Temple officials
-
Ram Mandir Trust: అయోధ్యకు రాకండి!
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22న అయోధ్యకు పోటెత్తొద్దని ఆలయ నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఆ రోజు అయోధ్యలో ఊహించనంతటి రద్దీ ఉంటుంది. కనుక ఎలాగైనా కార్యక్రమాన్ని కళ్లారా చూడాలని అయోధ్య దాకా రాకండి. మీరున్న చోటే ఆలయాల్లో పూజలు చేయండి’’ అని భవ్య రామమందిరం ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. జనవరి 16వ తేదీ నుంచే వైదిక కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పారు. 80 వేల మంది భక్తులకు బస, భోజన వసతి కలి్పంచేలా అయోధ్యలో ’టెంట్ సిటీ’ని నిర్మిస్తున్నారు. ఆలయ పూజారుల్లో తిరుపతి పూర్వ విద్యార్థి అయోధ్య రామాలయ పూజారిగా ఎంపికైన మోహిత్ పాండే తిరుపతిలో గతంలో వేద విద్య అభ్యసించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయంలో ఎంఏ (ఆచార్య) పట్టా సాధించారు. లక్నోలోని సీతాపూర్‌కు చెందిన మోహిత్ గాజియాబాద్‌లోని దుధేశ్వర్ వేద్ విద్యాపీఠ్‌లో ఏడేళ్ల సామవేదం అభ్యసించారు. తర్వాత వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వేద విద్యాభ్యాసం కొనసాగించారు. -
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మీ యాగం
-
శవం తెచ్చిన తంటా.. ఇద్దరు ఆలయ అధికారుల సస్పెండ్
సాక్షి, శ్రీకాళహస్తి: ఓ మృతదేహం పెద్ద ఉపద్రవమే తెచ్చింది. ఇద్దరు ఆలయ ఉద్యోగులపై వేటు పడేలా చేసింది. మరో ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపునకు కారణమైంది. ఆ మృతదేహం కథేమిటో తెలుసుకోవాలంటే.. ముక్కంటి ఆలయ అనుబంధ భరద్వాజ తీర్థంలోని భరద్వాజేశ్వరాలయ సమీపంలో సోమవారం రాత్రి అధికారుల అనుమతి లేకుండా 7 గంటల సమయంలో ఓ మృతదేహాన్ని ఖననం చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం దిరశనమాల గ్రామానికి చెందిన అనిల్ (34) మృతదేహమది. స్థానికంగా ముక్కంటీశుని ఆలయం వద్ద ఓ కుంకుమ దుకాణంలో అతడు పనిచేసేవాడు. అనారోగ్యం బారినపడి చనిపోయాడు. ఓ వాహనంలో మృతదేహాన్ని తీసుకొచ్చి భరద్వాజ తీర్థంలో ఆలయం పక్కన ఖననం చేశారు. ఇక్కడ అవధూతగా ఉంటూ వచ్చిన కోట్లమ్మ శిష్యుడు అనిల్ అని, అందుకే ఆయన్ను ఇక్కడ ఖననం చేశామని ఖననం చేసిన వారు ప్రచారం చేశారు. అయితే మృతునికి భార్య, ఓ పాప కూడా ఉండడంతో అతడిని ఎలా అవధూతగా చెబుతారని కొందరు ప్రశ్నించినా సమాధానం కరువైంది. ఇది కాస్తా చర్చనీయాంశమై ఆలయ ఈఓ పెద్ది రాజు దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. మృతదేహాన్ని ఖననం చేస్తున్నట్లు ఉద్యోగుల దృష్టికి వచ్చినా అడ్డుకోకపోవడంపై ఆగ్రహించారు. దీనికి బాధ్యులను చేస్తూ భద్రతాధికారిగా ఉన్న ఏఈఓ శ్రీనివాసరెడ్డిని, భరద్వాజేశ్వరాలయం అర్చకుడు అనిల్‌కుమార్ స్వామిని సస్పెండ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్ సెక్యూరిటీ సూపర్వైజర్ శ్రీనివాసులు, సెక్యూరిటీ గార్డు శేఖర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యలకుగాను దేవదాయ కమిషనర్‌కు నివేదించారు. అలాగే, ఒకటవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదలా ఉంచితే, సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి భరద్వాజేశ్వరాలయ ప్రాంతంలోని సీసీ కెమెరాలు ఇప్పటివరకు పనిచేయకపోవడం..ఆ సమయంలోనే మృతదేహాన్ని ఖననం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
గిరిజన యువకుడిపై దాష్టీకం.. వైరల్
సాక్షి, శ్రీశైలం: చెంచు గిరిజన యువకుడిపై ఓ ప్రసిద్ధ దేవస్థానానికి చెందిన ఓ ఉన్నతాధికారి దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయ సీఎస్వోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ గిరిజన యువకుడు శ్రీశైలం దేవస్థానంలో అభిషేకం చెంబులు శుభ్రపరిచేవాడు. ఈ క్రమంలో బాధిత గిరిజన యువకుడు అక్కడ చిల్లర డబ్బులు ఏరుకున్నట్లు దేవస్థానం సీఎస్ఓ దృష్టికొచ్చింది. తీవ్ర ఆవేశంతో ఆ గిరిజన యువకుడిని బూతులు తిడుతూ సీఎస్ఓ చితకబాదారు. దేవస్థానం సీసీ కెమెరాల నిఘా విభాగం గదిలో గిరిజనుడిని కొట్టిన వ్యవహారం వీడియోలు లీక్ కావడంతో విషయం వెలుగు చూసింది. -
ఆలయ అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం
-
‘యాదాద్రి’పై ఐటీ నజర్!
- దేవస్థానంలో ‘పెద్ద’ నోట్లను మార్పిడి చేస్తున్నారని ఫిర్యాదులు - భక్తుల రూపంలో రహస్య విచారణ చేస్తున్న అధికారులు యాదగిరికొండ: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు దృష్టి పెట్టారు. దేవస్థానం అధికారులు రూ.500, రూ.1,000 నోట్లను పెద్ద ఎత్తున మార్పిడి చేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు.. కొందరు అధికారులు రంగంలోకి దిగినట్టు తెలిసింది. వారు భక్తుల రూపం తిరుగుతూ నగదు మార్పిడికి ఏ విధంగా జరుగుతోంది, సహకరిస్తున్న అధికారులెవరనే విషయాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రసాద విక్రయశాల, టికెట్ కౌంటర్లు సహా పలు సెక్షన్ల వద్ద నిఘా పెట్టి.. రూ.500, రూ.వెయ్యి నోట్లను చిల్ల రగా మార్చుకుని వెళ్తున్న వారిని గమనిస్తున్నారని తెలుస్తోంది. ఇక దేవస్థానంలో పనిచేస్తున్న కొందరు అధికారులు ఇటు ఉద్యోగం చేస్తూ, మరోవైపు వ్యాపారాలు చేస్తూ లక్షలు ఆర్జిస్తున్నారని, పన్నులు ఎగవేస్తున్నారనే సమాచారంపైనా అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. -
కాసుల కోసం కక్కుర్తి !
యాదాద్రిలో కాంట్రాక్టర్లతో దేవస్థానం అధికారుల కుమ్మక్కు రూపాయి అదనంగా టెండర్ వేసుకోమని సలహా దేవస్థానంపై ఏడాదికి రూ.1.50 లక్షల అదనపు భారం యాదగిరికొండ : ‘యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుకుందాం.. ఇందులో అందరూ కంకణబద్ధులు కావాలి. ఎలాంటి అక్రమాలకు తావివ్వొద్దు.’ ఇవీ.. సీఎం కేసీఆర్ నిత్యం చెబుతున్న మాటలు. వీటిని దేవస్థానం అధికారులు పట్టించుకున్నట్లు లేరు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆలయంపై అదనపు భారం పడే విధంగా వ్యవహరిస్తున్నారు. లడ్డూ తయారీ కాంట్రాక్ట్ వ్యవహారమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దేవస్థానం అధికారులు కాసుల కోసం కక్కుర్తి పడి లడ్డూ తయారీ కాంట్రాక్టర్లతో కుమ్మక్కయారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గతంలో ప్రతి సంవత్సరం కాంట్రాక్ట్ దారులు ఎంత తక్కువకు టెండరు వేస్తే దాన్ని దేవస్థానం అధికారులు ఖరారు చేసేవారు. ఈసారి ఇందుకు భిన్నంగా జరిగింది. గత సంవత్సరం కన్నా అదనంగా మరో రూపాయి ఎక్కువగా టెండర్ వేసుకోమని దేవస్థానం అధికారులే.. లడ్డూ తయారీదారులను పురమాయించారు. గతంలో పెద్ద లడ్డుకు (400 గ్రాములు) రూ.13.50.. చిన్న లడ్డుకు(100 గ్రాములు) రూ.14.50 ఉండగా.. పెంచిన రూపాయితో పెద్ద లడ్డుకు రూ.14.50, చిన్న లడ్డుకు రూ.15.50 చొప్పున కాంట్రాక్టర్‌కు దేవస్థానం చెల్లించాల్సి వస్తోంది. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం.. అధికారుల వత్తాసు యాదాద్రి పుణ్యక్షేత్రంలో లడ్డూ తయారీ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గత నెలలో లడ్డూ తయారీకి టెండర్లు నిర్వహించారు. అయితే భద్రాచలానికి చెందిన ఓ కాంట్రాక్టర్ కూడా తక్కువ ధరకే టెండర్ దాఖలు చేసినట్టు సమాచారం. దీంతో స్థానిక కాంట్రాక్టర్లు కుమ్మక్కై అతడిని బెదిరించి టెండర్ ఉపసంహరించుకునేలా చేసినట్లు వినికిడి. ఇందులో స్థానిక అధికారుల ప్రమేయం ఉన్నట్లు.. వారు స్థానిక కాంట్రాక్టర్లకు వత్తాసు పలికినట్టు ఆరోపణలు లేకపోలేదు. నిబంధనల ప్రకారం మళ్లీ టెండర్ నిర్వహించాల్సి ఉండగా.. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకుండా కాసుల కోసం కక్కుర్తి పడి గత ఏడాది కంటే రూపాయి అదనంగా కట్టబెట్టడం గమనార్హం. రాబడి నిల్ యాదాద్రి దేవస్థానం అభివృద్ధి పేరుతో ఈ ఏడాది కొండపైన ఉన్న వసతి గదులను తొలగించడం, ప్రధానాలయంలోకి భక్తులను అనుమతించకపోవడంతో ఆలయానికి ఆదాయ వనరులు భారీగానే తగ్గిపోయాయి. దీంతో అధికారుల, సిబ్బంది వేతనాలను చెల్లించడం కష్టతరంగా మారింది. ఈ తరుణంలో ఆలయంపై అదనపు భారం పడేలా అధికారులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు తూట్లు లడ్డూ తయారీదారులు కనీస నిబంధనలు కూడా పాటించడం లేదనే విమర్శలు లేకపోలేదు. గతంలో లడ్డూ తయారీదారులు ఇష్టారీతిన వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. లడ్డూలో వెంట్రుకలు ఇతరత్రా వస్తుండడంతో తయారీదారుల చేతులకు, నోటికి, తలకు గ్లౌసులు ధరించాలని నిబంధన పెట్టారు. ప్రస్తుతం ఆ నిబంధనలను తుంగలో తొక్కి ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా.. పతి షిఫ్టులోను పది మందితో లడ్డు ప్రసాదాలను తయారు చేయాలి. కానీ.. కాంట్రాక్టర్ పైసలకు కక్కుర్తి పడి ఉన్న పది మందినే ప్రతి షిఫ్టులోను చూపించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం దేవస్థానం అధికారులకు తెలిసినా.. పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్లు ఆమ్యమ్యాలు ముట్ట చెబుతుండడంతో దేవస్థానం అధికారులు చూసీచూడనట్లు వ్యవహ రిస్తున్నారని.. అందులో పని చేసే సిబ్బంది చెబుతున్నారు. ఒక్కోసారి రాత్రి పూట టెకెట్లు లేకుండా లడ్డు ప్రసాదాలను విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఆరోపణలు అవాస్తవం టెండర్ల నిర్వహణలో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని వస్తున్న ఆరోపణలో నిజం లేదు. నిబంధనల ప్రకారం టెండర్ తక్కువ వేసిన వారికే లడ్డూ ప్రసాదాల కాంట్రాక్ట్ అప్పగించాం. టెండర్లకు సంబంధించిన ప్రక్రియను కమిషనర్ ఆదేశాల మేరకే పూర్తి చేశాం. - గీతారెడ్డి, దేవస్థానం ఈఓ -
ముత్యాలమ్మ గుడిలో హుండీ చోరీ
యాదమరి(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా యాదమరి మండలం జంగాలపల్లిలో ఉన్న ముత్యాలమ్మగుడిలో మంగళవారం వేకువజామున దొంగలుపడి హుండీని ఎత్తుకెళ్లారు. హుండీలో 20 వేల రూపాయలు ఉంటాయని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. -
కల్యాణ వెంకన్నకు బంగారు హస్తాల కానుక
చంద్రగిరి:చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారికి బుధవారం సుమారు 6.5 లక్షల విలువైన బంగారు హస్తాలు కానుకగా అందాయి. కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు అలంకరించేందుకు పూనె రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త రవి బంగారు కఠి, వరద హస్తాలను తయారుచేయిస్తానని మొక్కుకున్నారు. ఆమేరకు చెన్నైలోని ఎన్.ఆంజనేయులు శెట్టి జ్యుయెలర్స్‌లో 220 గ్రాముల బంగారంతో హస్తాలను తయారు చేయించారు. బుధవారం ఆంజనేయులు శెట్టి జ్యువెలర్స్ నిర్వాహకులు శ్రీనివాసమంగాపురం చేరుకుని ఆలయంలో డెప్యూటీ ఈవో వెంకటయ్యకు బంగారు హస్తాలను అందజేశారు. వాటి విలువ సుమారు 6.5 లక్షల ఉంటుందని తెలిపారు. వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. -
అమ్మకానికి రాములోరి విగ్రహాలు..!
♦ జార్జియాకు ‘పంచలోహా’లు ♦ ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం ♦ నేడో, రేపో శ్రీరామా నిలయం అప్పగింత భద్రాచలం: ఏళ్లుగా శ్రీరామ ప్రచారరథంలో ఊరేగుతూ, భక్తుల పూజలందుకున్న సీతారామలక్ష్మణ సమేత పంచలోహ విగ్రహాలు యూఎస్ఏలోని జార్జియాకు తరలిపోనున్నాయి. ఈ విగ్రహాలను అక్కడ నిర్మిస్తున్న రామాలయానికి అమ్మేందుకు ఆలయ అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. చరిత్ర కలిగిన భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో గర్భగుడిలోని సీతారామలక్ష్మణ సమేతంగా ఉన్న మూలమూర్తులను పోలిన రెండు జతల పంచలోహ విగ్రహాలను గతంలో తయారు చేయించారు. అందులో ఒకదానిని శ్రీరామ ప్రచార రథంలో ఉంచగా, మరొకటి మొన్నటి వరకు ఈవో చాంబర్లో ఉండేది. రెండేళ్ల క్రితం చింతూరు మండలంలో జరిగిన ప్రమాదంలో శ్రీరామరథం పూర్తిగా ధ్వంసమైంది. కొత్త రథాన్ని తయారు చేయించకపోవడంతో అందులోని పంచలోహ విగ్రహాలను యాగశాలలో ఉంచారు. ప్రస్తుతం ఆ విగ్రహాలు రామాలయ ప్రాంగణంలోని గోశాల పక్కన ఉన్న ఆంజేయ స్వామి ఆలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు. కాగా, యూఎస్ఏలోని జార్జియాలో భద్రాద్రి ఆలయం ఆకృతిలోనే ‘ శ్రీ సీతారామ టెంపుల్ ఆఫ్ జార్జియా’ పేరిట ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి నుంచి వచ్చిన ప్రతినిధులు భద్రాచలం దేవస్థానంలో ఉన్న పంచలోహ విగ్రహాలను తమకు ఇవ్వాలని కోరారు. విగ్రహాలు ఇస్తే దేశవ్యాప్తంగా ఉన్న 108 ప్రధాన ఆలయాల్లో వాటి కి పూజలు చేయించి, తాము నిర్మించే రామాలయంలో ప్రతిష్ఠించుకుంటామని కోరారు. అందుకు ప్రతిగా వేరే విగ్రహాలు చేయించి అందజేస్తామని, తగిన పారితోషికం ఇస్తామని చెప్పారు. దీనిపై దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి ఇక్కడి వైదిక కమిటీ సలహా కోరారు. ఈ క్రమంలో విగ్రహాలను జార్జియాకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. ఒక్కొక్కటీ ప్రైవేటుపరం.. భద్రాచలం రామాలయానికి ఏటా రూ.25 కోట్ల మేర ఆదాయం సమకూరుతోంది. ఉత్సవాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకు ఇం దులో నుంచే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా ఆలయాభివృద్ధి జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక భారాన్ని సాకుగా చూపుతూ దేవస్థానానికి సంబంధించిన పలు నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. గతంలో భక్తరామదాసు జయంతోత్సవాలను ఐదు రోజులు కూడా ప్రైవేటు వ్యక్తులకే అప్పగించారు. తాజాగా దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న శ్రీరామనిలయం (60 గదులతో ఉన్న సత్రం)ను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు యోచిస్తున్నారు. ఇలాంటి చర్య లు నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలయాభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. వైదిక కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.. జార్జియా నుంచి ప్రతినిధులు పంచలోహ విగ్రహాలు కావాలని కోరారు. దీనిపై వైదిక కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. శ్రీరామనిలయం సత్రం నిర్వహణ భారంగా ఉంది. దాని ఆదాయ వ్యయాలపై లెక్కకట్టి ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నాం. -కూరాకుల జ్యోతి, ఆలయ ఈవో -
పెరగనున్న భద్రాద్రి ‘ప్రత్యేక’ టికెట్ ధర !
భద్రాచలం: ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ప్రత్యేక దర్శనం టికెట్ ధర పెంచేందుకు దేవస్థానం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రూ.20 ఉన్న ప్రత్యేక దర్శనం టికెట్ ధరను రూ.50 వరకు పెంచేందుకు నిర్ణయించారు. దీనిపై భక్తులు తమ అభిప్రాయూలు తెలపాలంటూ దేవస్థానం అధికారులు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. దీనిపై భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ రూ.20 టికెట్ తీసుకున్న వారు సుదర్శన ద్వారం నుంచి నేరుగా స్వామివారిని దర్శించుకుని గర్భగుడి నుంచి బయటకు వస్తున్నారు. రూ.150 అర్చన టికెట్ తీసుకున్న భక్తులను మాత్రం గర్భగుడిలోని స్వామి వారి మూలవరుల వరకూ పంపిస్తున్నారు. శని, ఆదివారాల్లోనూ, అదే విధంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యేక దర్శనం పేరుతో రూ.20 కు బదులుగా రూ.100 టికెట్‌ను విక్రరుుస్తున్నారు. ఒక దర్శనం కోసం ఇలా వేర్వేరు టికెట్ల పేరుతో ఎక్కువ వసూలు చేయడంపై కూడా భక్తులు మండిపడుతున్నారు. దీంతో ప్రత్యేక దర్శనం టికెట్‌ను ఇక నుంచి రూ.50కు పెంచి, రద్దీ రోజుల్లో కూడా దీనినే విక్రయించేలా దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 20న జారీచేసిన ప్రకటనపై 15 రోజులలోపు భక్తులు తమ అభ్యంతరాలు, సూచనలు, సలహాలు అందజేయాలని పేర్కొన్నారు. కానీ ఈ విషయంపై దేవస్థానం అధికారులు తగిన రీతిలో ప్రచారం చేయకపోవడం సరైంది కాదని భక్తులు వాపోతున్నారు. -
దేవస్థానమా..మున్సిపాలిటీనా ?
- శ్రీకాళహస్తి గుడిని సందర్శించిన దేవాదాయశాఖ కమిషనర్ - శుభ్రత పాటించలేదనిఅధికారులపై ఆగ్రహం - ఆలయ ఉద్యోగులు పీఆర్వో కార్యాలయంలో ఏంచేస్తారని నిలదీత - గోపురబాధితుల భయంతో బిక్షాలగోపురాన్ని పరిశీలించని వైనం శ్రీకాళహస్తి ఆలయంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని దేవాదాయ శాఖ కమిషనర్ అధికారులపై మండిపడ్డారు. దేవస్థానమా.. మున్సిపాలిటీనా అని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి: ‘శ్రీకాళహస్తి దేవస్థానం ఏడాదికి వందకోట్లకు పైగా ఆదాయం వస్తున్న ఆలయాల జాబితాల్లో ఉంది.. అయినా శుభ్రత పాటించడంలేదు.. దేవస్థానమా..మున్సిపాలిటీనా’ అంటూ దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ ఆలయాధికారులపై మండిపడ్డారు. సోమవారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ఆమె ఆలయాన్ని పరిశీలించారు. దేవస్థానంలో తడి ప్రదేశం ఉండకూడదని.. అయినా పలుచోట్ల నీటి తడి ఎందుకు ఉందని ప్రశ్నించారు. పారిశుద్ధ్యం కోసం లక్షలు ఖర్చుచేస్తున్నట్లు రికార్డులు చూపుతున్నారు... శుభ్రత మాటేంటి ? అని ప్రశ్నించారు. దేవస్థానంలో ప్రధానంగా క్యూ పద్ధతి పాటించడంలేదని పలువురు ఫిర్యాదు చేశారని, క్యూ పద్ధతిని కచ్చితంగా పాటించాలని ఈవో రామిరెడ్డిని హెచ్చరించారు. ఇప్పుడున్న రెండు క్యూలుకాకుండా మరొకటి ఏర్పాటు చేయాలని సూచించారు. పీఆర్వో కార్యాలయంలో ఎవరి కోసం ఏడుగురిని నియమించారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవస్థానం లోపల భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలు వేగవంతంగా ముందుకు సాగేలా చూడడానికి సిబ్బంది అవసరమని, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను ఏడుగురిని ఇక్కడ నియమించడం సరికాదని చెప్పారు. పీఆర్వో కార్యాలయంలో గుంపులు గుంపులుగా కూర్చొని కాలక్షేపం చేయడం తగదని మందలించారు. ఈవో రూ.1500 రాహుకేతు పూజలను ఆలయం లోపల నుంచి బయటకు మార్పుచేస్తున్నట్లు తెలిపారు. ఆమె ఆ మండపాన్ని, అన్నదాన మండపాన్ని పరిశీలించారు. ఆమె చివరగా బిక్షాలగోపురాన్ని పరిశీలించడానికి వెళ్లారు. అయితే అదే ప్రాంతంలో గాలిగోపురం బాధితులు తమకు న్యాయం చేయాలంటూ నిలదీయాలని వేచి ఉండటంతో ఆమె కారులో నుంచే బిక్షాలగోపురాన్ని చూస్తూ వెళ్లిపోయారు. -
శ్రీవారి సేవలో శృతిహాసన్
సాక్షి, తిరుమల: సినీ నటి శృతిహాసన్ శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్‌తో కలసి ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. శృతిహాసన్‌ను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. -
కోనేరులో పడి లాయర్ మృతి
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కోనేట్లో పడి ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే న్యాయవాది చెంచుముని (46) గురువారం ఉదయం వైష్ణవి కోనేరుకి ఎప్పటిలాగే స్నానానికి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ ఆయన కోనేట్లో పడి మృతి చెందారు. కాగా ఇప్పటివరకూ ఆ కోనేరులో పడి 16మంతి మృతి చెందారని, అయినా దేవస్థానం అధికారులు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదని మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చెంచుముని మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. (కాళహస్తి నుంచి: సాక్షి టీవీ రిపోర్టర్ శంకర్ రెడ్డి) -
అప్పనంగా భూమి కొట్టేద్దామని...
రూ.6కోట్ల విలువైన భూమి కబ్జాకు టీడీపీ నేత యత్నం అడ్డుకునేందుకు అధికారుల ప్రయత్నం ఆ భూమిజోలికి రావద్దని ప్రభుత్వ పెద్ద ఆదేశం తమవాడేనని మరో {పముఖుడి వత్తాసు ‘ఎన్.జి.జి.ఓస్ కాలనీలో దేవస్థానం భూమి అని చెప్పి ప్రహరీ కడుతున్నారట కదా! అలాంటి పనులు చేయొద్దు. ఆ భూమిని చదును చేస్తోంది మా వాడే. ఎన్నికల్లో నా కోసం పని చేశాడు. ఆ భూమి సంగతి అతను చూసుకుంటాడు. మీరు ప్రహారీ నిర్మాణం ఆపేయండి. - ఇదీ జిల్లాలోని ప్రభుత్వ పెద్ద ఫోన్ ద్వారా సింహాచలం దేవస్థానం అధికారులకు జారీ చేసిన ఆదేశం. ‘ఆ భూమి దేవస్థానానికి కాదు. మా వాడిదే. నాకు కావా ల్సిన మనిషి. వెంటనే ఆ భూమిలో పనులు నిలిపివేయండి. అంతగా అవసరమైతే సీఎం ఆఫీసు నుంచే చెప్పిస్తా’ - ఇదీ మాజీ ప్రజాప్రతినిధి కూడా అయిన విశాఖ ప్రముఖుడు దేవస్థానం అధికారులకు చెప్పిన మాట. -సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం అయ్యగార్లు ఆదేశిస్తే ఇంకేముందీ!... దేవస్థానం అధికారులు తమ భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపివేసి మౌనంగా చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఇంత హడావుడిగా కీలక నేతలు జోక్యం చేసుకుని మరీ కబ్జాకు కాపు కాసిన ఆ భూబాగోతం వివరాలివి..38వ వార్డు పరిధిలో ఎన్.జి.జి.ఓస్కాలనీ పట్టాభిరెడ్డి గార్డెన్స్‌లో సర్వే నంబర్లు 13, 14లతో సింహాచలం దేవస్థానానికి చెందిన దాదాపు 3 ఎకరాలు ఉన్నాయి. అభయ వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఎదురుగా కొండను ఆనుకుని ఉన్న ఆ భూమి సింహాచలం దేవస్థానానిది. మార్కెట్ ధర ప్రకారం ఆ భూమి విలువ రూ.6కోట్లపై మాటే. ఆ భూమిపై అదే కాలనీలో నివసించే అధికార పార్టీ ఛోటా నేత కన్ను పడింది. ఆ భూమిని కబ్జా చేసేందుకు ఆయన ఓ ఎత్తుగడ వేశారు. అభయ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి కోనేరు, గోశాల నిర్మాణం ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఆ కోనేరు కోసమని చెప్పి ఆ భూమిని చదును చేయడం ప్రారంభించారు. కొంత కొంత చొప్పున మొత్తం భూమిని చదును చేసి కలిపేసుకోవాలన్నది ఆయన వ్యూహం. అప్పటికే దాదాపు వెయ్యి గజాల వరకు చదును చేసేశారు. సంబంధం లేదన్న ఆలయ కమిటీ ఆలయం పేరుతో సాగుతున్న ఈ భూ కబ్జా యత్నాన్ని ఆభయ వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ త్వరలోనే గుర్తించింది. ఆ ఆలయ గోశాల కోసం ఇప్పటికే స్థలం ఉంది. కోనేరు నిర్మాణం కోసం ఇటీవల దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాల రావుకు కమిటీ సభ్యులు విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆలయం పేరిట ఓ ప్రైవేటు వ్యక్తి సింహాచల దేవస్థానం భూమిని కబ్జా చేస్తుండటంతో కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సింహాచలం దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రక్షణ గోడ నిర్మాణం చేపట్టిన అధికారులు ఈ భూ కబ్జా వ్యవహారం తెలియడంతో సింహాచల దేవస్థానం అధికారులు తక్షణం స్పందించారు. దేవస్థానానికి చెందిన 3 ఎకరాలను పరిరక్షించేందుకు ఆ భూమి చుట్టూ రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. ఆ గోడల మీద ఆ భూమి దేవస్థానానికి చెందినదని రాయించారు కూడా. కానీ అంతలోనే... మా వాడే... పనులు నిలిపిపేయండి: కీలక నేత ఆదేశం తాను కలిపేసుకోవాలనుకున్న భూమి చూట్టు దేవస్థానం అధికారులు రక్షణ గోడ నిర్మించడం అధికార పార్టీ నేత ఏమాత్రం సంహించలేకపోయారు. దాంతో ఆయన హుటాహుటిన ప్రభుత్వంలో కీలక పెద్దగా ఉన్న తన నియోజకవర్గ ప్రతినిధిగా వద్దకు వెళ్లారు. దాంతో ఆ కీలక నేత సింహాచల దేవస్థానం అధికారులకు ఫోన్ చేశారు. ఆ భూమి చదును చేస్తోంది తన మనిషేనని చెప్పారు. ఎన్నికల్లో తన కోసం ఎంతగానో పనిచేసిన ఆయనకు తాను సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి ఆ భూమి చుట్టూ రక్షణ గోడ నిర్మాణాన్ని నిలిపివేయలని ఆదేశించారు. అవసరమైతే తాను హైదరాబాద్‌లోని దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడతానని చెప్పారు. అంతలోనే దేవస్థానం అధికారులకు నగరానికి చెందిన ఓ ప్రముఖుడి నుంచి కూడా ఫోన్ కాల్ వచ్చింది. మాజీ ప్రజాప్రతినిధి కూడా అయిన ఆ ప్రముఖుడు అసలు విషయాన్ని సూటిగా చెప్పేశారు. ‘ఆయన మా సామాజికవర్గానికి చెందినవాడు. గతంలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు నా కోసం పని చేశాడు. ఇప్పుడు ఆ స్థలాన్ని చదునుచేసుకుంటుంటే మీరు అడ్డుకోవడం ఏమిటి? ఆ స్థలం ఆయనది అంటున్నాడు. మీరు ప్రహారి నిర్మాణం నిలిపివేయండి. మీరు మాట వినకుంటే నేను సీఎం ఆఫీసు నుంచి ఫోన్ చేయించాల్సి ఉంటుంది’అని హకుం జారీ చేశారు. చేసేదేమీ లేక దేవస్థానం అధికారులు భూమి రక్షణ గోడ నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేశారు. ఆలయ భూమిని కాపాడటానికి తాము యత్నిస్తే ఏకంగా ప్రభుత్వ పెద్దలు, నగర ప్రముఖులు అడ్డుపడటంపై దేవస్థానం అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సర్వేకు ఆదేశించాం: ఈవో ఈ భూ వ్యవహారంపై సింహాచలం దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌ను ‘సాక్షి ’ సంప్రదించగా ఆ భూమి దేవస్థానానిదేనని చెప్పారు. కొందరి అభ్యంతరాల వల్ల అందులో ప్రహారి నిర్మాణాన్ని నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ భూమి మీద ఏడీ సర్వేకు ఆదేశించామని తెలిపారు. -
దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో కోత
* తగ్గనున్న 20 గ్రాములు * ఈనెల 18 నుంచి అమలు సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 18వ తేదీ నుంచి లడ్డూ సైజు తగ్గించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం భక్తులకు 100 గ్రాముల లడ్డూ రూ. 10కి విక్రయిస్తుండగా, ఇక నుంచి అదే రేటుకు 80 గ్రాముల లడ్డూను ఇస్తామని ఈవో సీహెచ్ నర్సింగరావు ‘సాక్షి’కి చెప్పారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకే లడ్డూ సైజు తగ్గిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒక లడ్డూ తయారు చేయడానికి దేవస్థానానికి రూ. 11.40 ఖర్చు అవుతుండగా భక్తులకు రూ.10కే విక్రయిస్తున్నారు. ఒక్కొక్క లడ్డూపైన రూపాయి 40 పైసలను దేవస్థానం భరించాల్సి వస్తోంది. అందువల్ల లడ్డూ సైజును 80 గ్రాములు చేస్తే భక్తులు చెల్లించే రూ.10లకు సరిపోతుంది. దీనివల్ల దేవస్థానానికి లాభం కాని, నష్టం కాని ఉండదు. సాధారణ రోజుల్లో రోజుకు 45 వేల నుంచి 50 వేల లడ్డూలు, శుక్ర, ఆదివారాల్లో 60 వేల నుంచి 75 వేల లడ్డూలు దేవస్థానం విక్రయిస్తోంది. భవానీ దీక్షలు, దసరా ఉత్సవాల్లో రోజుకు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు విక్రయాలు జరుగుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల లడ్డూ తయారీ ఖరీదు పెరిగిపోయింది. ఇప్పటి వరకు సైజు తగ్గించకుండా దేవస్థానమే నష్టాన్ని భరిస్తూ వస్తోంది. ఇదే విషయాన్ని దేవస్థానం అధికారులు కమిషనర్ అనూరాధకు తెలియపరచడంతో లడ్డూ సైజు తగ్గించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లడ్డూ నాణ్యత పెంచాలి ఈవో నర్సింగరావు వచ్చిన తరువాత పులిహోర నాణ్యత కొంతమేర మెరుగుపడింది. ఆయన లడ్డూపై దృష్టి సారించి నాణ్యత పెంచాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దేవస్థానం పాలకమండలి అధికారంలో ఉన్న రోజుల్లో లడ్డూ ప్రసాదాలపై పూర్తిస్థాయి దృష్టిసారించి వాటి నాణ్యతను పెంచారు. ఆ తరువాత కిందిస్థాయి అధికారులు చేతివాటం ప్రదర్శించడంతో నాణ్యత తగ్గిపోయింది. ఇప్పుడు సైజు కూడా తగ్గిస్తుండటంతో భక్తులు పెదవి విరుస్తున్నారు. నష్టం వస్తోందని సైజు తగ్గించినా కనీసం నాణ్యతైనా పెంచాలని కోరుతున్నారు.