నేపాల్‌ పరిణామాలకు బాధ్యులెవరు? | Restoration of Monarchy in Nepal check deets inside | Sakshi
Sakshi News home page

నేపాల్‌ పరిణామాలకు బాధ్యులెవరు?

Published Fri, Apr 18 2025 10:28 AM | Last Updated on Fri, Apr 18 2025 10:28 AM

Restoration of Monarchy in Nepal check deets inside

మహారాజు జ్ఞానేంద్రకు మద్దతుగా నేపాల్లో ఏదో ఒక ప్రాంతంలోఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. ఇవి నేపాల్‌లో ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మార్చ్‌ 28వ తేదీన ఇవి ఘర్షణ స్థాయికి చేరి ఇద్దరు వ్యక్తులు మరణించగా అనేకమంది గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. ఇందుకు మహారాజు, ఆయన మద్దతుదారులు బాధ్యులని ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుకు రాజు 8 లక్షల రూపాయల జరి మానా చెల్లించాలని కూడా ఆదేశించింది. దీన్ని ప్యాలెస్‌ఖండించింది. మరోవైపు ప్రభువు మద్దతుదారులంతా నిధులు సేకరించి సొమ్ము చెల్లించటానికి సిద్ధమవుతున్నారు.

ఒకప్పుడు రాచరికాన్ని కాదనుకున్న  నేపాలీ సమాజం ఇప్పుడు రాజుకు ఎందుకు మద్దతు పలుకుతోంది? ఇందుకు నేపాల్‌  పాలకుల తీరే కారణం. 2008లో నేపాల్‌లో రాచరికం రద్దయిన తర్వాత 17 ఏళ్ల కాలంలో 18  ప్రభుత్వాలు నేపాల్‌ను పాలించాయి. ఏ ఒక్క ప్రభుత్వం కూడా సజావుగా పాలించిన రికార్డు లేదు. అవసరార్థం సర్దుబాట్లు చేసుకుని సంకీర్ణ ప్రభుత్వాలను నడిపారు. ఇప్పటి కేపీ ఓలి, షేర్‌ కుమార్‌ దుబా, ప్రచండ... ఇలా ప్రధానులంతా తీవ్ర అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న వారే. రాజకీయ అస్థిరత ఒకవైపు, అవినీతి మరోవైపు నేపాల్‌ను దారుణంగా దెబ్బతీశాయి. ఆర్థిక వ్యవస్థ దారు
ణంగా దెబ్బతింది. ఉపాధి అవకాశాలు తగ్గి పోయాయి. యువత దేశాన్ని వదిలి ఉపాధి కోసం బయట దేశాలకు వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజు మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకుంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. రాచరికాన్నిరద్దు చేయటం వల్ల నేపాల్‌ సార్వభౌమాత్వానికి దెబ్బ తగిలిందనీ, తిరిగి రాజు అధికారం చేపడితే ప్రపంచ దేశాల్లో నేపాల్‌ గుర్తింపు సంపాదిస్తుందని భావిస్తున్న వాళ్లు కొందరు ఉన్నారు.   

మరొక అంశం ‘హిందూత్వ’. నేపాల్‌ను హిందూ స్టేట్‌గా మార్చాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఇందుకోసం తెరవెనక ప్రయత్నాలు సాగుతున్నాయి. మహరాజు జ్ఞానేంద్ర ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ కావటం, ఆయన ఫొటోలు నేపాల్‌ వీధుల్లో దర్శనం ఇవ్వటం వంటి ఇటీవల పరిణామాలు దీనికి బలాన్ని ఇస్తున్నాయి. అల్లర్ల వెనక భారత్‌ ఉందని నేపాల్‌ ప్రభుత్వం ఆరోపించటానికి ఇది కూడా ఒక కారణమని మనం భావించవచ్చు. 
ఇప్పుడు చెలరేగుతున్న ఆందోళనలు రానున్న రోజుల్లో ఎటు దారితీస్తాయో తెలి యదు. నేపాల్‌లో ఆందో ళనలకు రాష్ట్రీయ ప్రజా
తంత్ర పార్టీ నాయకత్వం వహిస్తున్నా, ఇందులో అసాంఘిక శక్తులతో పాటు చైనా పాత్రను కొట్టేయలేం. చాలా కాలంగా చైనా ఆధ్వ ర్యంలో నేపాల్‌లో భారత్‌ వ్యతిరేక కార్యక్రమాలు సాగుతున్నాయి. దీనికి కమ్యూనిస్టు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. సరిహద్దులో ఆగడాలను చూసీ చూడకుండా వదిలేస్తోంది. భారత్‌తో సంబంధాలు దెబ్బ తిన్నప్పుడు రాజు జ్ఞానేంద్ర చైనాతో స్నేహంగా మసిలిన మాట నిజమే. అలాగని ఆయనకు ఇప్పుడుచైనా మద్దతుగా ఉంటుందని భావించలేం. నేపాల్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని యూఎస్, యూకే, ఇండి యాలు గుర్తిస్తున్నాయి. ప్రజాపాలన నుంచి రాచరికంలోకి మారినంత మాత్రాన నేపాల్‌ అభివృద్ధి ఫలాలను అందుకుంటుందని చెప్పలేం. రాజు అధికారంలోకి వస్తే అన్నీ సర్దుకుంటాయన్న భావన తార్కికంగా సమంజసంగా లేదు. మార్పు మంచిదే. అదీ అభివృద్ధికి తోవ చూపించినప్పుడే కదా? 

డా.పార్థసారథి చిరువోలు 
సీనియర్‌ జర్నలిస్ట్‌ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement