
గద్వాల కోట ముఖద్వారం
ఎల్లలు దాటిన నలసోమనాద్రి సంస్థాన కీర్తి
నేటికీ చెక్కుచెదరని అలనాటి ఆనవాళ్లు
గద్వాల: అది క్రీస్తుశకం 16వ శతాబ్దం. అనగనగా ఒక రాజు.. ఒక రోజు వేటకు బయల్దేరాడు. ఇంతలో రాజు వెంట వచ్చిన కుక్కల్ని కుందేళ్లు తరిమికొట్టాయి. ఆ నేల విశిష్టతకు అబ్బురపడిన ఆ రాజు అక్కడే రాజ్యం స్థాపించాడు. అదే గద్వాల సంస్థానం.. (Gadwal Samsthanam) ఆ రాజు పేరు నలసోమనాద్రి (పెద సోమభూపాలుడు). ప్రస్తుతం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సోమనాద్రి కాలనీలో కోట (ప్రస్తుత ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం) నిర్మించుకున్నారు. పూడూరు రాజధానిగా గద్వాల సంస్థానాన్ని అలంపూరు, కర్నూలు, కర్ణాటక (Karnataka) వరకు రాజ్యాన్ని విస్తరించారు. 1663లో రాజ్యస్థాపన జరిగితే.. 1948 అంటే భారతదేశంలో విలీనమయ్యే వరకు గద్వాల సంస్థానం కొనసాగింది. గద్వాల సంస్థానాన్ని చివరగా ఆదిలక్ష్మీ దేవమ్మ మహారాణి పాలించారు.
ఎల్లలు దాటిన రాజ్య విస్తరణ..
గద్వాల సంస్థానాన్ని నలసోమనాద్రి (పెద సోమభూపాలుడు) 1663లో స్థాపించారు. ఆయన 1712 వరకు పాలన కొనసాగించారు. నలసోమనాద్రి పాలనలో గద్వాల సంస్థానం ఎల్లలు దాటి విస్తరించింది. గద్వాల, అలంపూర్ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, కర్ణాటక రాష్ట్రంలో కూడా సోమనాద్రి పాలన కొనసాగింది. గద్వాలలో సోమనాద్రి పాలనలోని కోటగోడలు, పురాతన కట్టడాల ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. పూడూరు, అయిజ, రాజోళి, ప్రాగటూరు, అలంపూరు, కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటకలోని రాయచూరు, సిరిగుప్ప ప్రాంతాల్లో నేటికీ సోమనాద్రి పాలన ఆనవాళ్లు సజీవంగా కనిపిస్తాయి. గద్వాల కోటలో నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయం, రాజుల నివాసాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.

అధికారంలో ఉన్న భూ భాగాలు ఇవే..
నడిగడ్డ ప్రాంతంలో.. గద్వాల, పూడూరు, ధరూరు, అయిజ, రాజోళి, బోరవెల్లి, ప్రాగటూరు, అలంపూరు.
కర్నూలు ప్రాంతంలో.. కందనోలు, బండి ఆత్మకూరు, నంద్యాల, వెలుగోడు, శ్రీశైలం, చాగలమర్రి, అహోబిలం, సిరివెళ్ల, బనగానెపల్లె, బేతంచర్ల, డోన్, ఆదోని.
కర్ణాటక ప్రాంతంలో.. మానవ (ప్రస్తుతం మాన్వి), రాయచూరు, సిరిగుప్ప ప్రాంతాలు నలసోమనాద్రి పాలనలో గద్వాల సంస్థానం కింద పరిపాలన కొనసాగించాయి.

సాహిత్య పోషకులు..
గద్వాల సంస్థానాదీశులు సాహిత్య పోషకులుగా పేరుగాంచారు. వీరి హయాంలో పండితులు స్వర్ణయుగం (Golden era) చూశారనే చెప్పవచ్చు. అందుకే గద్వాలకు విద్వత్ గద్వాల అని పేరు వచ్చినట్లు చరిత్రకారులు నేటికీ చెబుతారు.