లెహర్ అటెన్షన్
Published Thu, Nov 28 2013 2:10 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
రేపల్లె, న్యూస్‌లైన్ :లెహర్ తుపాను హెచ్చరికలతో తీరప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిజాంపట్నం ఓడరేవులో బుధవారం సాయంత్రం మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అధికారుల హెచ్చరికలతో వేటకు వెళ్లిన ఓడరేవులోని 150 మెకనైజ్డ్ బోట్లు, నిజాంపట్నం, రేపల్లె మండలాల పరిధిలోని సుమారు 700 మర బోట్లు దాదాపుగా ఒడ్డుకు చేరాయి. తీరప్రాంతంలోని రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి మండలాల్లో అధికారులు తుపాను ప్రభావిత ప్రాంతాలను గుర్తించిన అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అన్నివేళలా ఆయా బృందాలు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
బోట్లు నిలుపుకునేందుకు స్థల సమస్య
తుపాను హెచ్చరికలతో ఒక్కసారిగా ఒడ్డుకు చేరిన బోట్లు నిలుపుకునేందుకు ఓడరేవులో స్థల సమస్య వెంటాడుతున్నది. ఎప్పటి నుంచో రెండో జెట్టీ నిర్మిస్తామని అధికారులు చెబుతున్న మాటలు కార్యరూపం దాల్చటం లేదు. ప్రతి సారి విపత్తుల సమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంటున్నది. దీంతో బోట్లను పక్కపక్కనే ఇరుకుగా నిలుపుదల చేయటంతో గాలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఒకదానికి ఒకటి కొట్టుకుని దెబ్బతినటంతో నష్టాలు తప్పటం లేదు. దీంతో పాటు జెట్టీకి దూరంగా రేవులో చెట్లకు తాళ్లతో కట్టుకోవాల్సివస్తున్నది. విపత్తుల సమయంలో తాళ్లు తెగిపోయి బోట్లు సముద్రంలోకి కొట్టుకుపోయిన సందర్భాలు వున్నాయి. ఇప్పటికైనా రెండవ జెట్టీ నిర్మాణంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
వెక్కిరిస్తున్న తుపాను షెల్టర్లు
రేపల్లె మండలంలో 12 తుపాను షెల్టర్లు ఉండగా అందులో పది పూర్తిగా దెబ్బతిన్నాయి. సముద్ర తీరానికి అంచునే ఉన్న లంకెవానిదిబ్బ, రాజుకాల్వ, అడవిపాలెం, గంగడిపాలెం, మృత్యుంజయపాలెం, జొన్నావారిపాలెం, మోళ్లగుంట, కట్టవ, నిర్మలానగర్, చోడాయపాలెం గ్రామాల్లోని తుపాను భవనాలు పూర్తిగా దెబ్బతిని నిరుపయోగంగా మారాయి. ఇక నిజాంపట్నం మండలంలోని 20 తుపాను షెల్టర్లు మరింత అధ్వాన్న దశకు చేరాయి. తుపాను హెచ్చరికలు వెలువడిన ప్రతి సారి ఆయా గ్రామాల్లోని లోతట్టుప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేం దుకు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా తుపాను షెల్టర్లకు మరమ్మతులు నిర్వహించి వాడుకలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులతో ఎమ్మెల్యే మోపిదేవి సమావేశం.. తుపాను హెచ్చరికలతో రేపల్లె శాసన సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టుప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.
Advertisement