
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ జాక్ పాట్ కొట్టనున్నాడని తెలుస్తుంది. త్వరలో బీసీసీఐ ప్రకటించబోయే సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కించుకోనున్నాడని సమాచారం. అభిషేక్‌తో పాటు టీమిండియా యువ ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకోనున్నారని తెలుస్తుంది.
పై నలుగురికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ల్లో గ్రేడ్-సి హోదా దక్కవచ్చు. ఈ నలుగురికి గ్రేడ్-సి దక్కితే అనేక వెసలుబాటులతో పాటు ఏడాదికి రూ. కోటి వార్షిక వేతనం లభిస్తుంది.
బీసీసీఐ స్టాండర్డ్ పాలసీ ప్రకారం.. ఓ ఆటగాడు నిర్దిష్ట వ్యవధిలో (కాంట్రాక్ట్ ప్రకటించే ముందు ఏడాదిలో అక్టోబర్ నుండి సెప్టెంబర్ వరకు) కనీసం మూడు టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడి ఉంటే సెంట్రల్ కాంట్రాక్ట్ గ్రేడ్-సిలో చేర్చబడతారు. అభిషేక్ నిర్దిష్ట వ్యవధిలో టీమిండియా తరఫున 12 టీ20లు ఆడాడు. మొత్తంగా అతను భారత్ తరఫున 17 టీ20లు ఆడాడు.
నితీశ్ విషయానికొస్తే.. 21 ఏళ్ల ఈ ఆంధ్ర ఆల్ రౌండర్ భారత్ తరఫున ఐదు టెస్టులు, నాలుగు టీ20లు ఆడాడు. నిర్దిష్ట వ్యవధిలోనే నితీశ్ ఈ మ్యాచ్‌లను ఆడాడు. నితీశ్ గతేడాది చివర్లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్ట్‌ల్లో పాల్గొన్నాడు. ఆ సిరీస్‌లో సత్తా చాటడంతోనే నితీశ్ రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు.
హర్షిత్ రాణా విషయానికొస్తే.. ఇతడు సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు ఆడాల్సిన మ్యాచ్‌లను ఆడనప్పటికీ, బీసీసీఐ ఇతని విషయంలో ఉదారంగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తుంది. రాణా టీమిండియా తరఫున కేవలం రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టీ20 మాత్రమే ఆడాడు. రాణా.. మూడు ఫార్మాట్లలో దేనిలోనూ విడిగా ప్రమాణాలను నెరవేర్చలేదు. కానీ అతనికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
వరుణ్ చక్రవర్తి విషయానికొస్తే.. ఇతడు భారత్ తరఫున నాలుగు వన్డేలు, 18 టీ20లు ఆడి బీసీసీఐ కాంట్రాక్ట్ పొందేందుకు అర్హుడిగా ఉన్నాడు.
పై నలుగురితో సహా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకునే వారిలో మరో పెద్ద పేరు ఉండనుంది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో రఫ్ఫాడించిన శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోకి తిరిగి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శ్రేయస్‌కు ఏ- గ్రేడ్ దక్కే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించవచ్చు.
ప్రస్తుతం బీసీసీఐ కాంట్రాక్ట్‌లు కలిగిన ఆటగాళ్లు..
గ్రేడ్-ఏ ప్లస్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.
గ్రేడ్-ఏ: అశ్విన్, మొహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా.
గ్రేడ్-బి: సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.
గ్రేడ్-సి: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పాటీదార్.