
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓ పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మేం (కోర్టులు) చేతులు కట్టుకొని కూర్చోవాలా?’ అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు తమ ముందుకు వచ్చే దాకా పార్టీ మారిన ఎమ్మె ల్యేలకు స్పీకర్ ఎందుకు నోటీ సులు జారీ చేయలేదని ప్రశ్నించింది. తొలి నోటీసు ఇచ్చేందుకు స్పీకర్‌కు 11 నెలలు ఎందుకు పట్టిందని నిలదీసింది.
‘ఒకవేళ కేసు మా ముందుకు రాకపోయి ఉండి ఉంటే మీరు (స్పీకర్) నాలుగేళ్లు కాలయాపన చేసేవాళ్లేమో?’ అంటూ చురకలు అంటించింది. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పీ)తోపాటు మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాందీలపై దాఖలైన రిట్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఎస్‌ఎల్పీపై సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం, రిట్ పిటిషన్‌పై దామ శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించగా స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, అభిషేక్ మనుసింఘ్వీ వాదించారు.
స్పీకర్ స్వతంత్రుడు...
తొలుత ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ‘స్పీకర్ స్వతంత్రుడు, కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలదు. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టుకు హైకోర్టులపై నియంత్రణ అధికారం లేదు. స్పీకర్ తన విధానాలకు స్వతంత్రుడు. కాబట్టి కోర్టు ఆదేశాలు ఇవ్వజాలదు’ అని పేర్కొన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది.
ఇది రాజ్యాంగ తీర్పులకు వ్యతిరేకమని వ్యాఖ్యానించింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని తాము స్పీకర్‌కు చెప్పలేమా? అంటూ ముకుల్ రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ‘మేం అలా చేయకపోతే రాజ్యాంగ నిబంధనలను నిరాశ పరిచినవారమవుతాం. 2, 3, 4 ఏళ్లు నిర్ణయం తీసుకోకపోయినా ఆర్టికల్ 226 కింద ఆదేశాలు జారీ చేయడానికి కోర్టుకు అధికారం లేదని మీరెలా అంటారు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది.
అనర్హత పిటిషన్లను నిర్దిష్ట కాలపరిమితిలో నిర్ణయించాలని తాము స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై రోహత్గీ స్పందిస్తూ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే హైకోర్టులో పిటిషనర్లు పిటిషన్ వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు వేస్తూ వచ్చారని.. కనీసం స్పీకర్‌కు ఫిర్యాదును పరిశీలించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని తెలిపారు.
చర్యలకు ఉపక్రమించొచ్చు
ముకుల్ రోహత్గీ వాదనలపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయి. 11 నెలలుగా స్పీకర్ ఫిరాయింపులపై స్పందించలేదు. మేం జోక్యం చేసుకున్న తర్వాతే కదా వాళ్లకు మీరు నోటీసులు ఇచ్చింది. మేం స్పందించకపోతే ఇలాగే మరో నాలుగేళ్లు వేచి చూసేవాళ్లేమో?, స్పీకర్ జోక్యం చేసుకోకుంటే మేం ఇలాగే చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచనట్లే.
రాజ్యాంగ సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన బాధ్యత మాపై ఉంది. ‘సింగిల్ బెంచ్ కేవలం స్పీకర్‌ను నాలుగు వారాల్లో షెడ్యూల్‌ను నిర్ణయించాలని మాత్రమే అడిగింది. అలాంటప్పుడు అందులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం లేదు. కానీ రాజ్యంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలు, అభ్యర్థనలను రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అయినా పాటించనప్పుడు.. వారిపై చర్యలు తీసుకొనే అధికారం ఉంటుంది.
మా నిర్ణయాన్ని స్పీకర్‌కు అభ్యర్థన రూపంలో తెలియపరుస్తాం. అప్పటికీ స్పీకర్ స్పందించకపోతే ఆర్టికల్ 142 ప్రకారం మా అధికారాలు ఉపయోగించి చర్యలకు ఉపక్రమిస్తాం. గతంలో మాకున్న అధికారాలతో ఓ స్పీకర్‌ను కోర్టుకు పిలిపించిన విషయాన్ని మర్చిపోవద్దు’ అంటూ ధర్మాసనం గుర్తుచేసింది. ముకుల్ రోహత్గీ వాదనల అనంతరం స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మనుసింఘ్వీ, ఎమ్మెల్యేల తరఫున రవిశంకర్ జంధ్యాల, ఎమెల్యేల తరఫున గౌరవ్ అగర్వాల్‌లు వాదనలను వినిపించారు. స్పీకర్, స్పీకర్ కార్యదర్శి తరఫున ముగ్గురు వాదనలను వినిపిస్తారా? ఏం చెప్పినా ఒకటే కదా మీ అందరూ చెప్పేది అంటూ జస్టిస్ గవాయి వారిని ఉద్దేశించి వ్యంగ్రా్రస్తాలు సంధించారు.
సీఎం రేవంత్‌పై సుప్రీం ఆగ్రహం
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘రాష్ట్రంలో ఉపఎన్నికలు రావు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను విచారణ సందర్భంగా బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం సుప్రీం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘స్పీకర్ సమక్షంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను అపహస్యం చేసినట్లే’ అని ధర్మాసనం మండిపడింది.
అయితే తాను సీఎం తరఫున వాదనలను వినిపించట్లేదని.. అందువల్ల ఆ వ్యాఖ్యల గురించి వివరించలేకపోతున్నానని ముకుల్ రోహత్గీ బదులిచ్చారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ గతంలో అదే సీఎం తరఫున ఒక కేసులో హాజరైన విషయం మర్చిపోవద్దంటూ గుర్తుచేశారు. ‘రాజకీయ నాయకులు అసెంబ్లీలో ఏదైనా చెప్పినప్పుడు దానికి కొంత పవిత్రత ఉంటుంది, ప్రజలు ఆ మాటలను విశ్వసిస్తారు.
మేము కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేయడంలో నెమ్మదిగా ఉండొచ్చు.. కానీ శక్తిలేనివారమైతే కాదు. కాబట్టి ఇకపై ఇటువంటి వ్యాఖ్యలను పునరావృతం చేయొద్దని సీఎంకు చెప్పి హెచ్చరించండి’ అని ధర్మాసనం రోహత్గీకి సూచించింది. అనంతరం ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది. గురువారం స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. అనంతరం ఆర్యమా సుందరం రోహత్గీ, సింఘ్వీల వాదనలపై రిప్‌లై ఇవ్వనున్నారు.
ఆర్టికల్ 142 ఏం చెబుతోందంటే...
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు విస్తృతాధికారాలు కల్పిస్తోంది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై అవసరమైన ఉత్తర్వులు జారీ చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ ఉత్తర్వులను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అమలు చేసి తీరాల్సిందే. గతంలో ఈ ఆర్టికల్ మేరకు అధికారాలను వినియోగించి భోపాల్ గ్యాస్ లీక్ కేసులో పరిహారం అందించాలని, జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు వైన్ షాపులు ఏర్పాటు చేయవద్దని.. ఇలా పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.