
బిహార్ గయా జిల్లాలో పట్వాటోలి గ్రామాన్ని ‘ఐ.ఐ.టి. విలేజ్’ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఐ.ఐ.టి ర్యాంకులు సాధించివారు విపరీతంగా ఉంటారు. ఐ.ఐ.టి 2025 రిజల్ట్స్‌లో ఏకంగా 40 మంది స్టూడెంట్స్ ర్యాంకులు తెస్తే వీరిలో అమ్మాయిలే అధికం. నేతవాళ్లు ఎక్కువగా ఉండే ఈ ఊరి నుంచి ఇంటికొక ఇంజనీర్ ఉండటం విశేషం. ఇదెలా జరిగింది?
ఎవరో ఒకరిద్దరు తలుచుకుంటే ఏ మార్పూ రాదని కొందరు అనుకుంటారు. కాని ఒక మనిషి తలుచుకున్నా మార్పు వస్తుంది. వచ్చింది.
1991.
బిహార్‌లోని గయ జిల్లాలోని పట్వాటోలి అనే చిన్న గ్రామంలో జితేంద్ర పట్వా అనే అబ్బాయికి ఐ.ఐ.టి.లో ర్యాంక్ వచ్చింది. ఆ ఊరి నుంచి ఎవరికైనా అలాంటి ర్యాంక్ రావడం ఇదే ప్రథమం. ఊరంతా సంతోషించింది. ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడు. స్థిరపడ్డాడు. కాని ఊరికే ఉండలేదు. ఊరికి ఏదైనా చేయాలనుకున్నాడు.
దేనికంటే ఆ ఊరు అప్పటికే తన ప్రాభవం కోల్పోయింది.
పట్వాటోలిని ఒకప్పుడు అందరూ ‘మాంచెస్టర్ ఆఫ్ బిహార్’ అని పిలిచేవారు. ఆ ఊర్లో అందరూ నేతపని వారే. నేత వస్త్రాలకు మంచి గిరాకీ ఉన్న రోజుల్లో ఆ ఊరు ఒక వెలుగు వెలిగింది. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పులు వారిని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంచేశాయి. ఈ నేపథ్యంలో పిల్లలను మంచి చదువులవైపు మళ్లిస్తే ఊరి భవిష్యత్తు మారుతుందని భావించాడు జితేంద్ర పట్వా.
2013లో అతడు ఊరికి వచ్చి ‘వృక్ష సంస్థాన్’ పేరుతో ఒక ఎన్.జి.ఓ మొదలెట్టాడు. పేద నేతగాళ్ల పిల్లలకు, దిగువ మధ్యతరగతి ఇతర వర్గాల పిల్లలకు ఉచితంగా ఐ.ఐ.టి కోచింగ్ ఇవ్వడమే ఆ సంస్థ లక్ష్యం. ఒకప్పుడు ఆ ఊరిలో టెన్త్ తర్వాత చదువు మానేసేవారు. ఇప్పుడు టెన్త్ సమయం నుంచే ఐ.ఐ.టి. కోచింగ్ మొదలెడుతున్నారు.
అయితే ఇది ఆషామాషీగా జరగడం లేదు. విద్యార్థుల కోసం ఈ ఊరితో పాటు చుట్టుపక్కల కొన్ని లైబ్రరీలు స్థాపించారు. అవన్నీ ఐ.ఐ.టి. చదవడానికి అవసరమయ్యే పుస్తకాలతో నిండి ఉంటాయి. వాటిని ఏ పద్ధతిలో చదువుకుంటూ వెళ్లాలో గైడ్ చేస్తారు. అలాగే ఐ.ఐ.టి. చదివి ముంబై, ఢిల్లీలో స్థిరపడ్డ జితేంద్ర మిత్రులు ఇక్కడికొచ్చి క్లాసులు చెబుతారు. కొత్తల్లో వీరు క్లాసులు చెప్పినా ఇప్పుడు ఇక్కడ నుంచి ఐ.ఐ.టి.కి వెళ్లినవాళ్లు క్లాసులు చెబుతున్నారు.
అంటే ఈ ఫ్రీ కోచింగ్ ఎన్నాళ్లైనా కొనసాగే విధంగా ఇక్కడి విద్యార్థులే నిష్ణాతులయ్యారన్న మాట. వస్త్రాలు నేసి రెక్కాడితే డొక్కాడని స్థితిలో ఉన్న ఈ ఊరిలో జె.ఇ.ఇ.– 2025 రిజల్ట్స్‌లో 40 మంది ర్యాంకులు సాధించారు. వీరిలో శరణ్య అనే అమ్మాయి టాపర్‌గా నిలిచి 99.64 పర్సంటేజ్ సాధించింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని పల్లెల నుంచి కూడా ఎందరో ఐ.ఐ.టి. సాధించారు. వారు ఇలాంటి అడుగు వేస్తే ప్రతి పల్లెటూరి నుంచి చదువు మీద ఆసక్తి ఉన్న విద్యార్థులు గొప్ప చదువులకు వెళతారు. గ్రామాల దశను మారుస్తారు.