లెహర్ తుపానుతో అప్రమత్తం
Published Wed, Nov 27 2013 2:00 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: లెహర్ తుపాను నేపథ్యంలో జిల్లాలో అంతటా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం తుపానుపై తీసుకుంటున్న చర్యల గురించి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుపాను ప్రభావం వలన శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు బుధవారం సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో తెనాలి ఆర్డీవో కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోలు రూములు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.
తీర ప్రాంత గ్రామాల్లో ప్రత్యేక అధికారులను నియమించి ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.తీర ప్రాంతంలో 1422 మత్స్యకారుల బోట్లు ఉన్నాయని, వేటకు వెళ్లిన బోట్లలో 18 బోట్లు తప్ప మిగిలిన బోట్లు తీరం చేరాయన్నారు. ప్రాణ నష్టం జరుగకుండా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. తీరం నుంచి 1 నుంచి 12 కిలోమీటర్లు ఉన్న గ్రామాలు 12 ఉన్నాయన్నారు. ఆయా గ్రామాలకు చెందిన 13,687 కుటుంబాలకు చెందిన 50 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలివస్తున్నట్టు చెప్పారు. వర్షం, ఈదురు గాలుల ఉధృతికి కమ్యూనికేషన్స్, విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదముందన్నారు.
వీటివల్ల రవాణా వ్యవస్థకు ఇబ్బంది లేకుండా పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ శాఖలతో రెండు బృందాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు.ఎన్‌ఆర్‌డీఎఫ్, ఏపీ బెటాలియన్‌ల నుంచి 23 మంది శిక్షణ పొంది అగ్నిమాపక శాఖ అధీనంలో ఉన్నారని కలెక్టరు తెలిపారు. ప్రజలు అధికారులతో సహకరించాలని కోరారు. హెలెన్ తుపానుకు దెబ్బతిన్న ఇళ్లకు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి బియ్యం, రూ.5 వేల రూపాయలు అందజేసినట్టు చెప్పారు. మొత్తం 6,814 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేసినట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 6,758 మత్స్యకార కుటుంబాలకు, 4,841 మంది చేనేత కార్మికులకు బియ్యం పంపిణీని త్వరలో చేపడుతున్నట్టు చెప్పారు. పై-లీన్ తుపాను వల్ల 35,109 హెక్టార్లలో పంటనష్టం జరిగిందన్నారు. హెలెన్ తుపానుకు సంబంధించి కచ్చితమైన పంట నష్ట నిర్దారణ జరగలేదని చెప్పారు. మొత్తం 53,800 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలియజేశారు.శిథిలావస్థలో ఉన్న తుపాను షెల్టర్స్‌ను కూల్చివేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
40 పోస్టులకు 7,540 దరఖాస్తులు
ఇటీవల పంచాయతీ కార్యదర్శి పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీచేయగా 40 పోస్టులకు 7,540 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. డిగ్రీ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు తయారు చేస్తామన్నారు. ఇంటర్వ్యూలు ఉండవని కేవలం మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారికి 25 శాతం వెయిటేజీ ఇస్తామన్నారు. అభ్యర్థులు పైరవీలు చేయవద్దని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఎవరినీ నమ్మి డబ్బులు చెల్లించవద్దన్నారు. భర్తీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు.సమావేశంలో డీఆర్వో నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement