అప్పనంగా భూమి కొట్టేద్దామని...
రూ.6కోట్ల విలువైన భూమి కబ్జాకు టీడీపీ నేత యత్నం
అడ్డుకునేందుకు అధికారుల ప్రయత్నం
ఆ భూమిజోలికి రావద్దని ప్రభుత్వ పెద్ద ఆదేశం
తమవాడేనని మరో {పముఖుడి వత్తాసు
‘ఎన్.జి.జి.ఓస్ కాలనీలో దేవస్థానం భూమి అని చెప్పి ప్రహరీ కడుతున్నారట కదా! అలాంటి పనులు చేయొద్దు. ఆ భూమిని చదును చేస్తోంది మా వాడే. ఎన్నికల్లో నా కోసం పని చేశాడు. ఆ భూమి సంగతి అతను చూసుకుంటాడు. మీరు ప్రహారీ నిర్మాణం ఆపేయండి.
- ఇదీ జిల్లాలోని ప్రభుత్వ పెద్ద ఫోన్ ద్వారా సింహాచలం దేవస్థానం అధికారులకు జారీ చేసిన ఆదేశం.
‘ఆ భూమి దేవస్థానానికి కాదు. మా వాడిదే. నాకు కావా ల్సిన మనిషి. వెంటనే ఆ భూమిలో పనులు నిలిపివేయండి. అంతగా అవసరమైతే సీఎం ఆఫీసు నుంచే చెప్పిస్తా’ - ఇదీ మాజీ ప్రజాప్రతినిధి కూడా అయిన విశాఖ ప్రముఖుడు దేవస్థానం అధికారులకు చెప్పిన మాట. -సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
అయ్యగార్లు ఆదేశిస్తే ఇంకేముందీ!... దేవస్థానం అధికారులు తమ భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపివేసి మౌనంగా చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఇంత హడావుడిగా కీలక నేతలు జోక్యం చేసుకుని మరీ కబ్జాకు కాపు కాసిన ఆ భూబాగోతం వివరాలివి..38వ వార్డు పరిధిలో ఎన్.జి.జి.ఓస్‌కాలనీ పట్టాభిరెడ్డి గార్డెన్స్‌లో సర్వే నంబర్లు 13, 14లతో సింహాచలం దేవస్థానానికి చెందిన దాదాపు 3 ఎకరాలు ఉన్నాయి. అభయ వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఎదురుగా కొండను ఆనుకుని ఉన్న ఆ భూమి సింహాచలం దేవస్థానానిది. మార్కెట్ ధర ప్రకారం ఆ భూమి విలువ రూ.6కోట్లపై మాటే. ఆ భూమిపై అదే కాలనీలో నివసించే అధికార పార్టీ ఛోటా నేత కన్ను పడింది. ఆ భూమిని కబ్జా చేసేందుకు ఆయన ఓ ఎత్తుగడ వేశారు. అభయ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి కోనేరు, గోశాల నిర్మాణం ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఆ కోనేరు కోసమని చెప్పి ఆ భూమిని చదును చేయడం ప్రారంభించారు. కొంత కొంత చొప్పున మొత్తం భూమిని చదును చేసి కలిపేసుకోవాలన్నది ఆయన వ్యూహం. అప్పటికే దాదాపు వెయ్యి గజాల వరకు చదును చేసేశారు.
సంబంధం లేదన్న ఆలయ కమిటీ
ఆలయం పేరుతో సాగుతున్న ఈ భూ కబ్జా యత్నాన్ని ఆభయ వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ త్వరలోనే గుర్తించింది. ఆ ఆలయ గోశాల కోసం ఇప్పటికే స్థలం ఉంది. కోనేరు నిర్మాణం కోసం ఇటీవల దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాల రావుకు కమిటీ సభ్యులు విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆలయం పేరిట ఓ ప్రైవేటు వ్యక్తి సింహాచల దేవస్థానం భూమిని కబ్జా చేస్తుండటంతో కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సింహాచలం దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
రక్షణ గోడ నిర్మాణం చేపట్టిన అధికారులు
ఈ భూ కబ్జా వ్యవహారం తెలియడంతో సింహాచల దేవస్థానం అధికారులు తక్షణం స్పందించారు. దేవస్థానానికి చెందిన 3 ఎకరాలను పరిరక్షించేందుకు ఆ భూమి చుట్టూ రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. ఆ గోడల మీద ఆ భూమి దేవస్థానానికి చెందినదని రాయించారు కూడా. కానీ అంతలోనే...
మా వాడే... పనులు నిలిపిపేయండి: కీలక నేత ఆదేశం
తాను కలిపేసుకోవాలనుకున్న భూమి చూట్టు దేవస్థానం అధికారులు రక్షణ గోడ నిర్మించడం అధికార పార్టీ నేత ఏమాత్రం సంహించలేకపోయారు. దాంతో ఆయన హుటాహుటిన ప్రభుత్వంలో కీలక పెద్దగా ఉన్న తన నియోజకవర్గ ప్రతినిధిగా వద్దకు వెళ్లారు. దాంతో ఆ కీలక నేత సింహాచల దేవస్థానం అధికారులకు ఫోన్ చేశారు. ఆ భూమి చదును చేస్తోంది తన మనిషేనని చెప్పారు. ఎన్నికల్లో తన కోసం ఎంతగానో పనిచేసిన ఆయనకు తాను సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి ఆ భూమి చుట్టూ రక్షణ గోడ నిర్మాణాన్ని నిలిపివేయలని ఆదేశించారు. అవసరమైతే తాను హైదరాబాద్‌లోని దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడతానని చెప్పారు. అంతలోనే దేవస్థానం అధికారులకు నగరానికి చెందిన ఓ ప్రముఖుడి నుంచి కూడా ఫోన్ కాల్ వచ్చింది. మాజీ ప్రజాప్రతినిధి కూడా అయిన ఆ ప్రముఖుడు అసలు విషయాన్ని సూటిగా చెప్పేశారు. ‘ఆయన మా సామాజికవర్గానికి చెందినవాడు. గతంలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు నా కోసం పని చేశాడు. ఇప్పుడు ఆ స్థలాన్ని చదునుచేసుకుంటుంటే మీరు అడ్డుకోవడం ఏమిటి? ఆ స్థలం ఆయనది అంటున్నాడు. మీరు ప్రహారి నిర్మాణం నిలిపివేయండి. మీరు మాట వినకుంటే నేను సీఎం ఆఫీసు నుంచి ఫోన్ చేయించాల్సి ఉంటుంది’అని హకుం జారీ చేశారు. చేసేదేమీ లేక దేవస్థానం అధికారులు భూమి రక్షణ గోడ నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేశారు. ఆలయ భూమిని కాపాడటానికి తాము యత్నిస్తే ఏకంగా ప్రభుత్వ పెద్దలు, నగర ప్రముఖులు అడ్డుపడటంపై దేవస్థానం అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సర్వేకు ఆదేశించాం: ఈవో
ఈ భూ వ్యవహారంపై సింహాచలం దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌ను ‘సాక్షి ’ సంప్రదించగా ఆ భూమి దేవస్థానానిదేనని చెప్పారు. కొందరి అభ్యంతరాల వల్ల అందులో ప్రహారి నిర్మాణాన్ని నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ భూమి మీద ఏడీ సర్వేకు ఆదేశించామని తెలిపారు.