యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం విశేష పర్వాలు కొనసాగాయి. ఉదయం ఆలయంలో నిత్య కల్యాణంలో భాగంగా శ్రీస్వామివారిని గజ వాహనంపై ప్రథమ ప్రాకార మండపంలో ఊరేగించారు. సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ఆలయ తిరు, మాడ వీధుల్లో సేవోత్సవం చేపట్టారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజలి సేవోత్సవం నిర్వహించారు.
రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి సన్నిధిలో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు శ్రీసీతారామచంద్ర స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ భాస్కర్‌రావు శుక్రవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 5న రాత్రి 8గంటలకు శ్రీసీతారామచంద్రస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం, 6న శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం, 7న శ్రీసీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేక మహోత్సవం, రాత్రి 8గంటలకు శ్రీస్వామి వారి డోలోత్సవం, 8న శ్రీసత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 9న నిత్య పూజలు ఉంటాయని తెలిపారు.