అమ్మకానికి రాములోరి విగ్రహాలు..!
♦ జార్జియాకు ‘పంచలోహా’లు
♦ ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం
♦ నేడో, రేపో శ్రీరామా నిలయం అప్పగింత
భద్రాచలం: ఏళ్లుగా శ్రీరామ ప్రచారరథంలో ఊరేగుతూ, భక్తుల పూజలందుకున్న సీతారామలక్ష్మణ సమేత పంచలోహ విగ్రహాలు యూఎస్‌ఏలోని జార్జియాకు తరలిపోనున్నాయి. ఈ విగ్రహాలను అక్కడ నిర్మిస్తున్న రామాలయానికి అమ్మేందుకు ఆలయ అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. చరిత్ర కలిగిన భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో గర్భగుడిలోని సీతారామలక్ష్మణ సమేతంగా ఉన్న మూలమూర్తులను పోలిన రెండు జతల పంచలోహ విగ్రహాలను గతంలో తయారు చేయించారు. అందులో ఒకదానిని శ్రీరామ ప్రచార రథంలో ఉంచగా, మరొకటి మొన్నటి వరకు ఈవో చాంబర్‌లో ఉండేది.
రెండేళ్ల క్రితం చింతూరు మండలంలో జరిగిన ప్రమాదంలో శ్రీరామరథం పూర్తిగా ధ్వంసమైంది. కొత్త రథాన్ని తయారు చేయించకపోవడంతో అందులోని పంచలోహ విగ్రహాలను యాగశాలలో ఉంచారు. ప్రస్తుతం ఆ విగ్రహాలు రామాలయ ప్రాంగణంలోని గోశాల పక్కన ఉన్న ఆంజేయ స్వామి ఆలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు. కాగా, యూఎస్‌ఏలోని జార్జియాలో భద్రాద్రి ఆలయం ఆకృతిలోనే ‘ శ్రీ సీతారామ టెంపుల్ ఆఫ్ జార్జియా’ పేరిట ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి నుంచి వచ్చిన ప్రతినిధులు భద్రాచలం దేవస్థానంలో ఉన్న పంచలోహ విగ్రహాలను తమకు ఇవ్వాలని కోరారు. విగ్రహాలు ఇస్తే దేశవ్యాప్తంగా ఉన్న 108 ప్రధాన ఆలయాల్లో వాటి కి పూజలు చేయించి, తాము నిర్మించే రామాలయంలో ప్రతిష్ఠించుకుంటామని కోరారు. అందుకు ప్రతిగా వేరే విగ్రహాలు చేయించి అందజేస్తామని, తగిన పారితోషికం ఇస్తామని చెప్పారు. దీనిపై దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి ఇక్కడి వైదిక కమిటీ సలహా కోరారు. ఈ క్రమంలో విగ్రహాలను జార్జియాకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది.
ఒక్కొక్కటీ ప్రైవేటుపరం..
భద్రాచలం రామాలయానికి ఏటా రూ.25 కోట్ల మేర ఆదాయం సమకూరుతోంది. ఉత్సవాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకు ఇం దులో నుంచే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా ఆలయాభివృద్ధి జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక భారాన్ని సాకుగా చూపుతూ దేవస్థానానికి సంబంధించిన పలు నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. గతంలో భక్తరామదాసు జయంతోత్సవాలను ఐదు రోజులు కూడా ప్రైవేటు వ్యక్తులకే అప్పగించారు. తాజాగా దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న శ్రీరామనిలయం (60 గదులతో ఉన్న సత్రం)ను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు యోచిస్తున్నారు. ఇలాంటి చర్య లు నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలయాభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
వైదిక కమిటీ నిర్ణయం తీసుకుంటుంది..
జార్జియా నుంచి ప్రతినిధులు పంచలోహ విగ్రహాలు కావాలని కోరారు. దీనిపై వైదిక కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. శ్రీరామనిలయం సత్రం నిర్వహణ భారంగా ఉంది. దాని ఆదాయ వ్యయాలపై లెక్కకట్టి ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నాం.
-కూరాకుల జ్యోతి, ఆలయ ఈవో