
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) వ్యవహరించిన తీరును కివీస్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ తప్పుబట్టాడు. వికెట్ కోసం అప్పీలు చేసే క్రమంలో జడ్డూ ప్రవర్తించిన విధానం సరికాదని.. అంపైర్ అతడికి హెచ్చరికలు జారీ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) చివరి మ్యాచ్‌లో భాగంగా భారత్- న్యూజిలాండ్‌తో తలపడిన విషయం తెలిసిందే.
శ్రేయస్ అద్భుత అర్ధ శతకం
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్(India vs New Zealand) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. టాపార్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(15), శుబ్‌మన్ గిల్(2), విరాట్ కోహ్లి(11) విఫలం కాగా.. మిడిలార్డర్ రాణించింది.
నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత అర్ధ శతకం(98 బంతుల్లో 79) సాధించగా.. అక్షర్ పటేల్(42), హార్దిక్ పాండ్యా(45) రాణించారు. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిగతా వారిలో కైలీ జెమీసన్, విలియం ఓ రూర్కీ, కెప్టెన్ మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ సాధించారు.
విలియమ్సన్ హాఫ్ సెంచరీ
ఇక 250 పరుగుల నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు 45.3 ఓవర్లలో 205 పరుగులు మాత్రమే చేసి కివీస్ జట్టు ఆలౌట్ అయింది. రచిన్ విఫలం(6) కాగా.. విలియమ్సన్ హాఫ్ సెంచరీ(81) చేయగా.. ఓపెనర్ విల్ యంగ్(22), మిచెల్ సాంట్నర్(28) మాత్రమే ఇరవై పరుగుల మార్కు అందుకోగా.. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు.
భారత బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో అద్భుతంగా రాణించగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు. పేసర్లలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. కివీస్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్‌ను అవుట్ చేసే క్రమంలో జడేజా వ్యవహరించిన తీరును కామెంటేటర్ సైమన్ డౌల్ విమర్శించాడు.
కివీస్ ఇన్నింగ్స్ 33వ ఓవర్ వేసిన జడ్డూ రెండో బంతిని అద్భుతంగా సంధించాడు. అతడి స్పిన్ మాయాజాలంలో చిక్కుకున్న లాథమ్ రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలం కాగా.. బంతి అతడి తొడకు తాకింది. లేదంటే బంతి నేరుగా ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టేదే. ఈ నేపథ్యంలో అంపైర్ లాథమ్‌ను లెగ్ బిఫోర్ వికెట్‌గా ప్రకటించగా అతడు పెవిలియన్ చేరాడు.
ఇదేం పని? ఆటగాడు ఇలా చేయొచ్చా?
అయితే, లాథమ్ విషయంలో జడేజా పిచ్ మధ్య వరకు వచ్చి అప్పీలు చేయడం సరికాదంటూ సైమన్ డౌల్ కామెంట్రీలో పేర్కొన్నాడు. ‘‘అతడు ఏం చేశాడో చూడండి. ఆటగాళ్లు ఇలా చేయవచ్చా? అతడిని అంపైర్ హెచ్చరించి ఉండాల్సింది’’ అని డౌల్ అభిప్రాయపడ్డాడు.
అసలు ఆటగాడు పిచ్ మధ్యలోకి రావడం ఏమిటంటూ అసహనం వెళ్లగక్కాడు. కాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. గ్రూప్-‘ఎ’ టాపర్‌గా నిలిచింది. ఇక అంతకుముందు ఇదే గ్రూపులో ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లను టీమిండియా ఓడించిన విషయం తెలిసిందే. ఇదే జోరులో... దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో మంగళవారం నాటి సెమీస్‌లోనూ గెలిచి ఫైనల్‌కు దూసుకువెళ్లాలని పట్టుదలగా ఉంది.
చదవండి: వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్