దుండగుల కాల్పుల్లో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు
శాన్ బెర్నార్డినో: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం. 15 రోజుల వ్యవధిలో మూడో నరమేథం. కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ బెర్నార్డినో నగరంలోని సేవా కేంద్రంలోకి చొరబడ్డ ముగ్గురు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ సంగటనలో 14 మంది ప్రాణాలుకోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11:45 గంటలకు ఈ ఘటన జరిగింది. సైనిక దుస్తులు ధరించిన ముగ్గురు వికలాంగుల సేవాకేంద్రంలో కాల్పులు జరిపి, నలుపురంగు వాహనంలో పారిపోయారని, గాలింపు చర్యల్లో భాగంగా శాన్ బెర్నార్డినోలోని అన్ని ఇళ్లను తనిఖీ చేస్తున్నామని ఎఫ్బీఐ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆ ముగ్గురు.. ఉగ్రవాదులా? లేక వేరెవరనేది ఇంకా తేలలేదు.
సాయుధులు సేవా కేంద్రంలోకి వచ్చిరాగానే కాల్పులు ప్రారంభించారని, కొందరు బుల్లెట్ గాయలతో నేలకొరగగా, మరి కొందరు ప్రాణభయంతో గదుల్లోకి వెళ్లి దాక్కున్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఆ ముగ్గురి వద్ద భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నట్లు మరో వ్యక్తి పోలీసులకు తెలిపాడు. అధ్యక్షుడు బరాక్ ఒబామా శాన్ బెర్నార్డినో కాల్పుల ఘటన వివరాలను ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా తెలుసుకుంటూ సూచనలు అందిస్తున్నారు. దుండగులను బంధించేందుకు ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సిఉంది.
నవంబర్ 27న ఇదే రాష్ట్రంలోని కొలరాడోస్ప్రింగ్స్ పట్టణంలో సాయుధుడు జరిపిన కాల్పుల్లో పోలీస్ అధికారి సహా ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. అంతకు నాలుగు రోజుల మందు న్యూ ఓర్లియాన్స్ నగరంలోని ఓ పార్కులో ఇరువర్గాలకు జరిగిన కాల్పుల్లో 10 మంది దుర్మరణం చెందారు. తాజా ఘటనలో 14 మంది మరణించడంతో గడిచిన 15 రోజుల్లోనే అగ్రరాజ్యంలో మూడు మారణహోమాలు జరిగినట్లయింది.