
ఆస్ట్రేలియా వర్సిటీల నిషేధం
విద్యార్థి వీసాల ముసుగులో అక్రమ వలసల నిరోధానికి చర్యలు
హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ విద్యార్థులపై కఠిన ఆంక్షలు
వీసాల మంజూరుకు పొదుపు మొత్తం పెంపు
చట్టబద్ధమైన దరఖాస్తుదారుల భవితవ్యంపై తీవ్ర ప్రభావం
ట్రంప్ ఎఫెక్ట్‌తో ప్రత్యామ్నాయానికై చూస్తున్న విద్యార్థులకు శరాఘాతం
విద్యార్థి వీసాల ముసుగులో అక్రమ వలసల నిరోధానికి ఆస్ట్రేలియా చేపట్టిన చర్యలు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆస్ట్రేలియాలోని అనేక యూనివర్సిటీలు భారత విద్యార్థుల నమోదును నిషేధించాయి. ముఖ్యంగా హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంపై కఠిన నిబంధనలు, పరిమితులు విధించాయి.
ఈ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు నకిలీ ధ్రువీకరణ పత్రాలతో వీసాలు పొందుతూ వలస విధానాలకు తూట్లు పొడుస్తున్నారని వర్సిటీలు గుర్తించాయి. నియంత్రణ లేని ఏజెంట్లు, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు, కొందరు ఆపరేటర్లు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని సమాచారం. ఫలితంగా విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రభావం మొత్తం భారతదేశ విద్యార్థులపై పడే ప్రమాదం నెలకొంది. – సాక్షి, అమరావతి
ప్రతి నాలుగు దరఖాస్తుల్లో ఒకటి నకిలీ..
భారత్ నుంచి వచ్చే ప్రతి నాలుగు విద్యార్థి వీసా దరఖాస్తుల్లో ఒకటి నకిలీదిగా ఆస్ట్రేలియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ధ్రువీకరించింది. భారత్ నుంచి వచ్చే మొత్తం దరఖాస్తుల్లో దాదాపు 24.3 శాతం మోసపూరితమైనవని చెబుతోంది. అంతర్జాతీయ వర్సిటీలకు అతిపెద్ద విద్యార్థి వనరుగా భారత్ ఉంది. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియా వర్సిటీల తాజా నిషేధంతో చట్టబద్ధమైన దరఖాస్తుదారుల భవితవ్యం గందరగోళంలో పడుతోంది.
ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించకుంటే ద్వైపాక్షిక విద్యా సంబంధాలు ప్రభావితమవుతాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ విద్యార్థుల వీసాలకు సంబంధించి కఠినమైన నిబంధనలను అమలు చేసిన తర్వాత ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న భారత విద్యార్థులకు ఆస్ట్రేలియా వర్సిటీల నిర్ణయం శరాఘాతమేనని నిపుణులు చెబుతున్నారు.
వలసలను తగ్గించేందుకు..
గత ఏడాది రికార్డు స్థాయిలో వలసలను నియంత్రించే యత్నంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం వర్సిటీలను హెచ్చరించింది. విద్యార్థి వీసా మంజూరుకు పొదుపు డిపాజిట్ మొత్తాన్నీ పెంచింది. గత ఏడాది మే 10 నుంచి విద్యార్థి వీసా మంజూరుకు కనీసం రూ.16.30 లక్షలు (29,710 ఆస్ట్రేలియన్ డాలర్ల) బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్టు ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. అంతకుముందు 2023 అక్టోబర్‌లో పొదుపు మొత్తాన్ని రూ.11.46 లక్షల నుంచి రూ.13.35 లక్షలు (21,041 ఆస్ట్రేలియన్ డాలర్ల నుంచి 24,505 ఆస్ట్రేలియన్ డాలర్లకు)కు పెంచింది.