హైదరాబాద్: రాష్ట్రం మీద వరణుడు పగబట్టినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే వరుస తుపాన్లతో కకావికలమైన రాష్ట్రంపై వరణుడు మరోసారి విజృంభించనున్నాడు. ఈ క్రమంలో రాష్ట్రానికి మరో ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ ప్రమాదం ఇంతకుముందు ప్రమాదం కంటె మరింత తీవ్రమైనదని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ కొత్త తుపానుకు లెహర్ అని పేరు పెట్టారు. లెహర్ తుపాను హెలెన్ తుపాను కంటె ప్రమాదకరమైందని అధికారులంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరో 24 గంటల్లో తుపానుగా మారి రాష్ట్రం వైపు దూసుకొస్తుందని అధికారులు వివరించారు.
పైలీన్, హెలెన్ తుపానులు అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా లెహర్ తుపాను ముంచుకొస్తోంది. కోస్తా తీరానికి లెహర్ తుఫాన్‌తో పెను ముప్పు పొంచి ఉందని విపత్తుల నివారణ శాఖ కమిషనర్ పార్ధసారధి హెచ్చరించారు. ప్రస్తుతం లెహర్ తుఫాన్ పోర్ట్‌బ్లెయిర్‌కు 200కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. ఈ రాత్రికి పోర్ట్‌బ్లెయిర్ వద్ద తీరం దాటే అవకాశముందని చెప్పారు. హెలెన్ తుఫాన్ కంటే లెహర్ తుఫాన్ తీవ్రమైందని, చాలా జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకూ అప్రమత్తంగా ఉండాలని పార్ధసారథి సూచించారు. ఒకటి రెండు రోజుల్లో లెహర్ తుఫాన్ కదలికలపై పూర్తి స్పష్టత వస్తుందని ఈ నెల 28న కాకినాడ వద్ద తీరం దాటే అవకాశంముందని తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకూ లెహర్‌తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. గుడిసెలు, పెంకుటిళ్లల్లో నివసించే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. తీరప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పార్థసారథి విజ్ఞప్తి చేశారు.