Cyclone Lehar
-
రాష్ట్రానికి తప్పిన లెహర్ ముప్పు
-
లెహర్ ముప్పు తప్పింది
సాక్షి, ఏలూరు : పెను తుపానుగా మొదలై అనూహ్యంగా బలహీనపడిన ‘లెహర్’ ప్రభావం జిల్లాపై పెద్దగా కనిపించలేదు. గురువారం తీవ్రతను తగ్గించుకుంటూ మచిలీ పట్నం సమీపంలోని పాలకాయల తిప్ప వద్ద తీరం దాటడంతో జిల్లాకు పెనుముప్పు తప్పింది. సముద్ర తీరం వెంబడి గాలులు, జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పనలమీదున్న వరి, హెలెన్ తుపానుకు నీటమునిగిన చేలు మరింతగా తడిసిపోవడంతో పనికిరాకుండా పోయి రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. కోలుకోలేని విధంగా నష్టపోయిన రైతుల్ని పూర్తిస్థాయిలో ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని కలెక్టర్ సిద్ధార్థజైన్ ప్రకటించారు. మరో 12గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని, 24 గంటలపాటువర్షాలు తప్పవని వాతావరణ శాఖ వెల్లడించడంతో అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లోనే బాధితులు లెహర్ తుపాను తీవ్రత దృష్ట్యా లోతట్టు ప్రాం తాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నరసాపురం మిషన్ హైస్కూల్లో పెదమైనవానిలంక, చినమైనవానిలంక, వేములదీవి వెస్ట్, ఈస్ట్ గ్రామాల ప్రజలకు, వేముల దీవి తూర్పు గ్రామస్తులకు ప్రాథమిక పాఠశాలలో, మొగల్తూరు మండలం కుమ్మరిపురుగుపాలెంలో ఆ గ్రామస్తులకు పునరావాస కేం ద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని కలెక్టర్‌తోపాటు విపత్తుల నివారణ ప్రత్యేక అధికారి సంజయ్‌జాజు పరిశీలించారు. మొత్తంమీద 51 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, 8,059 మందికి భోజన వసతి, సౌకర్యాలు కల్పిం చారు. 46 మొబైల్ వైద్యబృందాలు, 240 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. తొలుత 22 వేల మందిని తరలించాలనుకున్నప్పటికీ తుపాను గండం గట్టెక్కడంతో ఆ ప్రయత్నాన్ని విరమించారు. కొనసాగుతున్న సహాయక చర్యలు విపత్తును ఎదుర్కోవడానికి ముందుగా చేసిన ఏర్పాట్లను అధికారులు కొనసాగిస్తున్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా తీరప్రాంత గ్రామాల్లో 150 జనరేటర్లు ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాలలో సేవలందించేందుకు ఏర్పాటు చేసిన 160 మంది సభ్యులు గల 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 278 మంది గజ ఈతగాళ్లు వారికి కేటాయించిన ప్రాంతాల్లోనే మకాం వేసి ఉన్నారు. సహాయ పునరావాస కార్యక్రమాలను నిర్వహించేందుకు 140 వాహనాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖకు చెందిన 9 ఫైర్ ఇంజిన్లు, 130 మంది సిబ్బంది తీరంలోనే ఉన్నారు. తీరప్రాంతంలో సమాచా రం కోసం ఏర్పాటు చేసిన 30 వైర్లెస్ సెట్లను అలాగే ఉంచారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో 3 క్రేన్లు, ఒక జేసీబీ రప్పించి, 700 విద్యుత్ స్తంభాలను సిద్ధం చేశారు. అత్యవసర సేవలు అందించేందుకు 550మంది విద్యుత్ సిబ్బందిని, 60మంది అధికారులను అందుబాటులో ఉంచారు. శుక్రవారం వరకూ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటామని ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్ ‘సాక్షి’కి చెప్పారు. నరసాపురం ఆర్డీవో కార్యాలయంలో 20 మంది కలెక్టరేట్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌ను కొనసాగిస్తున్నారు. పాలకొల్లులో అధిక వర్షపాతం గడచిన 24 గంటల్లో జిల్లాలో సగటున 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పాలకొల్లులో 10.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిం దని జిల్లా ముఖ్యప్రణాళికాధికారి కె.సత్యనారాయణ తెలిపారు. కాగా, ద్వారకాతిరుమలలో 1.4, నిడదవోలులో 0.8, తాడేపల్లిగూడెం, ఉం గుటూరు, నిడమర్రు, ఉండ్రాజవరం, పెంటపాడులలో 2.6, పెదవేగి, ఏలూరులో 1.6, పెదపాడులో 0.6, గణపవరంలో 3.4, తణుకులో 3, పెరవలిలో, ఇరగవరంలో 3.4, అత్తిలిలో 4, ఉండిలో 7, ఆకివీడు, కాళ్లలో 6, భీమవరంలో 6.8, పాలకోడేరులో 6.4, వీరవాసరంలో 8.4, పెనుమంట్రలో 4.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. పెనుగొండలో 4, ఆచంట, పోడూరులలో 6.2, యలమంచిలిలో 8.2, నరసాపురంలో 7.2, మొగల్తూరులో 9.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. త్వరలో సీఎం రాక : మంత్రి పితాని వెల్లడి జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలో పరిశీలిస్తారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, రోడ్లు భవనాల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడించారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.10 వేలు, కూలిన కొబ్బరి చెట్టుకు రూ.150నుంచి రూ.500 వరకూ నష్టపరిహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తుపానును ఎదుర్కోవడానికి ముందస్తు ఏర్పాట్లు చేసిన కలెక్టర్ సిద్ధార్థజైన్, జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, ఇతర అధికారులను మంత్రి పితాని అభినందించారు. -
గడిచిన గండం
అమలాపురం, న్యూస్‌లైన్ :ఊపిరి తీసుకునే వ్యవధి ఇవ్వకుండా వరుసగా విపత్తులతో జిల్లాపై కాఠిన్యం ప్రదర్శించిన ప్రకృతి కాస్త కనికరం చూపించింది. పెను విపత్తుగా పరిణమించవచ్చని భయపెట్టిన లెహర్ తుపాను.. వికృతరూపం దాల్చకుండానే నిష్ర్కమించింది. వరుస దెబ్బలతో తట్టుకోలేక విలవిల్లాడుతున్న రైతులను, తీరప్రాంతవాసులను గడచిన మూడు రోజులుగా ఠారెత్తించిన లెహర్ దిశ మార్చుకోవడంతోపాటు గురువారం తీరానికి వచ్చే సమయానికి బలహీనపడి వాయుగుండంగా మారింది. దీంతో గండం గట్టెక్కిందని ప్రజలు, అధికారులు స్థిమితపడ్డారు. అయితే ఇప్పటికే చావుదెబ్బలు తినీ, తినీ.. గట్టిగా నిట్టూర్చేందుకు గానీ, ప్రకృతిని తిట్టేందుకు గానీ సత్తువ లేనంతగా డీలా పడిన వరి రైతులు మాత్రం లెహర్తో పాటు వాన బెడదా పూర్తిగా విరగడ కావాలని కోరుకుంటున్నారు. లేకపోతే పోగా మిగిలిన గింజలు కూడా దక్కకుండా పోతాయని ఆక్రోశిస్తున్నారు. ప్రచండ వేగంతో దూసుకొస్తున్న లెహర్ తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని, ఆ సమయంలో 170 నుంచి 200 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ మూడు రోజుల క్రితం ప్రకటించింది. అప్పటికే హెలెన్ తుపాను కొట్టిన చావుదెబ్బ నుంచి కోలుకోకుండానే మరో భారీ విపత్తును ఎదుర్కొనాల్సి రావడంతో బాధితులు ముఖ్యంగా కోనసీమ, తీరప్రాంతవాసులు భీతిల్లిపోయారు. మరోవైపు అధికారులు ఉరుకులు, పరుగులు తీశారు. హెలెన్ తుపాను సందర్భంగా సరైన విధంగా స్పందించలేదని విమర్శల పాలవడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలింది. 1996లో కోనసీమను కకావికలం చేసిన పెనుతుపానును దృష్టిలో పెట్టుకుని లెహర్‌ను ఎదుర్కొనేందుకు హుటాహుటిన చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకాధికారి ఎం.రవిచంద్ర, కలెక్టర్ నీతూ ప్రసాద్‌లతో పాటు పలు శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం ఉదయం నుంచి తుపాను ప్రభావం ఉంటుందని బుధవారం సాయంత్రానికే తీరప్రాంతాల్లోని మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 15 మండలాల్లో 57 గ్రామాలపై లెహర్ తుపాను ప్రభావం చూపుతుందని అంచనా వేసిన అధికారులు బుధవారం రాత్రికి 73 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 29,865 మందిని తరలించారు. మిగిలినవారి తరలింపు బుధవారం అర్ధరాత్రి తర్వాత కూడా కొనసాగింది. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన 16 బృందాలు, ఆర్మీకి చెందిన రెండు బృందాలు జిల్లాలో మోహరించాయి. తుపాను సృష్టించగల విధ్వంసం గురించి హెచ్చరిస్తూ గడచిన రెండు రోజులుగా భారీగా ప్రచారం చేయడంతో జిల్లా ప్రజలు బుధవారం రాత్రి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. అమలాపురం, రాజోలు డిపోల నుంచి తీరప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను అధికారులు ముందుజాగ్రత్త చర్యగా నిలిపివేశారు.అయితే లెహర్ తుపాను తీరం దాటే సమయానికి బలహీనపడి వాయుగుండంగా మారడం, మచిలీపట్నం వద్ద తీరం దాటడంతో జిల్లాపై పెద్దగా ప్రభావం చూపలేదు. కోనసీమలో జోరువాన కాగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం రాత్రి వరకూ జిల్లాలోని అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, తుని, మండపేట తదితర ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి. అమలాపురంలో గురువారం రాత్రి సమయంలో పావుగంట పాటు భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటల నుంచి కోనసీమలోని పలుచోట్ల వర్షం జోరం దుకుంది. స్పల్పంగా ఈదురు గాలులు వీచాయి. ఉప్పాడ వద్ద సముద్రపు అలలు ఐదడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. తుపాను ప్రమా దం వీడినా పునరావాస కేంద్రాల్లో బాధితులు ఇళ్లకు వెళ్లేందుకు అధికారులు అంగీకరించడంలేదు. శుక్రవారం ఉదయం మాత్రమే వీరిని పంపే అవకాశం ఉంది. ఇప్పటికీ జిల్లాలో 26 మండలాల్లో 84 గ్రామాలకు చెందిన 31,665 మందిని వంద పునరావాస కేంద్రాల్లో ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే తుపాను ప్రభావం వీడడం తో మూడొంతుల మంది ఇళ్ల బాటపట్టారు. మిగిలినవారు పునరావాస కేంద్రాల్లోనే అరకొర సౌకర్యాల మధ్య అవస్థలు పడుతూ, సొంత గూళ్లకు చేరే సమయం కోసం ఎదురు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. హెలెన్ తుపాను వల్ల దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో తీరంలోని పలు గ్రామాల్లో ఇంకా అంధకారం నెలకొంది. కాట్రేనికోన, ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో తాగునీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాగా గురువారం పడ్డ వర్షం వరి రైతులను మరింత బెంగటిల్లజేస్తోంది. పోగా మిగిలిన నాలుగు గింజలనైనా దక్కించుకుందామన్న తమ ఆశ పాలిట ఈ వర్షం అశనిపాతమవుతుందని రైతులు వాపోతున్నారు. -
తీరం దాటిన లెహర్
-
బలహీనాపడుతున్న లెహర్ తుపాను
-
లెహర్ వర్రీ
అమలాపురం, న్యూస్‌లైన్ :జిల్లావాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ‘లెహర్’ గండం తప్పించమని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. బుధవారం ఎక్కడ చూసినా తాజా తుపాను హెచ్చరికలపైనే చర్చించుకోవడం కనిపించింది. బుధవారం ఉదయం ఎండ కాయగా, మధ్యాహ్నం నుంచి ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యమధ్యలో గాలులు వీస్తుండడం, సముద్రం 30 నుంచి 40 మీటర్లు వెనక్కు వెళ్లిపోవడం లెహర్ రాకకు సంకేతాలుగా భావిస్తున్నారు. తుపాను దిశమార్చుకుందని, ముందుగా చెప్పినట్టు కాకినాడ వద్ద కాక మచిలీపట్నం సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. అయితే జిల్లాపై తీవ్రత ఉంటుందని, పెనుగాలుల ప్రభావం తప్పదని చెప్పడంతో జిల్లావాసులను భయం వీడడం లేదు. కోనసీమవాసుల్లో ఆందోళన మరింత ఎక్కువగా ఉంది. హెలెన్ తుపాను వల్ల ఇప్పటికే చావుదెబ్బ తిన్న ఈ ప్రాంత వాసులు.. లెహర్ తీరం దాటే సమయంలో గంటలకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశముందన్న అంచనా ఈ ప్రాంత వాసులను మరింత కలవరానికి గురి చేస్తోంది. పునరావాస కేంద్రాల్లో కొరవడ్డ సదుపాయాలు తీరంలోని మత్స్యకార గ్రామాల్లో కర్ఫ్యూవాతావరణం నెలకొని.. ‘తుపాను ముందరి ప్రశాంతత’ రాజ్యమేలుతోంది. వందలాది కుటుంబాలు పెట్టేబేడా సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుండడంతో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. 1996 తుపానును దృష్టిలో పెట్టుకుని పోలీసులు, రెవెన్యూ అధికారులు మత్స్యకారులను పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తొలుత ఇళ్లు విడిచేందుకు వీరు నిరాకరించినా జేసీ ఎం.ముత్యాలరాజుతోపాటు పలువురు అధికారులు పట్టుబట్టి తరలిస్తున్నారు. తీరంలోని 15 మండలాల్లోని 57 గ్రామాలపై లెహర్ తీవ్ర ప్రభావం చూపుతుందన్న అంచనాతో ఇంత వరకు 29,865 మందిని తరలించారు. వీరి కోసం 73 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా సముద్రతీరాన్ని ఆనుకుని ఉండే వలస మత్స్యకారులను ముందుగా తరలించారు. కోనసీమలో అత్యధికంగా కాట్రేనికోన మండలంలోని మగసానితిప్ప, నీళ్లరేవు, చిర్రయానానికి చెందిన సుమారు ఐదు వేల మందిని కాట్రేనికోన తరలించారు. పల్లం, కొత్తపాలెం, మొల్లేటిమొగ, బలుసుతిప్పకు చెందిన మరికొంతమంది మత్స్యకారులను రాత్రి సమయంలో తరలించనున్నారు. ఐ.పోలవరం మండలంలో భైరవపాలెం నుంచి 3000 మందిని గాడిమొగలోని రిలయన్స్ సంస్థ భవనానికి తరలించారు. గోగుల్లంక, భైరవలంక, జి.మూలపొలం గ్రామాలకు చెందిన సుమారు 1,500 మందిని, ముమ్మిడివరం మండలం సలాదివారిపాలానికి చెందిన 200 మందిని, తాళ్లరేవు పిల్లలంక పంచాయతీ పరిధిలో కొత్తలంకకు చెందిన 150 మందిని, హోప్ ఐలాండ్‌కు చెందిన 200 మందిని, తాళ్లరేవు మండలం గాడిమొగకు చెందిన 500 మందిని, సఖినేటిపల్లి మండలం పల్లిపాలానికి చెందిన 150 మందిని, మలికిపురం మండలంలో తీరప్రాంత గ్రామాల నుంచి 500 మందిని, యానాంలో ఫ్రాన్స్తిప్పకు చెందిన 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే పునరావాస కేంద్రాల్లో కనీస సదుపాయాలు లేక, సరిపడా భోజనం కూడా పెట్టక బాధితులు అవస్థలు పడాల్సి వస్తోంది. యానానికి చెందిన వేటబోట్లు సముద్రంలో చిక్కుకున్నట్టు సమాచారం అందడం అధికారులను పరుగులు పెట్టించింది. అయితే ఈ బోట్లు కోల్‌కతాకు చేరుకున్నట్టు సమాచారం అందడంతో అధికారులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తం లెహర్ తుపానును ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తమవుతున్నారు. లెహర్ ప్రభావం తీవ్రంగా ఉండగలదని భావిస్తున్న ప్రాంతాలకు జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన పదవ బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్బెహరా నేతృత్వంలో 16 బృందాలు, ఆర్మీకి చెందిన మరో రెండు బృందాలు చేరుకున్నాయి. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారికి తుపానును ఎలా ఎదుర్కొనాలో సూచలు చేస్తున్నారు. తీరంలో పదుల సంఖ్యలో తుపాను షెల్టర్లు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉండడంతో వాటికి బదులు ఆయా ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే వందలాదిగా తరలిరావడంతో అవి కూడా కిక్కిరిసిపోతున్నారు. బాధితులకు కిరోసిన్ లాంతర్లు పంపిణీ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు తహశీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశించారు. ఆమెతో పాటు జిల్లా ప్రత్యేకాధికారి ఎం.రవిచంద్ర కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్‌లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మత్స్యకారులెవరైనా సముద్రంలో చిక్కుకుంటే రక్షించేందుకు ఓఎన్జీసీ, రిలయన్స్ వంటి సంస్థల సహకారాన్ని తీసుకోవాలని వారు స్థానికాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏటీఎంల వద్ద క్యూలు లెహర్ తీవ్రత 1996 నాటి తుపానును మించి ఉండగలదన్న హెచ్చరికల నేపథ్యంలో కోనసీమ ప్రజలు నిత్యావసర వస్తువులను ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. వారానికి సరిపడా బియ్యం, పప్పు, ఉప్పులు, కిరోసిన్, కూరగాయలు, తాగునీరు నిల్వ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తుపాను అనివార్యమైతే విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉండడంతో ఏటీఎంలు పనిచేయకపోవచ్చన్న ఆలోచనతో బ్యాంకుల ఖాతాదారులందరూ ముందస్తుగానే కొంత సొమ్మును డ్రా చేసుకుంటున్నారు. కోనసీమలో బుధవారం ఏ ఏటీఎం వద్ద చూసినా జనం క్యూ కట్టి కనిపించారు. పెట్రోల్ బంక్‌లు మూతపడే అవకాశం ఉండడంతో తమ వాహనాల్లో వారానికి సరిపడా పెట్రోల్, డీజిల్ నింపుకొంటున్నారు. పాల సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పాలపొడి ప్యాకెట్లను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. -
లెహర్ అటెన్షన్
రేపల్లె, న్యూస్‌లైన్ :లెహర్ తుపాను హెచ్చరికలతో తీరప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిజాంపట్నం ఓడరేవులో బుధవారం సాయంత్రం మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అధికారుల హెచ్చరికలతో వేటకు వెళ్లిన ఓడరేవులోని 150 మెకనైజ్డ్ బోట్లు, నిజాంపట్నం, రేపల్లె మండలాల పరిధిలోని సుమారు 700 మర బోట్లు దాదాపుగా ఒడ్డుకు చేరాయి. తీరప్రాంతంలోని రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి మండలాల్లో అధికారులు తుపాను ప్రభావిత ప్రాంతాలను గుర్తించిన అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అన్నివేళలా ఆయా బృందాలు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బోట్లు నిలుపుకునేందుకు స్థల సమస్య తుపాను హెచ్చరికలతో ఒక్కసారిగా ఒడ్డుకు చేరిన బోట్లు నిలుపుకునేందుకు ఓడరేవులో స్థల సమస్య వెంటాడుతున్నది. ఎప్పటి నుంచో రెండో జెట్టీ నిర్మిస్తామని అధికారులు చెబుతున్న మాటలు కార్యరూపం దాల్చటం లేదు. ప్రతి సారి విపత్తుల సమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంటున్నది. దీంతో బోట్లను పక్కపక్కనే ఇరుకుగా నిలుపుదల చేయటంతో గాలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఒకదానికి ఒకటి కొట్టుకుని దెబ్బతినటంతో నష్టాలు తప్పటం లేదు. దీంతో పాటు జెట్టీకి దూరంగా రేవులో చెట్లకు తాళ్లతో కట్టుకోవాల్సివస్తున్నది. విపత్తుల సమయంలో తాళ్లు తెగిపోయి బోట్లు సముద్రంలోకి కొట్టుకుపోయిన సందర్భాలు వున్నాయి. ఇప్పటికైనా రెండవ జెట్టీ నిర్మాణంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వెక్కిరిస్తున్న తుపాను షెల్టర్లు రేపల్లె మండలంలో 12 తుపాను షెల్టర్లు ఉండగా అందులో పది పూర్తిగా దెబ్బతిన్నాయి. సముద్ర తీరానికి అంచునే ఉన్న లంకెవానిదిబ్బ, రాజుకాల్వ, అడవిపాలెం, గంగడిపాలెం, మృత్యుంజయపాలెం, జొన్నావారిపాలెం, మోళ్లగుంట, కట్టవ, నిర్మలానగర్, చోడాయపాలెం గ్రామాల్లోని తుపాను భవనాలు పూర్తిగా దెబ్బతిని నిరుపయోగంగా మారాయి. ఇక నిజాంపట్నం మండలంలోని 20 తుపాను షెల్టర్లు మరింత అధ్వాన్న దశకు చేరాయి. తుపాను హెచ్చరికలు వెలువడిన ప్రతి సారి ఆయా గ్రామాల్లోని లోతట్టుప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేం దుకు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా తుపాను షెల్టర్లకు మరమ్మతులు నిర్వహించి వాడుకలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులతో ఎమ్మెల్యే మోపిదేవి సమావేశం.. తుపాను హెచ్చరికలతో రేపల్లె శాసన సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టుప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. -
తుపాను తీవ్రంగా ఉంటే రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ, న్యూస్‌లైన్: లెహర్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటే భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని దారి మళ్లిస్తామని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్ఓ సాంబశివరావు బుధవారం తెలిపారు. వచ్చే రెండు రోజుల్లో తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనావేస్తూ ఈమేరకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అయితే బుధవారం రాత్రి వరకు మళ్లింపులు, రద్దుపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, తుపాను ప్రభావం మొదలయ్యాకే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ముందుజాగ్రత్తగా ప్రధాన కేంద్రాల్లో ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, లెహర్ తుపాను నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే బుధవారం మూడు రైళ్లను మళ్లించింది. హెల్ప్‌లైన్ కేంద్రాల ఫోన్ నంబర్లు: విజయవాడ: 0866-2575038, 2767075; నెల్లూరు: 0861-2345863, 2345864; ఏలూరు: 08812- 226401; రాజమండ్రి: 0883- 2420541, 2420780; అనకాపల్లి: 08924-221698; గూడూరు: 086 24-251827; ఒంగోలు: 08592-280202/03; తాడేపల్లిగూడెం: 08818-226162; తుని: 08854-252172; నిడదవోలు - 08813-210325 సామర్లకోట - 0884-252172. -
ముంపు గ్రామాలపై దృష్టి పెట్టండి: సీఎం
సాక్షి, హైదరాబాద్: లెహర్ తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడా ప్రాణనష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో తుపానుపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటివరకు 101 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 27,000 మందిని తరలించామని రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ పార్థసారథి తెలిపారు. 61 మండలాల్లోని 763 ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కోస్తా జిల్లాలకు ప్రత్యేక అధికారులు: సహాయ, పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు వీలుగా కోస్తా జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. కృష్ణాకు బి.ఆర్.మీనా, తూర్పుగోదావరికి రవిచంద్ర, పశ్చిమగోదావరికి సంజయ్‌జాజు, గుంటూరుకు వెంకటేశం, విశాఖకు హర్‌ప్రీత్‌సింగ్, విజయనగరానికి రజత్‌కుమార్, శ్రీకాకుళానికి జి.వెంకట్రామ్రెడ్డి, నెల్లూరుకు రాజశేఖర్, ప్రకాశం జిల్లాకు కృష్ణబాబులను నియమించారు. సహాయక కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులు: తుపాను సహాయ, పునరావాస కార్యక్రమాల్లో ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని, అవసరమైనన్ని బస్సులను జిల్లా అధికారుల సూచనల మేరకు నడపాలని ఆర్టీసీ అధికారులను సంస్థ ఎండీ ఎ.కె.ఖాన్ ఆదేశించారు. -
తీవ్రత తగ్గుతున్న ‘లెహర్’
అతి తీవ్రస్థాయి నుంచి తీవ్ర తుపానుగా మార్పు నేడు మచిలీపట్నం వద్ద తీరం దాటనున్న లెహర్ సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి టెన్షన్ పుట్టించిన లెహర్ తుపాను తీవ్రత క్రమంగా తగ్గుతోంది. కాకినాడ నుంచి మచిలీపట్నం వైపు దిశమార్చుకుని అతి తీవ్ర స్థాయి నుంచి తీవ్ర తుపానుగా బలహీనపడుతోంది. తీరం దాటే సమయంలో మరింత బలహీనపడి తుపానుగానే మారొచ్చని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రానికి మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం తుపాను పశ్చిమ వాయవ్య దిశగా మచిలీపట్నానికి 450 కి.మీ. దూరంలో, కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా 470 కి.మీ. దూరంలో కదులుతోంది. లెహర్ ప్రభావంతో కోస్తాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం మినహా కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 29వ తేదీ వరకు ప్రభావం ఉంటుందని, ప్రకాశం జిల్లాతోపాటు తెలంగాణలోనూ వర్షాలు కురవొచ్చని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో కొన్నిచోట్ల 80 కి.మీ. నుంచి 90 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో వీటి తీవ్రత మరింత ఉంటుందన్నారు. మచిలీపట్నంలో ఏడో నంబర్, ఓడరేవు, కాకినాడలో ఆరో నంబర్, నిజాంపట్నంలో 5వ నంబర్, మిగతా అన్ని పోర్టుల్లోనూ మూడో నంబర్ ప్రమాద హెచ్చరికల్ని జారీ చేశారు. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఒక మీటరు ఎత్తు వరకు ఎగిసి పడొచ్చని, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మచిలీపట్నం తీరంలోనే ఎందుకు: తుపాన్లు మచిలీపట్నంలోనే ఎందుకు తీరం దాటుతున్నాయన్న అంశంపై నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా చల్లగాలులు వీస్తున్న కొద్దీ తుపాను బలహీనపడుతుంది. తుపాను ఎక్కడ తీరం దాటుతుందన్నది గాలి దిశపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వాయవ్యం నుంచి గాలులు వీస్తుండడంతో మచిలీపట్నం వైపు తుపాను దూసుకొస్తోంది. తుపాన్లు సముద్రంలో ఉన్నప్పుడు చాలా శక్తి కావాలి. కావాల్సిన ఉష్ణోగ్రతలుంటేనే అవి బలపడతాయని, నదీ ముఖ ద్వారాలవైపే పయణిస్తాయని వాతావరణశాఖ మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన: రాష్ర్టంలో బుధవారం అక్కడక్కడ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఆదిలాబాద్‌లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం సాయంత్రంలోపు తెలంగాణ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ప్రకాశం, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, విశాఖ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తగినంత సాయం చేస్తాం: కేంద్రం న్యూఢిల్లీ: లెహర్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు తగిన సహాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి బుధవారం భారత వాతావరణ విభాగం, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ)కు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమై తుపానుపై సమీక్షించారు. -
లెహర్ తుపానుతో అప్రమత్తం
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: లెహర్ తుపాను నేపథ్యంలో జిల్లాలో అంతటా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం తుపానుపై తీసుకుంటున్న చర్యల గురించి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుపాను ప్రభావం వలన శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు బుధవారం సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో తెనాలి ఆర్డీవో కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోలు రూములు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. తీర ప్రాంత గ్రామాల్లో ప్రత్యేక అధికారులను నియమించి ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.తీర ప్రాంతంలో 1422 మత్స్యకారుల బోట్లు ఉన్నాయని, వేటకు వెళ్లిన బోట్లలో 18 బోట్లు తప్ప మిగిలిన బోట్లు తీరం చేరాయన్నారు. ప్రాణ నష్టం జరుగకుండా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. తీరం నుంచి 1 నుంచి 12 కిలోమీటర్లు ఉన్న గ్రామాలు 12 ఉన్నాయన్నారు. ఆయా గ్రామాలకు చెందిన 13,687 కుటుంబాలకు చెందిన 50 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలివస్తున్నట్టు చెప్పారు. వర్షం, ఈదురు గాలుల ఉధృతికి కమ్యూనికేషన్స్, విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదముందన్నారు. వీటివల్ల రవాణా వ్యవస్థకు ఇబ్బంది లేకుండా పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ శాఖలతో రెండు బృందాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు.ఎన్ఆర్డీఎఫ్, ఏపీ బెటాలియన్ల నుంచి 23 మంది శిక్షణ పొంది అగ్నిమాపక శాఖ అధీనంలో ఉన్నారని కలెక్టరు తెలిపారు. ప్రజలు అధికారులతో సహకరించాలని కోరారు. హెలెన్ తుపానుకు దెబ్బతిన్న ఇళ్లకు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి బియ్యం, రూ.5 వేల రూపాయలు అందజేసినట్టు చెప్పారు. మొత్తం 6,814 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేసినట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 6,758 మత్స్యకార కుటుంబాలకు, 4,841 మంది చేనేత కార్మికులకు బియ్యం పంపిణీని త్వరలో చేపడుతున్నట్టు చెప్పారు. పై-లీన్ తుపాను వల్ల 35,109 హెక్టార్లలో పంటనష్టం జరిగిందన్నారు. హెలెన్ తుపానుకు సంబంధించి కచ్చితమైన పంట నష్ట నిర్దారణ జరగలేదని చెప్పారు. మొత్తం 53,800 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలియజేశారు.శిథిలావస్థలో ఉన్న తుపాను షెల్టర్స్‌ను కూల్చివేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 40 పోస్టులకు 7,540 దరఖాస్తులు ఇటీవల పంచాయతీ కార్యదర్శి పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీచేయగా 40 పోస్టులకు 7,540 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. డిగ్రీ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు తయారు చేస్తామన్నారు. ఇంటర్వ్యూలు ఉండవని కేవలం మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారికి 25 శాతం వెయిటేజీ ఇస్తామన్నారు. అభ్యర్థులు పైరవీలు చేయవద్దని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఎవరినీ నమ్మి డబ్బులు చెల్లించవద్దన్నారు. భర్తీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు.సమావేశంలో డీఆర్వో నాగబాబు తదితరులు పాల్గొన్నారు. -
తుఫాన్ల టై
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తుఫాన్ పేరెత్తితేనే జిల్లా ప్రజ లు ఉలిక్కి పడుతున్నారు. ప్రతియేటా దాడి చేస్తున్న తుఫాన్లు, వాయుగుండాలు జిల్లా వ్యవసాయ, ఆర్థిక రంగాలను కుదేలు చేస్తుండటాన్ని తలచుకొని బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలోనే సువిశాల తీరుప్రాంతం కలిగి ఉన్న జిల్లాకు వాయుగుండాలు, తుఫాన్లు కొత్త కాకపోయినా.. గత పదేళ్లలో వీటి వల్ల వాటిల్లిన పంట, ఆస్తి నష్టాలు.. ఎదుర్కొన్న కష్టాలు పీడకలగా మిగిలిపోయాయి. ముఖ్యంగా ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు తుఫాన్లు, మధ్యలో భారీ వర్షాలు, వరదలు జిల్లాలో పంటలను ఊడ్చేశాయి. ఇవి చాలవన్నట్లు లెహర్ రూపంలో మరో పెను తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడం, మచిలీపట్నం-కళింగపట్నం మధ్య అది తీరం దాటవచ్చని సూచించడంతో బెంబేలెత్తుతున్నారు. గత నెల 12న సంభవించిన ైపై-లీన్, తర్వాత వారం రోజుల వ్యవధిలోనే కురిసిన భారీ వర్షాలు, ముంచెత్తిన వరదలతో రెండు లక్షలకు పైగా ఎకరాల్లో ఆహార, ఉద్యానవన పంటలు నాశనమయ్యాయి. వేలాది మత్స్యకారులు జీవన భృతి కోల్పోయారు. ఇతర రంగాలపైనా వీటి ప్రభావం తీవ్రంగా ఉంది. వాటి నుంచి ప్రజలు ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఇప్పుడిప్పుడే పోయిన పంటల స్థానంలో మళ్లీ కొత్త పంట వేయడం, తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో పెను తుఫాన్ లెహర్ వార్తలు గుబులు పుట్టిస్తున్నాయి. ఈ తరుణంలో మిగిలిన కొద్దిపాటి పంటలను కాపాడుకోవడమెలా అని సతమతమవుతున్నారు. వరుస తుఫాన్లు, వాయుగుండాల నుంచి విముక్తి లేదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లెహర్కు ముందు గత పదేళ్లలో జిల్లాను ప్రభావితం చేసిన ప్రకృతి విపత్తుల క్రమం పరిశీలిస్తే... 2003 అక్టోబర్ 6,7 తేదీల్లో వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు 51 వేల హెక్టార్లలో పంట నష్టం జగిరింది. సుమారు 25వేల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. 2004 అక్టోబరు 3 నుంచి 5 తేదీల్లో తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు 2,900 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 20వేల మంది ప్రజలు అవస్థలు పడ్డారు. 2005 సెప్టెంబరు 18, 19 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు నాగావళి, వంశధార నదులు పొంగి 15వేల హెక్టార్లలో పంటలు నేలపాలయ్యాయి. 40 వేల మంది ప్రజలు నష్టపోయారు. 2010 మే నెలలో లైలా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు, చెరువులు ఇతర ఆస్తులకు నష్టం వాటిల్లింది. అదే ఏడాది.. అంటే 2010 అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు జల్ తుఫాన్ దాడి చేసింది. పెనుగాలులతో కూడిన వర్షాలతో సుమారు 3 లక్షల మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. 1.60 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇళ్లతోపాటు వందల కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంటలు పోయి వందల కోట్ల నష్టం వాటిల్లగా ప్రభుత్వం రూ.88 కోట్ల పరిహారం మాత్రమే మంజూరు చేసింది. 2012 అక్టోబర్ 28 నుంచి నవంబర్ 6 వరకు నీలం తుఫాన్ జిల్లాను అతలాకుతలం చేసింది. నలుగురు మరణించగా, 3 లక్షల మంది ప్రభావితులయ్యారు. 28వేల హెక్టార్లలో పంటలు పోయాయి. 24 పశువులు మృతి చెందాయి. వందల సంఖ్యలో పూరిళ్లు నేలమట్టమవగా వందల కోట్ల నష్టం వాటిల్లింది. 2013 అక్టోబర్ 12న పెను తుపాను పై-లీన్ పంజా విసిరింది. ఉద్దానం ప్రాంతంలోని సుమారు 25 వేల ఎకరాల్లో కొబ్బరి, జీడి, ఇతర ఉద్యానవన తోటలను నేలమట్టం చేసింది. వారం వ్యవధిలోనే అంటే అక్టోబర్ 22 నుంచి 27 వరకు వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదలు జిల్లాను ముంచేశాయి. 2 లక్షలకుపైగా ఎకరాల్లో వరి, ఇతర ఆహార పంటలు నీటమునిగాయి. వందల గ్రామాలు ముంపునకు గురయ్యాయి. రవాణా, సమాచార, నీటిపారుదల వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ రెండు విపత్తులతో అధికార అంచనాల ప్రకారమే సుమారు వె య్యి కోట్ల నష్టం వాటిల్లింది. 2013 నవంబర్ 13, 14 తేదీల్లో హెలెన్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిశాయి. వర్షాల తీవ్రత అంతగా లేకపోయినా పై-లీన్, భారీ వర్షాలతో నీటమునిగి అప్పటికే దెబ్బతిన్న పంటలు హెలెన్ వర్షాలతో మరింత దెబ్బతిన్నాయి. రైతులను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీశాయి. -
‘లెహర్’తోవిమానాల రద్దు!
