
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చిమరీ కలవకపోవడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు అపాయిట్‌మెంట్ ఇవ్వడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ వెళ్లారు.
ఇంట్లో స్పీకర్ లేకపోవడంతో ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో రెండున్నర గంటల పాటు స్పీకర్ నివాసం వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరీక్షించి అయినప్పటికీ ఆయన రాకపోవటంతో వెనుదిరిగారు.
తమను స్పీకర్ కలవకపోవటంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. స్పీకర్ గడ్డం ప్రసాద్.. అపాయింట్‌మెంట్ ఇచ్చి తమను కలవకపోవడం బాధాకరమని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడితోనే అసెంబ్లీ స్పీకర్ తమను కలవలేదని మండిపడ్డారు. రేపు మరోసారి స్పీకర్‌కు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారాయన.