ఇంగ్లండ్‌తో నాగపూర్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ తరుఫున మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)ని రంగంలోకి దించుతారని అందరూ భావించారు. అయితే, గురువారం నాటి ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడినప్పటికీ వరుణ్‌కు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇందుకు బదులుగా ఆల్‌రౌండర్లైన రవీంద్ర జడేజా(Ravindra Jadeja), మరో ఎడం చేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)లతో భారత్ బరిలోకి దిగింది. ఈ ఫార్ములా టీమిండియాకు బాగానే పనిచేసింది.
తడబడినా రాణించిన రానా
ఇక పేస్ బౌలర్లలో గాయం నుంచి కోలుకున్న మహమ్మద్ షమీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాలతో పాటు 23 ఏళ్ళ హర్షిత్ రాణాకి స్థానం ఇచ్చారు. అతడికి ఇదే తొలి వన్డే. ఢిల్లీకి చెందిన హర్షిత్ రాణా గత సీజన్ లో ఐపీఎల్ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరుఫున ఆడిన రానా 13 మ్యాచ్ లలో 20.15 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా లో నాలుగో బౌలర్ గా నిలిచాడు.
ఇక డెత్ ఓవర్లలో 9.85 పరుగుల సగటు తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన రాణా.. అరంగేట్రంలోనే మూడు వికెట్లు పడగొట్టి వన్డే జట్టులోనూ స్థానం సంపాదించాడు.
అయితే నాగపూర్ లో తన తొలి స్పెల్ లోని మూడో ఓవర్లో రాణా ఏకంగా 26 పరుగులు ఇచ్చి ఓ చెత్త రికార్డుని తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మూడు సిక్సలు, రెండు బౌండరీలతో ఏకంగా 26 పరుగులు సాధించాడు.
అయితే అతడి స్థానంలో తర్వాత బౌలింగ్ కి వచ్చిన హార్దిక్ పాండ్యా నిలకడగా బౌలింగ్ చేయడమే కాక , అదే ఓవర్లో సాల్ట్ రనౌట్ అవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కి బ్రేకులు పడ్డాయి. మళ్ళీ రెండో స్పెల్ కి వచ్చిన రాణా ఎంతో మెరుగ్గా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ మరో ఓపెనర్ బెన్ డకేట్ వికెట్ తీయడమే కాక మొత్తం మీద ఏడు ఓవర్లలో 53 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
షమీ రాకతో కొంత ఊరట
ఇక గాయం నుంచి కొలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చిన ౩౩ ఏళ్ళ షమీ పొదుపుగా బౌలింగ్ చేసి 38 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి నుంచి కోలుకోవడం పై స్పష్టమైన సమాచారం లేక పోవడం తో షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యల బౌలింగ్ భారత్ జట్టు మేనేజిమెంట్ కి కొద్దిగా ఊరట కలిగించవచ్చు. అయితే బుమ్రా లేని లోటు పూరించడం కష్టమే అయినా ఈ ముగ్గురు రాణించడం పేస్ బౌలింగ్ భారం కొద్దిగా తగ్గినట్టు భావించవచ్చు.
వరుణ్‌కు త్వరలో అవకాశం
అయితే ఈ మ్యాచ్ కి ముందు అందరూ ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తప్పక ఆడతాడని భావించారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్ లో వరుణ్ రాణించడమే ఇందుకు కారణం. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ జట్టులో వరుణ్ కి స్థానం కల్పించడానికి ముందు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ లో ఆడించడం చాల ముఖ్యం.
ఈ నేపథ్యంలో నాగపూర్ లో 33 ఏళ్ల వరుణ్ ఆడటం ఖాయమని భావించారు. అయితే మ్యాచ్ కి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ అయితే ఈ టోర్నమెంట్ లో ఏదో ఒక దశ లో వరుణ్ ఆడే అవకాశం ఉందని వివరించాడు.
అయితే అతడు ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడడం పై ఇప్పుడే స్పష్టంగా చెప్పలేనని ఈ టోర్నమెంట్ లో అతని ప్రదర్శన పై అది ఆధారపడి ఉంటుందని రోహిత్ వివరించాడు. "వరుణ్ బౌలింగ్ లో వైవిధ్యం ఉంది. ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఇది రుజువైంది. అయితే అతని ఆడింది టి20 ఫార్మాట్ అయినందున వన్డేల్లో అతని ప్రదర్శనపై ఇంకా అంచనా వేయాల్సి ఉందని రోహిత్ వ్యాఖ్యానించాడు.
"ఈ సిరీస్‌లో వరుణ్ తో ఏదో ఒక దశలో ఆడించడానికి ప్రయత్నిస్తాం. అతని సామర్థ్యం ఏమిటో చూడటానికి ఇది మాకు అవకాశాన్ని కలిపిస్తుంది. ప్రస్తుతం మేము అతన్ని తీసుకోవాలా వద్దా అనే దాని గురించి ఆలోచించడం లేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపికలో వరుణ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే, అతని ప్రదర్శన కూడా మేము ఆశించిన స్థాయిలో ఉంటే వరుణ్ కి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో అవకాశం కల్పించే అవకాశం పై తప్పక పరిశీలిస్తాం’’ అని రోహిత్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment