ఇప్పటికే 14 నెలలు వృథా.. ఇంకా టైం ఎలా అడుగుతారు?: సుప్రీం కోర్టు అసహనం | Live Updates On Telangana Defections Petition Supreme Court Hearings April 3rd | Sakshi
Sakshi News home page

ఇప్పటికే 14 నెలలు వృథా.. ఇంకా టైం ఎలా అడుగుతారు?: సుప్రీం కోర్టు అసహనం

Published Thu, Apr 3 2025 10:16 AM | Last Updated on Thu, Apr 3 2025 1:05 PM

Live Updates On Telangana Defections Petition Supreme Court Hearings April 3rd

న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టు(Supreme Court)లో విచారణ ముగిసింది. అన్నివైపులా వాదనలు పూర్తి కావడంతో జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే.. 8 వారాల్లోగా తీర్పు వెల్లడించాలని బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఇవాళ ఫిరాయింపుల కేసు(Defections Case)లో వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వీ బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రీజనబుల్‌ టైం ఏంటో చెప్పాలని స్పీకర్‌ను కోరుతూ.. మరోసారి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.  

మీ అభిప్రాయం ప్రకారం సమంజసమైన కాల వ్యవధి(Reasonable Time) అంటే ఎంత?. 2028 జనవరి-ఫిబ్రవరి వరకు ఎదురు చూసేలా.. వ్యవస్థను మార్చేందుకు అనుమతించాలా?. మేము కొంత న్యాయసమ్మతమైన ధోరణిని ఆశిస్తున్నాం అని సింఘ్వీని ఉద్దేశించి జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని.. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని వ్యాఖ్యానించారు. అనర్హత పిటిషన్లపై విచారణకు మీకు ఎంత సమయం కావాలి? అని ప్రశ్నించగా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరు నెలల సమయం కావాలి అని న్యాయవాది సింఘ్వీ అన్నారు. దీంతో జస్టిస్‌ గవాయ్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే 14 నెలల సమయం వృథా అయ్యింది. మరో ఆరు నెలలు ఎలా అడుగుతారు?. ఇన్ని నెలలు గడిచాక కూడా కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన సమయం రాలేదా? అని ప్రశ్నించారు. అయితే.. 

స్పీకర్‌కు తుపాకీ గురిపెట్టి నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారని లాయర్‌ సింఘ్వీ అన్నారు. ఈ క్రమంలో.. బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం కలుగజేసుకుని సీఎం రేవంత్‌ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. స్పీకర్‌ తరఫునే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన చెప్పారు. స్పీకర్‌ తరఫున సీఎం ఎలా కామెంట్‌ చేస్తారు?. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని అన్నారు. సీఎం ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో చెప్పాక.. పిటిషన్లపై విచారణ జరుగుతుందని మేమెలా నమ్మాలి అని లాయర్‌ సుందరం అన్నారు. 

దీనిపై జస్టిస్‌ గవాయ్‌(Justice Gavai) స్పందిస్తూ ‘‘సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా? గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా?’’ అని ప్రశ్నించారు. మరోవైపు అభిషేక్‌ మనుసింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. అయితే.. 

సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్‌ గవాయ్‌ హెచ్చరించారు. ‘‘మేం సంయమనం పాటిస్తున్నాం.. మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టులో కేసులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూశారని సింఘ్వీ పేర్కొనగా.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని జస్టిస్‌ గవాయ్‌ అన్నారు. అన్నివైపులా వాదనలు పూర్తి కావడంతో కేసు విచారణ ముగిస్తున్నట్లు.. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు జస్టిస్‌ గవాయ్‌ తెలిపారు. 

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కారు పార్టీ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని, ఉన్నత న్యాయస్థానం చెప్పినా వాళ్లపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని.. అనర్హత వేటు కోరుతూ బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగింది. బీఆర్‌ఎస్‌ తరఫున ఆర్యమా సుందరం, తెలంగాణ స్పీకర్‌ తరఫున ముకుల్‌ రోహత్గీ, అసెంబ్లీ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement