
ఐఫోన్‌లో 'ఐ' అంటే ఐఎస్ఐఎస్సే!
అమెరికాలోని సాన్ బెర్నార్డినో కాల్పుల నిందితుడు, ఉగ్రవాది సయెద్ ఫరూఖ్ ఐఫోన్ యాక్సెస్ ఇచ్చేందుకు ప్రఖ్యాత యాపిల్ సంస్థ నిరాకరించడంపై బాధితుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ఏడాది డిసెంబర్‌లో సయెద్ ఫరూఖ్ (28), అతని భార్య తష్ఫీన్ మాలిక్ (2౦) సాన్‌బెర్డినోలో విచ్చలవిడిగా కాల్పులు జరిపి 17 మంది ప్రాణాలు పొట్టనబెట్టుకున్నారు.
ఈ ఘటనపై విచారణ జరుపుతున్న అమెరికా ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) సయెద్ ఫరూఖ్ ఐఫోన్ పాస్‌వర్డ్‌ను తెరిచి.. అందులోని వివరాలు చూసేందుకు అనుమతి ఇవ్వాలని యాపిల్‌ను కోరింది. అందుకు యాపిల్ సంస్థ నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించింది. అమెరికా కోర్టు కూడా అతని ఐఫోన్ యాక్సెస్‌ను దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని యాపిల్‌ను ఆదేశించింది. అయినప్పటికీ యాపిల్ కంపెనీ ఇందుకు ఒప్పుకోలేదు. ఐఫోన్ యూజర్ల ప్రైవసీని దెబ్బతీసేవిధంగా ఉన్న ఈ ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని భావిస్తోంది.
ఆనాటి కాల్పుల ఘటనలో చనిపోయిన సయెద్‌కు ఐఫోన్ 5సీ ఉంది. ఆ ఫోన్‌లోని వివరాలు చూసేందుకు కోర్టు ఆదేశించినా.. యాపిల్ అంగీకరించకపోవడంపై సాన్‌బెర్నార్డినో షూటింగ్ ఘటన బాధితులు మండిపడుతున్నారు. ఐఫోన్ యాక్సెస్ ఇవ్వడం ద్వారా దర్యాప్తుకు సహకరించాలని మృతుల కుటుంబసభ్యులు కోరుతున్నారు.
'ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు ఐఫోన్ కొనుగోలు చేస్తున్నట్టు అనిపిస్తున్నది. దీనిని బట్టి ఐఫోన్ (iPhone)లోని చిన్న 'ఐ' ఐఎస్‌ఐఎస్ అయి ఉండాలి' అని మాండి ఫిఫెర్ అన్నారు. సాన్‌బెర్నార్డినో షూటింగ్ ఘటనలో ఆయన తనకు కాబోయే భార్య షనాన్ జాన్సన్‌ను కోల్పోయారు. 60 ఏళ్ల తన సోదరుడు ఇసాక్ అమానియోస్‌ను కాల్పుల్లో కోల్పోయిన రాబెల్ తెక్లీబ్ మాట్లాడుతూ తాము కూడా వ్యక్తిగత ప్రైవసీని గౌరవిస్తామని, అయితే దర్యాప్తు విషయంలో దీనికి మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.
సాన్‌బెర్నార్డినో షూటింగ్ ఘటనలో చనిపోయిన షనాన్ జాన్సన్ తో మాండి ఫిఫెర్..