యాపిల్‌ను బహిష్కరించండి!
వాషింగ్టన్: రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రఖ్యాత యాపిల్ కంపెనీపై విరుచుకుపడ్డారు. సాన్ బెర్నార్డినో కాల్పుల ఉగ్రవాది ఐఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు యాపిల్ కంపెనీ నిరాకరిస్తుండటంతో ఆ కంపెనీ ఉత్పత్తులన్నింటినీ బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. కనీసం అలాంటి సమాచారం ఇచ్చేవరకు యాపిల్ సంస్థ ఉత్పత్తులకు దూరంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. ప్రస్తుతం రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న ట్రంప్ సౌత్ కరోలినాలోని పాలేస్ ఐలాండ్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.
కాలిఫోర్నియాలోని సాన్‌బెర్నార్డినో లో భార్య తష్ఫీన్ మాలిక్ తో కలిసి రిజ్వాన్ సయెద్ ఫరుఖ్ కాల్పులు జరిపి.. 14 మందిని పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా ఫరుఖ్ ఐఫోన్ ను అన్‌లాక్ చేసి.. అందులోని వివరాలు తెలుసుకునేందుకు వీలు కల్పించాలని యాపిల్ కంపెనీపై అమెరికా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఈ విషయమై ఎఫ్‌బీఐ కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, ప్రైవసీని దెబ్బతీసే ఇలాంటి చర్యలకు తాము అంగీకరించబోమని యాపిల్ అంటోంది.