
జెరూసలేం: ఇజ్రాయెల్-హెజ్‌బొల్లాల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు వర్గాలు దాడులతో చెలరేగిపోతున్నాయి. ఈ క్రమంలో హెజ్‌బొల్లా వద్ద రష్యాకు చెందిన ఆయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు చెప్పడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, హెజ్‌బొల్లాకు రష్యా సహకరిస్తోందన్న అనుమానాలను నెతన్యాహు వ్యక్తం చేశారు.
హెజ్‌బొల్లాపై యుద్ధం సందర్భంగా ఇజ్రాయెల్ దళాలు వారి సొరంగాలను కనుగొన్నారు. ఇజ్రాయెల్ బాంబు దాడులతో సొరంగాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ఆ సొరంగాల్లో రష్యాకు చెందిన ఆయుధాలను ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా ఆయుధాలపై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా మాట్లాడుతూ..‘దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన సోదాల్లో రష్యాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు కనుగొన్నాం. లిటాని నదికి దక్షిణాన లెబనాన్ ఆర్మీకి మాత్రమే ఆయుధాలు కలిగి ఉండే అనుమతి ఉందని 2006లో యూఎన్ భద్రతామండలి తీర్మానించింది. అయినప్పటికీ హెజ్‌బొల్లా ఆ ప్రాంతాల్లో వందలాది సొరంగాలను తవ్వి.. స్థావరాలుగా మార్చుకుంది. అక్కడే రష్యాకు చెందిన ఆయుధాలు లభించాయి. ఒకరిని రెచ్చగొట్టడం మా లక్ష్యం కాదు. లెబనాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే ఉద్దేశం మాకు లేదు. లెబనాన్ సరిహద్దుల్లో నివసిస్తున్న మా పౌరులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరడమే మా లక్ష్యం’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. గత నెలలో ఇరాన్ మద్దతుతో లెబనాన్‌లోని హెజ్‌బొల్లాలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన సోదాల్లో రష్యా, చైనాకు సంబంధించిన ఆయుధాలు కనుగొన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనాలు వెల్లడించింది. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా వద్ద రష్యా ఆయుధాలు ఉన్నాయని నిరూపితమైంది.
🔴 Netanyahu has said that the Israeli military found "state-of-the-art" Russian weapons during a search of Hezbollah bases in Lebanon.
- The Times of Israel pic.twitter.com/ohuvH48zLr— war observer (@drmubashir599) October 17, 2024