సాక్షి, చెన్నై: లెహర్ దెబ్బతో చెన్నై నుంచి అండమాన్‌కు బయలు దేరాల్సిన విమానాలు, అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వీరికి నగరంలోని పలు హోటళ్లలో వసతి కల్పించారు. సముద్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు పట్టణాలు జలమయమయ్యాయి. అండమాన్ సమీపంలో బంగాళా ఖాతంలో ఏర్పడిన ద్రోణి తుపానుగా మారడంతో లెహర్ అని పేరు పెట్టారు. ఈ ప్రభావంతో రాష్ర్టంలోని సుముద్ర తీర జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం రాత్రి చెన్నై శివారులు, కాంచీపురం, కడలూరు, నాగపట్నం, విల్లుపురం, తూత్తుకుడిల్లో భారీ వర్షాలు కురిశాయి. చెన్నైలో ఉదయం 8 గంటల తర్వాత భానుడు ప్రతాపం చూపించాడు. లెహర్ ప్రభావంతో అండమాన్‌లో తీవ్ర వర్షం పడుతోంది. ఈ ద్రోణి ఆంధ్రా వైపుగా పయనిస్తుండటంతో రాష్ట్రం ఆ గండం నుంచి బయట పడ్డట్టేనని వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే, చెన్నై - కడలూరు, నాగపట్నం తీరాల్లో వర్షాలు పడుతాయని ప్రకటించింది. అలల తాకిడి క్రమంగా తగ్గుతుండటంతో జాలర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు. విమానాల రద్దు: లెహర్ ప్రభావంతో చెన్నై అండమాన్ మధ్య విమాన సేవలు రద్దు అయ్యాయి. ఉదయం ఐదు గంటలకు 120 మంది ప్రయాణికులతో అండమాన్‌కు బయలుదేరడానికి విమానం సిద్ధం అయింది. అయితే, అక్కడి వాతావరణ పరిస్థితులు విమాన సేవలకు అనుకూలంగా లేదన్న సమాచారంతో ఆ విమానం 9 గంటలకు బయలు దేరుతుందని ప్రకటించారు. దీంతో విమానంలోనే ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఎంతకూ విమానం బయలుదేరక పోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. చివరకు వాతావరణం అనుకూలించని దృష్ట్యా, ఆ విమాన సేవను రద్దు చేస్తున్నట్టు ఆ యాజమాన్యం ప్రకటించింది. ఉదయం ఏడు గంటలకు బయలు దేరాల్సిన ఎయిర్ వేస్, తొమ్మిది గంటలకు బయలు దేరాల్సిన బోయింగ్, పది గంటలకు బయలు దేరాల్సిన ప్రైవే టు విమాన సేవలు రద్దు అయ్యాయి. సుమారు 536 మంది ప్రయాణికులు అండమాన్‌కు వెళ్లాల్సి ఉండటంతో, వారంద రికీ నగరంలోని పలు హోటళ్లల్లో బస సౌకర్యం కల్పించారు. వాతావరణం అనుకూలించిన తర్వాత విమాన సేవలు అండమాన్‌కు పునరుద్ధరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అండమాన్ నుంచి ఇక్కడికి రావాల్సిన సుమారు ఐదు విమానాల సేవలు రద్దు అయ్యాయి. తమ వాళ్లకు ఆహ్వానం పలికేందుకు మీనంబాక్కంకు వచ్చిన బంధువులు, ఆప్తులు గంటల తరబడి పడిగాపులు కాసి, చివరకు సేవల రద్దుతో వెను దిరగాల్సి వచ్చింది. -
విశాఖ తీరానికి 1200 కి.మీ దూరంలో లెహర్
-
పైలీన్, హెలెన్ అయిపోయాయి - ఇప్పుడు లెహర్!
హైదరాబాద్: రాష్ట్రం మీద వరణుడు పగబట్టినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే వరుస తుపాన్లతో కకావికలమైన రాష్ట్రంపై వరణుడు మరోసారి విజృంభించనున్నాడు. ఈ క్రమంలో రాష్ట్రానికి మరో ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ ప్రమాదం ఇంతకుముందు ప్రమాదం కంటె మరింత తీవ్రమైనదని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ కొత్త తుపానుకు లెహర్ అని పేరు పెట్టారు. లెహర్ తుపాను హెలెన్ తుపాను కంటె ప్రమాదకరమైందని అధికారులంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరో 24 గంటల్లో తుపానుగా మారి రాష్ట్రం వైపు దూసుకొస్తుందని అధికారులు వివరించారు. పైలీన్, హెలెన్ తుపానులు అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా లెహర్ తుపాను ముంచుకొస్తోంది. కోస్తా తీరానికి లెహర్ తుఫాన్‌తో పెను ముప్పు పొంచి ఉందని విపత్తుల నివారణ శాఖ కమిషనర్ పార్ధసారధి హెచ్చరించారు. ప్రస్తుతం లెహర్ తుఫాన్ పోర్ట్‌బ్లెయిర్‌కు 200కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. ఈ రాత్రికి పోర్ట్‌బ్లెయిర్ వద్ద తీరం దాటే అవకాశముందని చెప్పారు. హెలెన్ తుఫాన్ కంటే లెహర్ తుఫాన్ తీవ్రమైందని, చాలా జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకూ అప్రమత్తంగా ఉండాలని పార్ధసారథి సూచించారు. ఒకటి రెండు రోజుల్లో లెహర్ తుఫాన్ కదలికలపై పూర్తి స్పష్టత వస్తుందని ఈ నెల 28న కాకినాడ వద్ద తీరం దాటే అవకాశంముందని తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకూ లెహర్తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. గుడిసెలు, పెంకుటిళ్లల్లో నివసించే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. తీరప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పార్థసారథి విజ్ఞప్తి చేశారు.