
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ల హవా కొనసాగింది. టాప్-5లో ఏకంగా ముగ్గురు చోటు దక్కించుకున్నారు. రెండో స్థానంలో అభిషేక్ శర్మ, 4, 5 స్థానాల్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ అగ్రపీఠంపై తిష్ట వేశాడు. పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో ప్లేస్‌కు పడిపోగా.. శ్రీలంక ఆటగాడు పథుమ్ నిస్పంక ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరాడు.
ఇవి మినహా ఈ వారం టాప్-10 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవు. పాక్‌తో జరుగుతున్న సిరీస్‌లో చెలరేగిపోతున్న న్యూజిలాండ్ బ్యాటర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ ఈ వారం ర్యాంకింగ్స్‌లో గణనీయంగా లబ్ది పొందారు. సీఫర్ట్ 20 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్థానానికి చేరగా.. అలెన్ 8 స్థానాలు మెరుగుపర్చుకుని 18వ స్థానానికి ఎగబాకాడు. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 12, రుతురాజ్ గైక్వాడ్ 26, సంజూ శాంసన్ 36, శుభ్‌మన్ గిల్ 41, హార్దిక్ పాండ్యా 52, రింకూ సింగ్ 54, శివమ్‌దూబే 57 స్థానాల్లో ఉన్నారు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. విండీస్ స్పిన్నర్ అకీల్ హొసేన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రెండో స్థానంలో నిలిచాడు. వరుణ్‌కు టాప్ ప్లేస్‌లో ఉన్న అకీల్ హొసేన్‌కు కేవలం ఒక్క పాయింట్ వ్యత్యాసం మాత్రమే ఉంది. టాప్-10లో వరుణ్ సహా ముగ్గురు భారత బౌలర్లు ఉన్నారు. రవి బిష్ణోయ్ 6, అర్షదీప్ సింగ్ 9 స్థానాల్లో కొనసాగుతున్నారు.
తాజాగా పాక్‌తో జరిగిన రెండు టీ20ల్లో అద్భుత ప్రదర్శనలు చేసిన న్యూజిలాండ్ బౌలర్లు ర్యాంక్‌లను భారీగా మెరుగుపర్చుకున్నారు. జేకబ్ డఫీ 23 స్థానాలు మెరుగుపర్చుకుని 12వ స్థానానికి ఎగబాకగా.. బెన్ సియర్స్ 22 స్థానాలు మెరుగుపర్చుకుని 67వ స్థానానికి.. జకరీ ఫౌల్క్స్ 41 స్థానాలు మెరుగుపర్చుకుని 90వ స్థానానికి చేరారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 38, బుమ్రా 41, హార్దిక్ పాండ్యా 48 స్థానాల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాక్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ మినహా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడం లేదు. ఈ సిరీస్ ముగిశాక మరో మూడు నెలలు అస్సలు అంతర్జాతీయ మ్యాచ్‌లే జరుగవు. మార్చి 22 నుంచి ఐపీఎల్ స్టార్ట్ కానుండగా అన్ని జట్ల ఆటగాళ్లు ఆ లీగ్‌తోనే బిజీగా ఉంటారు. ఈ మూడు నెలల కాలంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ ఉండవు.
Comments
Please login to add a commentAdd a comment