క్రిస్మస్ పార్టీపై తూటాల వర్షం | San Bernardino Shooting Kills at Least 14; Two Suspects Are Dead | Sakshi
Sakshi News home page

క్రిస్మస్ పార్టీపై తూటాల వర్షం

Published Fri, Dec 4 2015 2:59 AM | Last Updated on Tue, Oct 9 2018 3:01 PM

క్రిస్మస్ పార్టీపై తూటాల వర్షం - Sakshi

క్రిస్మస్ పార్టీపై తూటాల వర్షం

* అమెరికాలో మరో దారుణం  
* 14 మంది దుర్మరణం..
* 17 మందికి గాయాలు

శాన్ ఫ్రాన్సిస్కో: ఆగంతకుల తుపాకీ కాల్పులతో అమెరికా రక్తసిక్తమైంది. పాకిస్తాన్ సంతతికి చెందిన ఒక యువ జంట కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఒక వికలాంగుల సహాయ కేంద్రంలో జరుగుతున్న క్రిస్మస్ పార్టీపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 17 మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడ్డ ఇద్దరూ ఆ తర్వాత కొద్ది గంటలకే పోలీసుల కాల్పుల్లో చనిపోయారు.   

లాస్ ఏంజెలెస్‌కు 60 మైళ్ల దూరంలో శాన్ బెర్నార్డినో పట్టణం ఉంది. ఇక్కడ ఇన్‌లాండ్ రీజనల్ సెంటర్.. శారీరక, మానసిక వికలాంగులకు సహా యం అందిస్తోంది. శాన్ బెర్నార్డినో కౌంటీ ఆరోగ్య విభాగానికి చెందిన ఉద్యోగులు బుధవారం ఉదయం 11గంటలకు (భారత కాలమానం ప్రకా రం బుధవారం అర్థరాత్రి దాటాక.. గురువారం తెల్లవారుజాము ఒంటిగంటకు) క్రిస్మస్ పార్టీ చేసుకుంటుండగా ఈ మారణహోమం జరిగింది.

పార్టీపై కాల్పులు జరిపిన జంట నలుపు రంగు ఎస్‌యూవీలో పరారవగా పోలీసులు వారిని వెంటాడారు.4 గంటల గాలింపు, ఛేజింగ్ తర్వాత ఎదురు కాల్పుల్లో ఇద్దరు హంతకులు చనిపోయారు. వారిద్దరి పేర్లు సయ్యద్‌రిజ్వాన్ ఫరూక్ (28), తష్ఫీ న్ మాలిక్ (27) అని, ఇద్దరూ పాక్ సంతతికి చెంది న వారని గుర్తించినట్లు శాన్ బెర్నాడ్డినో పోలీస్ చీఫ్ జరాడ్ బెర్గ్వాన్ తెలిపారు. ఈ దంపతులకి 6 నెలల కుమార్తె ఉంద ని ఫరూక్ సోదరి భర్త ఫర్హాన్‌చెప్పారు. ఫరూక్ అమెరికాలోనే పుట్టాడు. అతడు అమెరికా పౌరుడు.

శాన్ బెర్నార్డినో కౌంటీ ఆరోగ్య విభాగంలో పర్యావరణ ఆరోగ్య నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఇన్‌లాండ్ రీజినల్ సెంటర్‌లోనూ కొన్నిసార్లు పనిచేశాడు. కౌంటీ ఆరోగ్య విభాగం ఉద్యోగులు బుధవారం ఉదయం ఈ సెంటర్‌లో క్రిస్మస్ పార్టీ చేసుకుంటుండగా తొలుత ఫరూక్ హాజరయ్యాడు. అయితే ఏదో వివాదం నేపథ్యంలో ఆగ్రహంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత స్థానిక ఫరూక్, అతడి భార్య తష్ఫీన్‌లు సైనిక తరహా దుస్తులు ధరించి, పేలుడు పదార్థాలు, ఆటోమాటిక్ రైఫిళ్లు, హ్యాండ్‌గన్లతో వచ్చి కాల్పులు జరిపారు. ఈ కాల్పు ల్లో 14 మంది చనిపోయారు.

