు రోజుల మందు న్యూ ఓర్లియాన్స్ నగరంలోని ఓ పార్కులో ఇరువర్గాలకు జరిగిన కాల్పుల్లో 10 మంది దుర్మరణం చెందారు. తాజా ఘటనలో 14 మంది మరణించడంతో గడిచిన 15 రోజుల్లోనే అగ్రరాజ్యంలో మూడు మారణహోమాలు జరిగినట్లయింది.