ఇంకొందరు గాయపడ్డారు. కాల్పులకు కారణమేమిటనేది ఇంకా తెలియలేదని.. ఉగ్రవాదం కారణమనే అంశాన్నీ కొట్టివేయలేమని పేర్కొన్నారు. ‘వారి దుస్తులు, ఉపయోగించిన ఆయుధాలను చూస్తే ఈ దాడికి ముందస్తు ప్రణాళిక ఉండే ఉండాలి. వాళ్లు తాత్కాలిక ఆవేశం తో పరుగున ఇంటికెళ్లి,  సైనిక తరహా దుస్తులు ధ రించి, తుపాకులు పట్టుకుని వచ్చి కాల్పులు జరిపారని నేననుకోను’ అని జరాడ్ అన్నారు.

‘బుధవారం ఉదయం పార్టీలో తొలుత వారితో పాటు టేబుల్ వద్ద కూర్చున్నాడు. అంతలోనే జాకెట్ వదిలేసి మాయమైపోయాడు. ఫరూక్ ఈ ఏడాది మొదట్లో సౌదీ అరేబియా వెళ్లి.. భార్యతో కలిసి వచ్చాడు. ఆ తర్వాత గడ్డం కూడా పెంచాడు’ అని ఫరూక్ సహోద్యోగులు వివరించారు.
 
తుపాకీ.. వారి సంస్కృతి!
ప్రపంచంలో చైనా, భారత్‌ల తర్వాత అత్యధిక జనాభా గల దేశం అమెరికా. 31.89 కోట్ల మంది ఇక్కడ నివసిస్తున్నారు. వీరిలో 88.8 శాతం మంది వద్ద సొంత తుపాకులు ఉన్నాయి. అమెరికా పౌరులు దాదాపు 27 కోట్ల నుంచి 31 కోట్ల తుపాకులు వినియోగిస్తున్నారని ఒక అంచనా. ప్రపంచంలో పౌరుల వద్ద అతిఎక్కువ సంఖ్యలో తుపాకులు ఉన్న దేశం అమెరికానే. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగే హత్యల్లో 67.5 శాతం హత్యలు తుపాకీలతోనే జరుగుతున్నాయి.  
 
అమెరికాలో తుపాకీ సంస్కృతి దాని చరిత్ర అంత పురాతనమైనది. ఐరోపా దేశస్థులు.. అమెరికాల్లోని స్థానిక ఆదివాసీలను జయించి.. తమ కాలనీలను ఏర్పాటు చేసుకోగల బలాన్నిచ్చిం ది.. వారి తుపాకీయే! కేవలం కొన్నివందల మంది తుపాకులతో దండెత్తి.. లక్షలాది మందిని పాదాక్రాంతం చేసుకున్నారు. అప్పటి నుంచీ.. పొరుగు ప్రాంతాలకు విస్తరించటానికి, స్థానిక ఆదివాసీలను తరిమేయటానికి, పక్కకాలనీల వారిపై పగ తీర్చుకోవటానికి, ‘బానిస’ తిరుగుబాటును అణచివేయటానికి తుపాకీయే తిరుగులేని ఆయుధమైంది.

అలా అమెరికా చరిత్ర అంతా ‘తుపాకీ’తో ముడిపడి ఉంది. అయితే.. గత శతాబ్ద కాలంగా అమెరికా ప్రజలకు తుపాకీలతో పెద్ద అవసరం లేకపోయింది. అయినా.. తుపాకీని కలిగి వుండటం.. వారి సంస్కృతిగా స్థిరపడిపోయింది. దేశంలో పౌరులకు తుపాకుల విక్రయం, వినియోగంపై దాదాపుగా ఎటువంటి ఆంక్షలు లేవు. అయితే.. 1929లో రెండు మాఫియా ముఠాల మధ్య పోరాటం వల్ల జరిగిన సెయింట్ వాలెంటైన్స్ డే ఊచకోత నేపధ్యంలో 1934లో నేషనల్ ఫైర్ ఆర్మ్స్‌యాక్ట్‌ను అమలులోకి తెచ్చారు.

అందులోనూ పెద్దగా నిబంధనలు లేవు. ఆ తర్వాత 1960ల్లో దేశాధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నడీ, సెనెటర్ రాబర్ట్ కెన్నడీ, ఆఫ్రికా-అమెరికన్ ఉద్యమకారులైన మాల్కమ్-ఎక్స్, మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ హత్యల నేపథ్యంలో 1968లో గన్‌కంట్రోల్ యాక్ట్‌ను తీసుకొచ్చినా దాని ప్రభా వం నామమాత్రమే. 1980లో రాక్‌స్టార్ జాన్ లెనన్ హత్య, 1981లో దేశాధ్యక్షుడు రొనాల్డ్‌రీగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో 1993లో బ్రాడ్లీ చట్టాన్ని తెచ్చారు. దీనిప్రకారం.. తుపాకులు కొనేవారి నేపథ్యాన్ని తనిఖీ చేయటం తప్పనిసరి చేశారు.

మరోవైపు.. ఆత్మరక్షణ కోసం తుపాకీ కలిగి ఉండటం రాజ్యాంగపరంగా పౌరుల హక్కు అని 2008, 2010 సంవత్సరాల్లో అమెరికా సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అయితే.. తుపాకీ విక్రయాలు, వినియోగంపై మరిన్ని ఆంక్షలు తీసుకురావటంతో పాటు వాటిని కఠినతరం చేయాలన్న ఉద్యమం చాలా కాలంగా సాగుతోంది. దీనికి రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకిస్తుండగా.. డెమొక్రటిక్ పార్టీ అనుకూలంగా ఉంది.

అమెరికాలో తుపాకులకు భారీ మార్కెట్ ఉండటంతో ఆయుధాల తయారీ సంస్థలు.. ప్రజలు క్రమంగా తుపాకీ కలిగి ఉండే హక్కు కోల్పోతారన్న ఆందోళనతో ‘నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్’ అనే సంస్థ, మరికొన్ని సంస్థలు.. తుపాకీ సంస్కరణలను  తీసుకు రాకుండా బలమైన ‘గన్ లాబీ’గా తయా రై అమెరికా కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తున్నాయి.
 
‘తుపాకీ’ని నియంత్రించాలి
వాషింగ్టన్: అమెరికాలో తాజా కాల్పుల ఘటన నేపథ్యంలో దేశంలో తుపాకుల నియంత్రణకు మరిన్ని సంస్కరణలు తేవాలని అధ్యక్షుడు ఒబామా పునరుద్ఘాటించారు. ఆయన గురువారం సీబీఎస్ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. ‘‘ఎవరి నేపథ్యాన్నీ పరిశీలించకుండా ఎవరైనా దుకాణానికి వెళ్లి తుపాకులు కొనుక్కునేందుకు అనుమతించే ప్రస్తుత చట్టాన్ని మార్చాల్సి ఉంది. ఈ చట్టాన్ని మార్చటానికి రిపబ్లికన్ల ఆధిక్యం ఉన్న కాంగ్రెస్ నిరాకరించింది.  

పౌరుల భద్రతకోసం ప్రజాప్రతినిధులు కలిసిరావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘ఉగ్రవాదం గురించి ఆందోళన చెందేవారికి మన వద్ద ఒక ‘నో-ఫ్లై’ జాబితా ఉందని తెలిసి ఉండొచ్చు. ఆ జాబితాలో పేర్లు ఉన్న వారికి విమానాల్లో ప్రయాణించేందుకు అనుమతిలేదు. కానీ.. వారు అమెరికాలో ఎక్కడైనా తుపాకులు కొనేవీలుంది. వారిని ఆపటానికి మనం చేయగలిగింది ఏమీ లేదు.’’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement